"దేవుని వాక్కులో ఫలించండి"

ఫాదర్ పూదోట దాసయ్య
18 Sep 2026
సామాన్య 24వ శనివారము
"సారవంతమైన నేలపై బడిన విత్తనములను పోలినవారు, యోగ్యమైన మంచి మనస్సుతో, దేవుని వాక్కును ఆలకించి, అవలంబించి, ఓర్పుతో ఫలించువారు."
(పు. లూకా 8:15)
ప్రార్థన: దివ్య వాక్కు స్వరూపుడవైన ఓ యేసయ్యా! మా హృదయాంతరాళంలో మీ పరిశుద్ధ వాక్కు నాటండి. మీ స్వరంవినే మనస్సు మాకు దయచేయండి. మీ యందే మేము అధికంగా ఫలించుదుముగాక. మా ఆత్మల రక్షణకై, మీ శ్రమ వృధా కాకుండా, మమ్ము మీ రక్షణలోనే ఉంచండి. మీరు ఆశించిన నూరంతల ఫలాన్ని మా జీవితంలో పండించండి. ఓ ప్రభువా, నా స్వభావం నీకు ప్రీతికరంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీ వాక్కు నాలో నిష్ఫలం కాకుండుటకై, నా జీవిత సారాన్ని కాపాడండి. మీ వాక్కు వినుటకు, నా మనస్సును నీ వైపుకు తిప్పండి. నాలో బలమైన విశ్వాసాన్ని నింపండి. మీ వాక్కు ధ్యానించుటకు, నా హృదయాన్ని నీ ఆత్మతో నింపండి. నాలో నీ ప్రేమను రగిలించిండి. మీ వాక్కు ఆచరించుటకు, నా జీవితాన్ని సారవంతం చేయండి. మీ యందు ఆశాభావాన్ని పెంపొందించండి. ఓ ప్రభువా, త్రోవ పక్కన పడిన విత్తనం వలె, నా నుండి మీ వాక్కు సైతాను ఎత్తుకొని పోకుండా, మీ దూతల సంరక్షణలో నన్ను ఉంచండి. రాతి నేల మీద పడిన విత్తనం వలె, మీ వాక్కు నాలో, వేరులేనిదిగా నిష్ఫలం కాకుండుటకై, నా కఠిన హృదయాన్ని ద్రవింప చేయండి. శోధన సమయంలో నాకు సహాయముగా ఉండండి. ముళ్లపొదల్లో పడిన విత్తనం వలే, నాలో నాటబడిన వాక్కు అణచివేయబడకుండా ఉండునట్లు, ప్రాపంచిక చింతల నుండి, లోక వ్యామోహాల ఊబి నుండి, దురలవాట్ల నుండి, మోసపూరిత స్నేహాల నుండి, స్వార్థ ప్రయోజనాల ఆకాంక్షల నుండి, నన్ను నీ కాపుదలలో లేవనెత్తండి. సారవంతమైన నేలపై పడిన విత్తనముల వలె, నీ వాక్కు నాలో అధికంగా ఫలింప చేయండి. మీ రాజ్యమునకు యోగ్యమైన జీవితాన్ని నాకు అనుగ్రహించండి. ఓ యేసు ప్రభువా, మీ వాక్కు నాలో అధికంగా ఫలించాలంటే, మీ సహాయం లేనిదే అసాధ్యము. మీరే నాలో ఉండి నన్ను ఫలింప చేస్తారు. మీ స్వరం వినే మనసునివ్వండి. మీ మార్గంలోనే నడిచే విశ్వాసమును పెంపొందించండి. మీ రక్షణ కవచమును అనుగ్రహించండి. మీ నుండి దూరమై నేను అనుభవిస్తున్న ఆధ్యాత్మిక క్షోభ నుండి నన్ను కాపాడండి. నాలో అధికముగా ఫలించే మీ వరప్రసాదాలను, నేను కోల్పోకుండా ఉండుటకు, ఆధ్యాత్మిక మేల్కొల్పును అనుగ్రహించండి. ఓ ప్రభువా, సజీవమైన మీ వాక్కు ప్రేరేపనతో, సన్మార్గంలో నడిచి, మీకు సాక్షిగా జీవింప దయ చూపండి. నేను ఎల్లప్పుడూ, మీ వాక్కు పుణ్యఫలములో, నీకు మహిమకరముగా జీవించుదునుగాక. ఆమెన్.
ఆత్మాభ్యాసం:
1. దేవుని వాక్కును నా జీవితానికి పునాదిగా స్వీకరించి, దేవుని కృపతో ఆధ్యాత్మిక ఫలాలు సమృద్ధిగా లభించాలని ఆశాభావంతో నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను.
2. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె, నా జీవితం త్రొక్కి వేయబడకుండా ఉండుటకు, ప్రభువు త్రోవలో నడచుటకు నా హృదయాన్ని సమర్పిస్తున్నాను.
3. రాతి నేలపై పడిన విత్తనాల వలె, వేరు లేక ఎండిపోయిన పరిస్థితి, నా ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోయే పరిస్థితి రాకుండునట్లు, ఎల్లప్పుడూ, దేవుని వాక్కులో బలముగా నాటబడిన జీవితం జీవిస్తాను.
4. ముళ్ళ పొదలలో బడిన విత్తనాల వలె, అణచివేయబడి ఎదుగుటకు ఆటంకముగా ఉన్నట్టు, ప్రాపంచిక చింతలవలన, వ్యామోహముల వలన, నా ఆధ్యాత్మిక జీవితం కుంటుబడకుండునట్లు, అణచి వేయబడకుండునట్లు, దేవుని వాక్కు నాలో సమస్తమును జయించగలిగే శక్తిని అనుగ్రహిస్తుందని నమ్ముచున్నాను. దేవుని వాక్కు సహాయంతో, శోధనలను అధిగమిస్తాను.
5. సారవంతమైన నేలపై పడిన విత్తనాల వలె, నూరంతలుగా ఫలించుటకు, దేవుని వాక్కును నా హృదయంలో నాటుకొని, ఆచరణలో క్రీస్తును పోలి జీవిస్తూ, ఆధ్యాత్మిక ఫలాలలో దేవుని మహిమకై సమృద్ధిగా ఉంటాను.
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్
