"యేసు శ్రమల ప్రవచనం - ప్రజలకు రక్షణ వాగ్దానం"
.jpg)
ఫాదర్ పూదోట దాసయ్య
24 Sep 2026
సామాన్య 25వ శుక్రవారము
"మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరించబడి, చంపబడి, మూడవ దినమున ఉత్థానమగుట, అగత్యము అని యేసు పలికెను."
(పు. లూకా 9:22)
ప్రార్థన: సజీవ దేవుని కుమారుడవైన ఓ యేసు ప్రభువా, మీ బాధామయ జీవితం ద్వారా ఈ లోకానికి విడుదలను, రక్షణను, జీవాన్ని ఇచ్చారు. మీ ప్రజలమైన మా మధ్య దైవ రాజ్యాన్ని స్థాపించారు. మా రక్షణార్థం, అనేక మహిమ కార్యాలు చేశారు. మీ ప్రబోధాల ద్వారా, మాలో, నిత్య జీవ ఆశాభావాన్ని, రేకెత్తించారు. అంధకారము నుండి విడుదల నిచ్చారు. వెలుగు మార్గం చూపారు. విశ్వాసంతో మీ చెంతకు వచ్చిన వారిని జీవంతో నింపారు. మమ్ము ప్రేమించి, మాకై ప్రాణ త్యాగం చేశారు. నీ గొప్ప ప్రేమకు, మాపై మీరు చూపిన దయా కనికరములకు కోట్లాది వందనాలు. ఓ యేసయ్యా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదా మత పెద్దలు, ప్రజలలో అనేకులు, మిమ్ము సాధారణ మనిషిగా చూశారేగాని, మీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక పోయారు. ప్రవక్తల ప్రవచనాలను నమ్మలేదు. ప్రవక్తలలో ఒకనిగా భావించారే గాని, మీ నిజ స్వభావాన్ని గ్రహించలేదు. మేమును, అనేక మార్లు, మీపై సంపూర్ణ విశ్వాసాన్ని, ఆశా భావాన్ని, ప్రేమను కనబరచలేదు. లోక బలహీనతలకు లొంగిపోయాము. కష్ట సమయంలో మీ వైపు చూడలేక పోయాము. నిరుత్సాహ పడుచున్నాము. ఆవేదనతో జీవించాము. సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువని, పేతురు సమాధానం ఇచ్చాడు. పరలోక తండ్రియే, ఈ విషయాన్ని పేతురుకి బయలు పరిచాడు. ఓ దేవా, మా అవిశ్వాసం వలన నిన్ను గుర్తించలేక పోతున్నాము. మీ బోధనలను ఆలకించినను, మాలో ఎలాంటి మార్పు రావడం లేదు. మీ అద్భుత కార్యాలను కళ్లారా చూసి కూడా, మీ యందు ఆధారపడి జీవించడం లేదు. రక్త మాంసాల వలన కాక, ఆత్మ ప్రేరేపణ వలన జీవించుటకు, మమ్ము మీ చిత్తానికి ఆకర్షించండి. ఓ ప్రభువా, దేవుని కుమారుడవైనను, మా కోసం శ్రమలను అనుభవించి, పెద్దలచే నిరాకరింపబడి, చంపబడి, మూడవ దినమున ఉత్థాన మయ్యారు. మీ మరణ పునరుత్థానంలోనే మీ స్వభావాన్ని, మా నిజ రూపాన్ని గ్రహించాము. ఆత్మజ్ఞానంతో మమ్ము నింపండి. దేవుని కుమారుడవైన క్రీస్తువని విశ్వసించి, మీ పరిశుద్ధ నామములో, రక్షణ పొందుదుముగాక. మిమ్ము తెలుసుకొని, సేవించి, ప్రేమించి, మోక్షం పొందేలా మాపై కనికరం చూపండి. మాకు ఎదురయ్యే శ్రమలలో, శోధనలలో, కృంగిపోకుండా, మీరు అనుభవించిన, దుఃఖ పూరితమైన శ్రమలను ధ్యానిస్తూ, ఓదార్పును పొంది, ఉత్థాన మహిమకై కాంక్షిస్తూ, విశ్వాసంతో, వినయ విధేయతలతో జీవించుదుముగాక. ఆమెన్.
ఆత్మాభ్యాసం:
1. యేసుక్రీస్తు భరించిన శ్రమలు, మరణ పునరుత్థానముల వలన, మానవాళి రక్షణకై దేవుని ప్రణాళిక నెరవేరినదని విశ్వసించుచున్నాను.
2. నా జీవితంలో శ్రమలు అనుభవించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఆందోళన చెందక, శ్రమలను భరించి, శ్రమల ద్వారా దేవుడు నాకు బోధిస్తున్న సందేశాన్ని స్వీకరించి, ఆధ్యాత్మిక వికాసమునకై ప్రయత్నం చేస్తాను.
3. దేవుని ప్రణాళిక బయలుపరచినప్పుడు, అది మనకు కష్టముగా అనిపించినప్పటికీ, విశ్వాసముతో స్వీకరించి, ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి, దేవుని సహాయమును అర్థించాలే కానీ, కష్టముగా ఉన్నదని తప్పించుకోవడానికి ప్రయత్నించి, దేవుని ప్రణాళికకు విరుద్ధముగా ప్రవర్తించకూడదు.
4. జీవితంలో ఉన్నతమైన ఆశయాలు పెంపొందాలంటే, క్రమశిక్షణ అవసరము. నిత్యజీవం పొందాలన్న ఆశాభావం నెరవేరాలంటే, నన్ను నేను తగ్గించుకొని, వినయముతో దైవాజ్ఞలకు లోబడి జీవించాలి. నా ఆలోచనలను సరిదిద్దుకొని, దేవుని ప్రణాళికకు లోబడి ఉంటాను.
5. దేవుని వాగ్దానాలు తప్పక నెరవేరుతాయి. దేవుడు కష్టాలను అనుమతించాడంటే, దేవుడే మనకు ఏదో పాఠం నేర్పిస్తున్నాడు. దేవుడు మన అభివృద్ధినే కానీ వినాశనమును కోరడు. మనకు సంతోషాన్నే కానీ, దుఃఖాన్ని ఇవ్వడు. శ్రమలు అనుభవించవలసి వచ్చినా, దేవుడే శక్తినిచ్చి ఆదుకుంటాడని నమ్ముతున్నాను. ప్రభువు కోసం శ్రమలు అనుభవించడమే మేలని నిర్ణయించుకున్నాను. అది శాశ్వతంగా నాకే ప్రయోజనకరమని భావిస్తున్నాను.
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.
