“ప్రతిరోజూ ప్రేమను ఎంచుకోవడమే నిజమైన ప్రేమ”- పోప్

జోసెఫ్ అవినాష్
12 Sep 2026
పోప్ లియో XIV దాంపత్య ప్రేమ గురించి మాట్లాడుతూ,ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం లేదా క్షణికమైన ఆకర్షణ కాదని,అది జీవితాంతం నిలిచే ఒక నిర్ణయం,నిబద్ధత అని తెలిపారు.యువత కోసం రూపొందించిన YouCat: Love Forever పుస్తకానికి రాసిన ముందుమాటలో ఆయన ఈ విషయాన్ని వివరించారు.మనిషి ప్రేమించాలనే కోరికతోనే సృష్టించబడ్డాడని,భార్యాభర్తల మధ్య ప్రేమ మొదట ఆకర్షణతో ప్రారంభమైనప్పటికీ,అది క్రమంగా పరస్పర విశ్వాసం, అంకితభావం,క్షమాపణ,జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలనే నిర్ణయంగా ఎదగాలని అన్నారు.క్రైస్తవ ప్రేమలో “నేను ఏమి పొందుతాను?” అనే ప్రశ్నకు బదులుగా “క్రీస్తు ప్రేమించినట్లుగా నేను ఎలా ప్రేమించగలను?” అనే ప్రశ్న ఉండాలని పోప్ సూచించారు.భార్యాభర్తలు తమ జీవితాలను పరస్పరం అర్పించుకుంటూ,కష్టాల్లోనూ ఒకరినొకరు క్షమిస్తూ,ప్రతిరోజూ ప్రేమను ఎంచుకుంటే వారి దాంపత్యం క్రీస్తు శ్రీసభను ప్రేమించిన ప్రేమకు ప్రతిబింబంగా మారుతుందని చెప్పారు.అందువల్ల కేవలం భావోద్వేగాలపై ఆధారపడని,త్యాగం,విశ్వాసం, క్షమాపణ,నిబద్ధతతో కూడిన ప్రేమను ఎంచుకోవాలని యువతకు పోప్ లియో XIV పిలుపునిచ్చారు.
