భారత మిత్రం రచయితకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఘన సన్మానం

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
07 Sep 2026
...ఉపాధ్యాయ సేవకు.. అక్షర చైతన్యానికి గౌరవం...
ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాల సుదీర్ఘ సేవలందించిన ఆంగ్ల అధ్యాపకుడు, రచయిత పొలమరశెట్టి నిర్మలరాజును ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ విశాఖపట్నం ఘనంగా సన్మానించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఐదుగురు ఉపాధ్యాయులతో పాటు నిర్మలరాజును కూడా ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో ఆంగ్ల అధ్యాపకునిగా 28 సంవత్సరాలు సేవలందించిన ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. విద్యాబోధనతో పాటు పాఠశాలల కోసం గీతాలు, ఆంథెమ్స్ రచించడం, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు.రచయితగా భారత మిత్రంలో ఆయన అనేక రచనలు నిరంతరం ప్రచురితమవుతున్నాయి.
అంతేకాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, సంచిక, తెలుగు జ్యోతి, సహారి, లీడర్, విజయభాను, విజన్ తదితర పత్రికల్లో ఆయన రచనలు వెలువడ్డాయి. ఆకాశవాణి విశాఖపట్నం ద్వారా కూడా తన రచనలను ప్రజలకు చేరువ చేశారు. పత్రికా రంగంతో పాటు సౌహృదయ సాహితి, అమరావతి విశ్వసాహితి, కళా సాహితి, సాహితీ స్రవంతి, కళావేదిక వంటి సాహితీ సంస్థలతోనూ, వివిధ సేవా సంఘాలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. సామాజిక స్పృహ, మానవతా విలువలు, విద్య, సమాజ బాధ్యత వంటి అంశాలపై రచనలు చేస్తూ అక్షరాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న రచయితగా ఆయన గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా పొలమరశెట్టి నిర్మలరాజు మాట్లాడుతూ, “ఈ సన్మానం నాకు లభించిన గౌరవం మాత్రమే కాదు.. రచయితగా, ఉపాధ్యాయునిగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా నా బాధ్యతను మరింత గుర్తుచేసిన ప్రేరణ. సమాజానికి ఉపయోగపడే మంచి రచనలు చేయడంతో పాటు, ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించే రచనలు ఇకముందు కూడా మరింత స్పందనతో కొనసాగిస్తాను” అని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, బంధుమిత్రులు, సేవా సంస్థల ప్రతినిధులు, భారత మిత్రం బృందం ఆయనకు అభినందనలు తెలిపారు.
