కొవిడ్ కాలం నాటి వేతన కోతలకు ముగింపు పలికిన పోప్
జోసెఫ్ అవినాష్
15 Sep 2026
కొవిడ్-19 మహమ్మారి కారణంగా వాటికన్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్న సమయంలో,ఖర్చులను నియంత్రించేందుకు అప్పటి పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ ఉద్యోగులు,కార్డినల్స్, వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న అధికారుల వేతనాల్లో కోతలు విధించారు.పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో,ఆ అత్యవసర చర్యలను ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన పోప్ లియో XIV, తాను సంతకం చేసి,జారీ చేసిన అధికారిక పత్రము ద్వారా కొవిడ్ సమయంలో విధించిన వేతన కోతలను రద్దు చేశారు.ఈ నిర్ణయం 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.అయితే, కొవిడ్ కాలంలో నిలిపివేసిన సీనియారిటీ ఆధారిత వేతన పెంపులకు సంబంధించిన గత బకాయిలను తిరిగి చెల్లించబోమని స్పష్టం చేశారు.వాటికన్ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే,పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నందున సిబ్బందిపై విధించిన తాత్కాలిక ఆర్థిక భారాన్ని తొలగించడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
