నేటి పునీతులు: పునీత కొర్నోలియస్
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
16 Sep 2026
పునీత ఫబియానుగారి అనంతరం పునీత
కొర్నేలియస్ గారు క్రీ||శ|| 251 ఏప్రిల్ లో 21వ జగద్గురువుగా శ్రీసభ పాలనా బాధ్యతల్ని చేపట్టారు. వీరు ప్రఖ్యాతి కొర్నోలియుస్ వంశానికి చెందిన రోమన్ జాతీయుడు. వీరికి ముందున్న పునీత ఫబియాను పోపుగారు క్రీ|| శ|| 250 జనవరి 20వ తేదీన వేదసాక్షిగా మరణించిన వెంటనే వారి ప్రతినిధిని ఎన్నుకోడానికి ఆనాటి పరిస్థితులు అనుకూలంగా లేవు. డేషియస్ చక్రవర్తి సాగిస్తున్న దారుణ హింసాకాండవల్ల శ్రీసభచాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఈ సమయంలో శ్రీసభను 'గురుమండలి' పాలించింది. ఈ మండలిలో నొవాతియన్ ఒక సభ్యుడు. ఆయన పోపుగా ఎన్నిక కావాలని ఆశించారు. కాని దేవుని చిత్తం చొప్పున గురువుగానున్న కొర్నేలియగారు జగద్గురువుగా ఎన్నికయ్యారు. ఈలోగా తనే అసలైన పోపునని నొవాతియస్ ప్రకటించుకున్నాడు. కాని అది చెల్లలేదు.
క్రీ||శ|| 251 అక్టోబరులో పునీత సిప్రియన్,పునీత కొర్నేలియస్ గార్లు రోము నగరంలో మత విషయకసభను ఏర్పాటుచేయగా 60 మంది బిషప్పులతోపాటు అనేకమంది గురువులు హాజరై నొవాతియననూ ఆయన మద్దతుదార్లనూ మతంనుండి బహిష్క రించాలని నిర్ణయించారు. ఆ కాలంలో రోములోని శ్రీ సభలో 46మంది గురువులు, 7గురు డీకన్లు 7గురు ఉపడీకన్లూ 42మంది సహచరులు, 52మంది వైద్యులు పవిత్ర గ్రంథ పాఠకులతో పాటు 1500 మంది భక్తులైన విధవరాండ్రు కూడా శ్రీసభ సేవల్లో ఉన్నారని ఆనాటి నమోదు పుస్తకంలో పేర్కొనబడింది.
తర్వాత శ్రీసభ వ్యతిరేకి క్రైస్తవుల పాలిట క్రూరుడైన డేషియస్ చక్రవర్తి పోప్ కొర్నేలియ గార్ని దేశ బహిష్కారంచేశాడు. అదే కాలంలో అనగా క్రీ||శ|| 253 నుండి వేద హింసలు అధికమయ్యాయి. అప్పటి చక్రవర్తి గల్లుస్. కొర్నేలియస్ సింతుమ్ సెల్లాయె పట్టణంలో అదేక్రీ||శ|| 253లో హింసింపబడి వేదసాక్షి మరణం పొందారు. కొర్నేలియస్ అంటే కొమ్మవలె దృఢమైన అని అర్థం.
