"కలవరమేల? కనికరం లేకనేగా!"

ఫాదర్ పూదోట దాసయ్య

23 Sep 2026

సామాన్య 25వ గురువారము
"హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయన, యోహాను మృతులలో నుండి జీవముతో లేపడడెనని కొందరు, ఏలియా అవతరించెనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచెనని ఇంకనూ కొందరు చెప్పుకొను చుండిరి."
(పు. లూకా 9:7-8)

ప్రార్థన: మా రక్షకుడవైన ఓ యేసు ప్రభువా! నీతి, న్యాయం నీ విధానాలు. ప్రేమ, శాంతి నీ మార్గాలు. అన్యాయమును సహించవు. దుర్మార్గుల మోసాలను అరికట్టు వాడవు నీవే. విశ్వాసంతో నీ చెంతకు చేరే వారికి, రక్షణగా ఉంటావు. అన్యాయముగా పీడింపబడుచున్న వారిని ఆదరించు వాడవు నీవే. వినయముతో ప్రార్థించగా, విరివిగా దీవించారు. ఓ యేసయ్యా, నీ ప్రేమ, కనికరములను మరచిపోలేము. ప్రతి ఉదయం నీ స్తుతిగానం చేయుచున్నాము. రోజంతా నీ సంరక్షణలోనే జీవిస్తున్నాము. రేయి రాగానే, పక్షులు గూటికి చేరుకున్నట్లు, మేము మీ ఒడిలో విశ్రాంతి పొందు చున్నాము. మమ్ము ఎంతగానో ప్రేమించిన మీకే పాదాభివందనాలు. నీతి న్యాయంతో మమ్ము పాలించుచున్న ఓ దేవా! దుష్టులు మీ స్వరాన్ని వినరు. మీ ప్రణాళికలు వారికి అర్థం కావు. వారి బుద్ధి మందగించింది. వారి దుష్టకార్యాలే వారిని కలవరానికి గురి చేస్తాయి. హేరోదు, రాజ్య పాలకుడిగా ఉండికూడా, మీ గురించి విని కలవర పడ్డాడు. అన్యాయంగా బాప్తిస్మ యోహాను శిరచ్ఛేదనం చేశాడు. తన జీవితంలో ప్రశాంతతను కోల్పోయాడు. మీ మహిమను చూడలేని గుడ్డివాడిగా మారాడు. అవిశ్వాసిగా మీకు దూరమయ్యాడు. అతనిలో కలవరం, భయం, ఆందోళన, ఆవేదన, అశాంతి, అలజడి పెరిగాయి. చేసిన తప్పును ఒప్పుకునే సాహసం చేయలేదు. పరివర్తన హృదయం లేకుండా, ప్రశాంత జీవితం అసాధ్యమని, మేము గ్రహించుదుముగాక. ఓ యేసయ్యా, శారీరకంగా బలహీనపడి, అనేకమార్లు కలవరంతో, భయంతో జీవించాను. మంచిని చేయడంలో వెనుకంజ వేస్తున్నాను. చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ, నిర్లక్ష్యంగా ఉన్నాను. నన్ను క్షమించండి. ఓ యేసయ్యా, విశ్వాసంతో నీ వైపే చూస్తున్నాను. నాపై కరుణించి, హృదయ శుద్ధితో నిన్ను ప్రేమించే అవకాశాన్ని దయచేయండి. నా ప్రవర్తనలో, ఆలోచనలో ఉన్న లోపాలను సవరించండి. ప్రతిదినం నిన్నే స్మరిస్తూ జీవిస్తాను. నీ మహిమను కీర్తిస్తాను. నీకు సొంతమై జీవింప దయచూపండి. నా జీవిత కాలమంతా, మీ సహవాసంలో జీవించుదునుగాక. కృపా కనికరమునకు పాత్రుడనగుదునుగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. విలువలను పాటించని వారే, విలువలను బోధించేవారుగా సమాజంలో ఎక్కువయ్యారు. తాము పాటించని విలువలు ఇంకొకరికి పాఠాలు ఎలా అవుతాయి? నా ప్రతి మంచి మాట, ముందు నాకు పాఠముగా మార్చుకొని, ఇతరులకు తెలియపరుస్తాను.
2. యేసుక్రీస్తు తన బోధనలను, మాటలలో కాదు చేతలలో చూపించాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆయన చూపిన మార్గమే ఆదర్శం. విలువలను పాటించడానికి, యేసు ఆదర్శమును ఆచరిస్తాను.
3. హేరోదు రాజు యేసుని గూర్చి విని కలవరపడ్డాడు. ఆయన కలవరానికి కారణం, నీతిమంతుడైన బాప్తిస్మ యోహానును శిరచ్చేదం గావించడమే. తప్పు చేసిన వారు తప్పక బాధపడతారు. తాను చేసిన తప్పే తనని వెంటాడుతుంది. సరిదిద్దుకోగలిగితేనే జీవితం నిలబడుతుంది. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఎన్నాళ్లు కలవరముతో జీవించాలి!
4. యేసుక్రీస్తు దయామయుడు. విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చే వారిని ఆయన కరుణించాడు. తప్పు తెలుసుకొని, పశ్చాతాపముతో ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే, మనలోని కలవరమునకు ఆయనే తీసివేస్తాడు. పశ్చాత్తాప పడకపోయినచో, జీవితాంతం భయపడుతూనే బ్రతకాలి.
5. ఎవరు ఏమనుకున్నా, నా తప్పిదాలను సరిదిద్దుకుంటాను. నా కలవరమును యేసుకే సమర్పిస్తాను. పవిత్రమైన మనసును పెంపొందించుకుంటాను. క్షమించమని అడిగే సాహసం చేస్తాను. సువార్త విలువలను పాటిస్తాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN