జర్నలిజం వృత్తి కాదు.. ఒక పిలుపు

జోసెఫ్ అవినాష్
22 Sep 2026
బెంగళూరులో సెప్టెంబర్ 19న జరిగిన 31వ జాతీయ క్రైస్తవ పాత్రికేయుల సదస్సులో బెంగళూరు పీఠాధిపతి మహా ఘన. పీటర్ మచాడో మాట్లాడుతూ,జర్నలిజం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు,ఒక పిలుపు అని అన్నారు.పాత్రికేయులు సత్యాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు, తమ నైతిక బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.చెప్పాల్సిన సత్యాన్ని చెప్పకుండా ఉండటం కూడా అసత్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు.కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో పాత్రికేయులు తమ స్వతంత్రతను,మానవీయ విలువలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.“మానవత్వం, గౌరవం, సత్యం: AI యుగంలో రాజీ లేని జర్నలిజం” అనే అంశంతో జరిగిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.AI సమాచారాన్ని వేగంగా విశ్లేషించగలిగినప్పటికీ,మానవీయ అనుభూతి, కరుణ,అనుభవాలను అది భర్తీ చేయలేదని వక్తలు పేర్కొన్నారు.ముఖ్యంగా అణగారిన,నిర్లక్ష్యానికి గురైన ప్రజల గొంతుకను సమాజానికి వినిపించేలా పాత్రికేయులు మానవీయ కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
