నేటి పునీతులు : పునీత నికోలసు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

10 Sep 2026

పునీత నికోలసుగారు ఇటలీదేశంలో అంకోన మండలంలోని సెంట్ ఆంజెలో పట్టణంలో క్రీ||శ|| 1245లో జన్మించారు. వారి తల్లిదండ్రులకు చాలాకాలం వరకు పిల్లలు కలుగలేదు. వయస్సు అధిగమించిన వారితల్లి ఎంతో ఆవేదనతో పునీత నికోలసు బారిగార్ని (డిసెంబరు-6) ఎంతో భక్తితో వేడుకున్నారు. వారి మధ్యవర్తిత్వాన వరంగా జన్మించిన తన కుమారుని ఆ తల్లి 'నికోలసు' అని బాప్టిజంలో పేరు పెట్టించుకున్నారు.

బాల్యంనుండే నికోలసుగారు ఎంతో పవిత్రతను కాపాడుకొంటు జీవించారు. సాన్ జినెసియో పట్టణంలో చదువుకున్నారు. క్రీస్తుకోసం సన్యసింపదలచి తమ 17వ ఏటనే పునీత అగస్తీను వారి సభలో ప్రవేశించి క్రీ||శ|| 1263లోనే తన మొదటి మాట పట్టును స్వీకరించారు. సింగోలి పట్టణంలో క్రీ॥శ॥ 1270లో పవిత్ర గురుపట్టం అందుకున్నారు. సాన్ ఎల్ఫిడో పట్టణంలో కొన్నాళ్లు గురు విద్యాలయ అథ్యాపకునిగా సేవలందించారు.

క్రీ||శ|| 1274లో తన కోరిక మేరకు తొలెంతీనొ పట్టణంలో విచారణ కర్తగా సువార్తను ప్రబోధించడానికి నియమితులయ్యారు. పునీత అగస్తీ నువారి మఠనియమాలను తు.చ. తప్పక పాటిస్తూ కఠోర సన్యాసి జీవితం గడిపారు. తనను తాను తగ్గించుకుంటు మిక్కిలి భక్తి విశ్వాసాలు ప్రకటిస్తూ ప్రజలకు సువార్తా ప్రబోధంలో ముందంజవేశారు. వారికి గల వాక్చాతుర్యం ప్రజలను బాగా ఆకట్టుకుంది. పేదలు, రోగులు, చెరసాలలో ఉన్న నేరస్థులకు ప్రబోధించి వరామర్శించారు. పాపాత్ముల మనస్సు త్రిప్పుటకై శతథా ప్రయత్నించి సఫలమయ్యారు. వందలాది మంది ప్రజలకు జ్ఞానస్నానాలిచ్చి ఆత్మలను రక్షించారు.

నికోలసు గురువర్యుల సేవ, దానధర్మక్రియలు ప్రజలను క్రీస్తువైపుకు మరల్చాయి. వారు ఉత్తరించుస్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మల విముక్తికై నిత్య విశ్రాంతికై ప్రత్యేక ప్రార్థనలు పూజలు సమర్పిస్తుండేవారు. తను అర్పించే దివ్యపూజాబలివల్ల రోజుకు ఎన్నెన్ని దిక్కులేని ఆత్మలు విమోచింపబడి మోక్షానికి చేరుకుంటున్నాయో వారికి దర్శనంలో కన్పిస్తుండేవి.

తమ గురుత్వ సేవలను 30 సం||లు అందించిన తొలెంతీనొ నగరంలోనే క్రీ||శ|| 1305 సెప్టెంబరు 10వ తేదీన వారు దీర్ఘ విశ్రాంతికి ఉపక్రమించారు. తొలెంతీనొ దేవళంలోనే వారి పవిత్ర మృతశరీరాన్ని పదిల పరచడమైంది. శ్రీ సభకు ఏదైన ఆపద, అనర్ధము సంభవింప బోయేటప్పుడు ఆ పరిశుద్ధుని హస్తాలనుండి రక్తం పెల్లుబికి స్రవిస్తూ ఉండటం విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని గొప్ప అద్భుతం. ఉత్తరించు స్థల ఆత్మలు దైవరాజ్య ప్రాప్తినొంది నిత్య విశ్రాంతి పొందే నిమిత్తం పునీత నికోలసుగారి మధ్యవర్తిత్వాన ప్రార్థించడం భక్తులకు ఆనవాయితీ అయ్యింది. వారి దివ్య సహాయం కొరకు వారిని వందిస్తూ వరుసగా ఏడు దివ్య పూజాబలులలో పాల్గొని యోగ్యంగా దివ్యసత్ప్రసాదం స్వీకరించడం కతోలిక విశ్వాసుల పవిత్ర ఆచారం. వారి ద్వారా విస్తారంగా అద్భుతాలు, వ్యాధి నివారణలు, సమస్యా పరిష్కారములు ఆత్మ నెమ్మది ప్రాప్తిస్తున్నాయని భక్తులు విరివిగా సాక్ష్యం పలుకుతున్నారు. ఆ మహనీయునికి క్రీ||శ|| 1446లో పునీత పట్టా ప్రధానం చేయబడింది. 4వ యూజీన్ పోపుగారు ఈ పవిత్ర సాంగ్యంను నిర్వహించారు. నికోలసు అను పదంకు 'ప్రజా విజయం' అని అర్థం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN