ప్రపంచ నర్సింగ్ పురస్కారం అందుకున్న కేరళ నర్సు
.png)
జోసెఫ్ అవినాష్
18 Sep 2026
కేరళకు చెందిన, ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ కింగ్స్ కాలేజ్ ఆసుపత్రిలో సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అగిమోల్ ప్రదీప్‌కు Aster Guardians Global Nursing Award 2026 లభించింది. ప్రపంచవ్యాప్తంగా 214 దేశాలు, ఆర్థిక వ్యవస్థల నుంచి నమోదైన 1,34,000 మందికి పైగా నర్సుల్లో ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అవయవదానం, సమాజంలో అవగాహన పెంపొందించడం, అంతర్జాతీయంగా శిక్షణ పొందిన నర్సులకు బ్రిటన్ ఆరోగ్యరంగంలో తిరిగి అవకాశాలు కల్పించడం వంటి సేవలకు గుర్తింపుగా ఆమెకు 2,50,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందించారు. ముఖ్యంగా బ్రిటన్‌లోని దక్షిణాసియా సమాజాల్లో అవయవ దాతల కొరతను గుర్తించిన అగిమోల్, Upahaar కార్యక్రమాన్ని సహస్థాపించి 10,000 మందికి పైగా స్టెమ్ సెల్ దాతలను నమోదు చేయడంతో పాటు అవయవదానంపై అవగాహన పెంచేందుకు కృషి చేశారు. వైద్య సేవలతో పాటు బోధన, నర్సుల వృత్తిపరమైన అభివృద్ధిలోనూ ఆమె సేవలందిస్తున్నారు. బ్రిటన్‌లో ఆమె సేవలకు British Empire Medal కూడా లభించింది. సెప్టెంబర్ 12న కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అగిమోల్‌కు లభించిన ఈ అంతర్జాతీయ గౌరవం ఆమె వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా, కేరళకు చెందిన నర్సులు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలిచింది.
