మరియమాత జననోత్సవం సెప్టెంబర్:8
.jpg)
Fr. M. Bhanu Yeswanth
07 Sep 2026
రక్షణ ప్రణాళిక నీడలోనే :
శ్రీసభ దైవార్చనలో పునీతులు మరణించిన రోజును పరలోక జన్మదినముగా భావిస్తూ, వారి పండుగలు జరుపబడతాయి. దీనికి ప్రత్యేక మినహాయింపుగా కేవలం ముగ్గురి జనన దినోత్సవాలు మాత్రమే శ్రీసభ కొనియాడుతుంది: క్రీస్తు, మరియమాత, పునీత బప్తిస్మ యోహానులు. క్రీస్తుకు జన్మనివ్వడానికి మరియతల్లి, క్రీస్తుకు మార్గము సిద్ధం చేయడానికి యోహాను జన్మించారు. కాబట్టి, వారికి కేటాయించే ఇతర పండుగలతోపాటు వారి జననాన్ని కూడా జరుపుకోవడం ప్రత్యేకమే! అయినా, ఇది కేవలం రక్షణ ప్రణాళికలో వారు క్రీస్తు ప్రేషిత కార్యములో పోషించిన పాత్ర నిమిత్తమే. రక్షణ చరిత్రలో ఇస్సాకు, మొదలుకొని సమూయేలు, సంసోను వంటి వారి జననాలు ముందుగానే ప్రవచించబడ్డాయి. వ్యక్తులుగా బాధ్యతలు నిర్వర్తించిన వీరికే దేవుని ప్రణాళికలో జననమునకు ముందే చోటు ఉండింది. అటువంటిది, సాక్షాత్తు దేవుని జననవిషయమున ఇంకెంతగా దేవుడు శ్రద్ధ తీసుకున్నారో ఆదికాండములోనే చూడగలము. Proto Evangelium (అనగా మొదటి సువిశేషము) గా పిలువబడే ఆదికాండము 3:15 లోని సందేశములో “ఆమె సంతతి నీ తల చితకగొట్టును” అనడంలో ‘సంతతి’ అయిన క్రీస్తును, ‘ఆమె’ అంటూ రక్షణ ప్రణాళికలో మరియమాత పాత్రను దేవుడు ఒకేసారి ప్రవచించారు.
మూలమైన శ్రీసభ పితరులు, పండితుల బోధన:
Orthodox క్రైస్తవ సంప్రదాయంలో 5వ శతాబ్దం నుండే కనిపించే ఈ పండుగ, రోమన్ శ్రీసభలో ఏడవ శతాబ్దంలో చేర్చబడింది. క్రైస్తవ విశ్వాస సంబంధిత బోధల్లో క్రీస్తు మరియు అపోస్తలుల కాలానికి సమీపంగా ఉన్నవీ, అనేక పండితుల మద్దతు ఉన్నవి, ప్రామాణికమైన బోధనలుగా పరిగణించబడతాయి. నాలుగవ శతాబ్దంలో జీవించిన పునీత అగస్తీను గారు మరియతల్లి పుట్టుక గురించి ఇలా అన్నారు, "క్రీస్తు యొక్క సిలువ మరణ పుణ్యము ద్వారా, ముందస్తుగానే (in anticipation of Christ's merits) జన్మపాపము నుండి విముక్తి పొంది, రూపుదిద్దుకున్న ఏకైక మానవమూర్తి" అని. 5వ శతాబ్దంలో జీవించిన సలామిస్ నగర ఎపిఫానియుఎస్ (Epiphanius of Salamis) ప్రకారం, “‘జీవులందరికీ తల్లి’ అన్న బిరుదుకు తొలి ఏవ అసంపూర్ణమైన గురుతు మాత్రమే, దాని సంపూర్ణత్వం మరియమాతే. తన అవిధేయతతో తాను పొందిన శాపం ద్వారా తనతో పాటు జీవులందరికీ మరణాన్ని కొనివచ్చింది ఏవ. నూతన ఏవ అయిన మరియ తన విధేయత ద్వారా తనతోపాటు అందరి రక్షణకు ఉపకరించింది. దేవునికే జన్మనివ్వడం ద్వారా జీవులందరికీ తల్లి అనే బిరుదు తొలి ఏవ కంటే మలి ఏవ మరియకే సరైనది."
జన్మించిన నూతన ఏవ :
మరియమాత నూతన ఏవ అని బోధించిన శ్రీసభ పితరులలో ప్రధానంగా కనిపించేది సిరియా దేశ ఎఫ్రాయీము గారి బోధన. "పవిత్రాత్మ యొక్క తంత్రివాజ్యము" గా పిలువబడే వీరి కవితా సంపుటిలో అనేకమార్లు పునఃప్రస్తావించబడిన ప్రధాన అంశము: మరియమ్మ నూతన ఏవ. తొలి ఆదామును సృష్టించడానికి దేవుడు తీసుకున్న మట్టిని భూమి యొక్క కన్యత్వపు మన్ను అని సంబోధించారు. సెలియస్ సెడ్యూలియస్ (Caelius Sedulius c.450) ఇదే బోధన చేస్తూ, పండించకుండానే ఫలించిన కన్య లాంటి భూమి నుండి తొలి ఆదాము జన్మించాడు అన్నారు. ఎఫ్రాయీము ఇలా అన్నారు, “మలి ఆదామైన క్రీస్తు జన్మించడానికి దేవుడు ఎన్నుకున్న కన్యత్వపు పవిత్రమైన మన్ను - మరియతల్లి శరీరము. తొలి ఆదాము శరీరం నుండి తొలి ఏవ సృష్టించబడితే మలి ఏవ శరీరం నుండి మలి ఆదాము జన్మించారు. ఎటువంటి శారీరక సంబంధం లేకుండా ఆదాము నుండి ఏవ దేవుని ప్రత్యేక ఏర్పాటుతో రూపొందించబడితే, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండానే నూతన ఆదాము ఏవ గర్భంలో రూపుదిద్దుకున్నారు. ఏవ కనిన తొలిచూలు బిడ్డ తన సోదరుని రక్తం చిందించినవాడు అయ్యాడు, తొలి హత్యకు కారకుడయ్యాడు. మరియమ్మ కనిన తొలిచూలు బిడ్డ క్రీస్తు, తన రక్తమే తన సోదరులైన మన కొరకు శ్రేష్టమైన బలిగా అర్పించాడు”. శిలువ వద్ద “ఇదిగో నీ తల్లి” అని ఏసు పలికిన మాటలు, జీవులందరికీ తల్లి అని పిలువబడిన ఏవకు సంపూర్ణ గురుతుగా, యోహాను స్థానములో జీవులందరికీ, విశ్వాసులందరికీ ఆధ్యాత్మిక తల్లి అని తెలియజేస్తున్నాయి.
కొందరు కతోలికేతర వేదాంత నిపుణుల అభిప్రాయం: ఏసుక్రీస్తును మలి ఆదాముగా పునీత పౌలు గారు అనేకమార్లు తన లేఖల్లో ప్రస్తావించారు (రోమీ 5: 14, 18-19; 1 కొరింతీ 15: 21-22, 45, 47-49). బైబిల్ గ్రంధం బోధించే ఈ సత్యాన్ని కతోలిక సంఘం తో పాటు ప్రధాన క్రైస్తవ సంఘాలు (కతోలిక, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్) అంగీకరిస్తాయి. అయితే, మరియమాతను "నూతన ఏవ" (New Eve) గాను, ఆమెను ప్రార్థించడం లేదా దైవార్చనలో పండుగగా ఆచరించడాన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు (Protestant Denominations) ఏకాభిప్రాయంతో అంగీకరించవు. కాగా మరియ–ఏవ పోలిక కతోలిక సంప్రదాయానికే మాత్రమే పరిమితమైనది కాదనే విషయానికి మార్టిన్ లూథర్ రచనలలో కూడా కొన్ని ముఖ్యమైన ఆధారాలు కనిపిస్తాయి. స్వయానా మార్టిన్ లూథర్ ఈ అంశం గురించి ఇలా అన్నారు, “తొలి ఏవ దేవునిలా మారిపోవాలనే అత్యాశతో పాపములో పడింది. నూతన ఏవ అయిన మరియ, వినయముతో దాసురాలిగా తనను తాను సంబోధించుకుని ఏవ విఫలమైన విధేయత ద్వారా తాను జీవించింది. ఓ మరియా! నీవంటి స్త్రీ లేదు. నీవు ఏవ కన్నా, సారా కన్నా ధన్యురాలివి. జ్ఞానములోనూ, ఔన్నత్యములోను, పవిత్రతలోనూ నీవే ధన్యురాలవు ” (Commentary on Magnificat, Luther’s Works, Vol. 21: 538-604). మరియమాతను యోహాను సువార్తలో యేసు, ‘స్త్రీ’ అని సంబోధించడానికి కారణము మరియను నూతన ఏవగా పరిగణించడమే! అని, మరియమాత పాడిన స్తోత్రగీతం నూతన ఏవగా, తన విధేయతకు నిదర్శనం అని అంగీకరించిన వారిలో మాక్స్ తురియన్, డా. చార్లెస్ డిక్సన్, లాన్సిలాట్ ఆండ్రూస్ వంటి తొలి ప్రొటెస్టెంట్ సంస్కర్తలు ఉన్నారు. క్రీస్తు నూతన ఆదాము అయితే, మరియతల్లి నూతన ఏవ అన్నది శ్రీసభ పితరులు, పండితులు, పునీతులు బోధించిన విశ్వాససత్యము. తన జననము మానవాళి రక్షణ ప్రణాళికలో ఒక నూతన అధ్యాయము, దైవార్చనలో మొదటి పండుగగా పరిగణించేవారు. నూతన ఏవ అయిన మరియమాత జనన ఉత్సవము జరుపుకొనే మనం, ఆ తల్లి విధేయతను కూడా అనుకరించే బిడ్డలుగా జీవించే కృపకొరకు ప్రార్థిద్దాం.
