నేటి పునీతులు: పునీత రోజమ్మ

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
04 Sep 2026
పునీత రోజమ్మగారు ఒక పేదకుటుంబంలో ఇటలీలో విటెర్బొ అనబడే ఒక నగరంలో జన్మించారు. భౌతికంగా వారు పేదవారైనా ఆథ్యాత్మిక బలసంపన్నులు. క్రైస్తవ విశ్వాసం, భక్తి మిన్న. అందువల్ల పునీత రోజమ్మగారు కూడ బాల్యంనుండే పవిత్రతలో అభివృద్ధి చెందుతూ వచ్చారు. వారు తమ ఏడవ ఏటనుండే పెద్దవారు చేసేటంత ఘనంగా త్యాగకృత్యాలను ఆచరిస్తూ ఏకాంతంగా ప్రార్థించడం చేసేవారు. బాల తపస్విగా పేర్గాంచారు.
ఒక రోజు మేరిమాత వారికి దర్శనమై దేవుడైన తన కుమారుడు క్రీస్తుని రక్షణ భాగ్యాన్ని ఇంకా ఎక్కువమందికి అందించ కలగాలంటే వారు ఫ్రాన్సిసుగారి మఠంలో చేరాలని అనుజ్ఞనిచ్చారు. రోజమ్మ గారికి కేవలం పండ్రెండేండ్ల ప్రాయమే. అయిననూ తన దర్శన విషయాన్ని చెప్పి ఫ్రాన్సిస్ వారి సభలో ప్రవేశించారు. సభ కట్టుబాట్లను పాటిస్తూ కొద్దికాలంలోనే మఠకన్యదీక్షను భక్తితో చేపట్టారు. వీరు నిర్భయంగా 'వెటెర్బొ' నగర వీధుల్లో కలియ తిరుగుతూ "బహిరంగ ప్రాయశ్చిత్తం" గూర్చి విశేషంగా బోధిస్తూ వచ్చారు. పాప క్షమాపణ పొంది పరమానందంతో ఈ భూలోకంలోనే పరలోక సంపదను సంపాదించు కొండని ఎంతో ఆకర్షణీయంగా నచ్చచెప్తుండేవారు.
ఆ రోజుల్లో జర్మనీ చక్రవర్తి అయిన రెండవ ఫ్రెడరిక్ శ్రీసభకు, పోపుగారికి అనుకూలంగా లేడు. అందుకు రోజమ్మగారు చక్రవర్తిని ప్రతిఘటిస్తూ విశ్వాసులెల్లరు పరిశుద్ద పోపుగారి అధికారానికి లోబడాలని, ఆనాటి 9వ గ్రెగోరి జగద్గురువులకు విశ్వాసంగా ఆలంబనంగా నిలవాలని దాదాపు రెండు సంవత్సరాలు తమ ఆథ్యాత్మిక వేద ప్రచారాన్ని కొనసాగించారు. చాలా చిన్న బాలిక ఇంత ఉధృతిగా ఆధ్మాత్మిక శక్తితో అధికార పూర్వకంగా ఉపదేశించడం వల్ల చక్రవర్తి అధికారులు అనుచరుల్లో కలకలం చెలరేగింది. ఇదిలా కొనసాగనిస్తే చక్రవర్తి అధికారానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తప్పదని భావించారు. వెంటనే రోజమ్మగార్ని వారి యావత్ కుటుంబాన్ని విటెర్బొనగర బహిష్కారం గావించారు.
అయితే రోజమ్మగారు మరింత పట్టుదలతో దీక్షతో ఆ చుట్టు ప్రక్కల ఊళ్లల్లోను, నగరాల్లోను పర్యటిస్తూ స్వార్థపరుల భూటకపు బోధలకు, వక్రభాష్యాలకు దారితప్పవద్దని, ప్రొటెస్టాంటులుగా మారవద్దని ప్రచారంచేస్తూ పోపుగారికి అనుకూలంగా మద్దతుకూడ గడుతూవచ్చారు. భక్తిపరురాలైన రోజా గారికి భవిష్యత్తును గ్రహించి జరుగబోయే సంఘటనలను ముందుగానే వివరింపగల వరం కలిగి ఉన్నారు. అందువల్లనే పెడసరియైన చక్రవర్తి కేవలం పదిరోజుల్లో మరణిస్తాడని ముందుగానే తెల్పారు. అది అలాగే సంభవించింది.
ఆ కాలంలో 'విటోర్షియానో పట్టణంలో ఒక మంత్రగత్తె ఉంది. దబ్బర దేవుళ్లను సృష్టివస్తువులనే భగవంతుడని ఆరాధించే ఆ క్షుద్రదేవతోపాసకురాలు ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్తూ తప్పు త్రోవ పట్టిస్తూ చెడగొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న పునీత రోజమ్మగారు అక్కడకు వెళ్లి క్రైస్తవ విశ్వాసాన్ని వారికి బోధించి, రక్షణ ఇవ్వలేని దేన్నీ పూజించడం అనుసరించడం తగదని నిరూపిస్తూ వచ్చారు. అందుకు ఉదాహరణగానే దేవుని మహిమని ప్రజలకు చూపి వారిలో పరివర్తన కొనితెచ్చేందుకుగాను రోజమ్మగారు మండుచున్న చితి పై మూడు గంటలపాటు ఉండి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ అద్భుతాన్ని చూచిన ప్రజలంతా ఆయమ్మ బోధనను విశ్వసించి క్రైస్తవులయ్యారు.
జర్మనీ చక్రవర్తి పీడ విరగడైపోయి క్రీ||శ|| 1251లో విటెర్బొనగరంలో పోపుగారి అధికారం పునఃస్థాపింపబడింది. దాంతో రోజ్ గారు తమ స్వంత నగరానికి తిరిగి చేరుకున్నారు. తర్వాత పేద క్లోరెన్స్ మఠంలో ప్రవేశించేందుకు అనుమతినిమ్మని అభ్యర్థించారు. కాని వారి అభ్యర్ధన మన్నింపబడలేదు. రోజమ్మగారు పట్టణం వెలుపల ఉన్న చిన్న గదిలో నివశించేందుకు వెళ్లిపోయారు. తన మరణం తాను కోరుకున్న ఆ కాన్వెంటులోనే ప్రవేశం లభిస్తుందని జోస్యం చెప్పారు. వారి ప్రవచనం ప్రకారమే, ఆ తర్వాత వచ్చిన వసంత ఋతువులో తమ 17వ ఏట అతి చిన్న వయస్సులోనే క్రీ||శ|| 1252 మార్చి 6న స్వర్గస్తులయ్యారు. 1454లో 5వ నికోలాసు పోపుగారు పునీతపట్టా ఇచ్చారు.
పునీత రోజమ్మగారి మరణవార్త తెలుసుకున్న అప్పటి 4వ అలెగ్జాండర్ జగద్గురువులు ఆయమ్మగారి భౌతిక కాయాన్ని పేద క్లేర్స్ మఠంలో భూస్తాపితం చేయాల్సిందిగా ఆజ్ఞ చేశారు. పునీత రోజమ్మగారి మృత శరీరం నేటికి చెక్కు చెదరకుండ అలాగే ఉండటం గొప్ప అద్భుతం. ప్రతి ఏడాది సెప్టెంబరు నాల్గవ తేదీన వారి ఉత్సవ రోజున అరవై అడుగుల ఎత్తు ఉన్న చెక్క గోపురంగల రథం పై పునీత రోజమ్మగారి పవిత్ర దేహాన్ని ఉంచి డెబ్బది మంది భక్తులు దాన్ని లాగుతూ విటెర్బొనగర వీధుల్లో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. రోజమ్మ అంటే గులాబి పువ్వు అని అర్థం.
