పావురం సాత్వికతకు- సంకేతం శాంతికి నిదర్శనం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
20 Sep 2026
పాపురము పవిత్రాత్మ దేవుని చిహ్నంగా నిలుస్తుంది. యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినపుడు ఆయన మీదకు పవిత్రాత్మ దేవుడు పాపుర రూపంలో దిగి, వచ్చినట్లు సువిశేషంలో చెప్పబడింది (మత్తయి. 3:16, మార్కు 1:10) నిర్మలత్వానికి, పరిశుద్ధతకు నిర్వచనమైన తెల్లని పావురం,కొన్నిచోట్ల నోటితో ఓలీవుకొమ్మను పట్టుకొని కనిపిస్తుంది.ఇవి శాంతికి, సమాధానానికి సంకేతం.అలాగే దేవుని కృప మనిషి మీద ప్రసరించడాన్ని కూడా ఈ సంకేతం గుర్తుచేస్తుంది.
ఈ పక్షి అశుద్ధము జోలికి వెళ్లదు.నోవా వృత్తాంతంలో జల ప్రళయం తగ్గిన తరువాత, బయట పరిస్థితి తెలుసుకొనడానికి నోవా ఒక కాకిని ఒక పావురాన్ని బయటకు పంపుతారు. కాకి కళేబరాల మీద వాలింది. పావురం మాత్రం అక్కడ కాలు మోపకుండా తిరిగి వస్తూ క్రొత్తగా త్రుంచిన ఓలీవు చెట్టు రెమ్మను నోట కరుచుకొని వస్తుంది.అది దేవుని క్షమాగుణానికి, సమాధానికి సంకేతం(ఆది.కా 8:6-14)
పావురానికి ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి.ఈ పక్షి ఏ ప్రాణి మీద దాడి చేయదు. దీనికి అపారమైన జ్ఞాపకశక్తి ఉంది.పూర్వం లేఖలను పావురాలతో పంపేవారు.అవి ఆ లేఖలను మోసుకొని ఎంత దూరమయినా వెళ్ళగలవని ఓ కథనం ఉంది. అది ఏ ప్రాంతమైనా, కార్యాన్ని ముగించి తిరిగి స్వస్థలానికి చేరుకోగల సామర్ధ్యం వీటికున్నది.ఈ పక్షికి మరొక విశేష గుణముంది. ఇతర పక్షి పిల్లలకు కూడా పావురాలు ఆహారాన్ని అందిస్తుంటాయి. తన జోడి చనిపోతే ఇతర జోడీతో జతకట్టదు . ఇది విశ్వసనీయతకు గుర్తు. ఇతర పక్షులకున్నట్లు ఈ పక్షి లో చేదు కట్టు ఉండదు. పావురం ఒక రకమైన తైలాన్ని శరీరం నుండి విడుదల చేస్తుంది. పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె యేసుక్రీస్తు పై దిగివచ్చిందంటాడు లూకా(లూకా 3:22) ఇన్ని నుంచి గుణాలున్న పావురం, శాంతికి,సామరస్యానికి నిదర్శనమనడంలో అతిశయోక్తి కనుపించదు.
