నాస్తికుడు గొప్ప కతోలిక విశ్వాసి అయ్యాడు

జోసెఫ్ అవినాష్
04 Sep 2026
ఆన్‌లైన్ ప్రపంచంలో అజ్ఞేయవాదిగా, దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నించే తాత్విక వాదనలు చేసేవాడిగా గుర్తింపు పొందిన జో స్మిడ్ ఇప్పుడు కతోలిక విశ్వాసాన్ని స్వీకరించారు. కతోలిక కుటుంబంలో పెరిగిన ఆయన హైస్కూల్ కాలంలో దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయి,2020 ఏప్రిల్‌లో ప్రారంభించిన తన ‘మజెస్టీ ఆఫ్ రీజన్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని విశ్వాసానికి వ్యతిరేకంగా వివిధ తాత్విక,హేతుబద్ధమైన వాదనలు చేసేవారు.అయితే హృదయంతో పాటు బుద్ధితో సాగించిన తన దీర్ఘమైన దేవుని అన్వేషణ చివరకు తనను కతోలిక విశ్వాసం వైపు తిరిగి నడిపించిందని ఆయన వెల్లడించారు.“దేవుడు ఉన్నాడు; క్రీస్తే ప్రభువు; ఆయన కతోలిక శ్రీసభను స్థాపించారు” అంటూ తన విశ్వాస మార్పును ప్రకటించారు.కతోలిక బోధలను బలపరిచే కొన్ని అద్భుతాలు తన విశ్వాస పునరాగమనంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పునీత పాద్రే పియో జీవితంలోని విశేష కృపలు, లూర్దు మరియు ఫాతిమాలో జరిగిన మరియమ్మ ప్రత్యక్షతలు, దివ్యకారుణ్య అద్భుతాలు తనను ప్రభావితం చేశాయని చెప్పారు. ఇకపై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కతోలిక విశ్వాసం,దేవునిపై విశ్వాసానికి అనుకూలంగా తాత్విక చర్చలు, వివరణలను అందించనున్నట్లు జో స్మిడ్ ప్రకటించారు.
