నేటి పునీతులు: పునీత 1వ పెద్ద గ్రెగోరి

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

03 Sep 2026

పునీత 1వ పెద్ద గ్రెగోరి పాశ్చాత్య శ్రీసభకు చెందిన పునీతులు అంబ్రోసు, జెరోము, మరియు అగస్టీను అనువార్ల కోవలోకి వస్తారు. వీరు ఇటలీలో క్రీ||శ|| 540లో ధనవంతులు ఉన్నత వంశంలో జన్మించారు. తండ్రి పేరు గోర్డియన్. గొప్ప దేశ భక్తుడైన రోమీయుడు. వీరి తల్లి పునీత సిల్వియా. వీరికి రోములోను సిసిలీలోను భూములు, భవనాలు ఉన్నాయి. కాని అశ్రద్ధలేకుండా గ్రెగోరిగారు గొప్ప భక్తి విశ్వాసాలతో పెంచబడ్డారు. అందుకు వారి తల్లితో పాటు వీరి తల్లిదండ్రుల తోడబుట్టిన ఇద్దరు మహిళలుకూడ ఎంతో తోడ్పడ్డారు. గ్రెగోరిగారు తమ 33వ ఏటనే రోమునగర మేయరుగా ఎన్నికై పాలించారు. అయితే ఈ ప్రాపంచిక కోరికల్ని త్యజించి దేవుని సేవలో ఎంతో ప్రశాంత జీవితం జీవిస్తున్న బెనడిక్టు సభసన్యాసుల దినచర్యను జూచి ఎంతో ఆకర్షితులయ్యారు. తనకు వచ్చే రాజు పదవిని కూడా కాదని బెనెడిక్టు మఠంలో ప్రవేశించారు.

గ్రెగొరిగారు తమ విశాలమైన 'కొయెలియన్ కొండ'పై గల అందమైన రాజ ప్రాసాదాన్ని పునీత అంద్రియ మఠంగా మార్చివేశారు. అందుకు ఫాదర్ వలెంటియస్ దోహదపడ్డారు. సిసిలీలో మరో ఆరు మఠాలు నిర్మింప గ్రెగోరిగారే సాయపడ్డారు. వీరు తమ స్వంత ఆస్థి పాస్తులను చాలామట్టుకు పేదలకు దాసంచేశారు. శ్రీ సభకు ఇచ్చివేశారు. ఆ కాలంలో పోపుగారిగా ఉన్న పునీత 1వ పెలాజియస్ గారి పాలనలో గ్రెగోరిగారు డీకను మరియు గురువు అయ్యారు. వారి భక్తి, శక్తికి ముగ్ధులై పోపుగారు గ్రెగోరి గురువర్యుగార్ని పోప్ ప్రతినిధిగా కాన్స్టాంటి నోపుల్ కు పంపించారు. అక్కడ వారు క్రీ||శ|| 579 నుండి 586వరకు పనిచేశారు. తిరిగి రోము వచ్చి పునీత అంద్రియ మఠాధినేతగా ఉన్నారు.

గ్రెగొరిగారు అన్యమతస్థుల్ని క్రైస్తవ జీవన విధానంలోకి తెచ్చేందుకు చాలా ఉత్సాహం చూపారు. ఇంగ్లాండు వెళ్లి అక్కడ మత ప్రచారం చేయాలని ఆశపడ్డారు. అయితే వారికి గురువుగా మరో బాధ్యత వచ్చింది. ఆ రోజుల్లో ఇటలీలో లొంబార్డివారి దాడులు, కరువు మరియు దాపురించిన ప్లేగు అంటువ్యాధి, ఎందరో ప్రజల్ని పొట్టన బెట్టుకుంది. ఆ సమయంలో గ్రెగోరిగారు శ్రీ సభ తరఫున శక్తి మేర సేవలందించారు. ఈ సేవలోనే అప్పటి పోపు అయిన 2వ పెలాజియస్ గారు ప్లేగు వ్యా ధిసోకి క్రీ||శ|| 590లో పరలోక ప్రాప్తినొందారు.

ఆ సమయంలో పీఠాధిపతికూడా కాదు. కేవలం పునీత అంద్రియ మఠాలయం అధిపతి గురువుగా ఉన్న గ్రెగోరిగారు ఏకగ్రీవంగా పోపుగా ఎన్నికవడం ఆనాటి గొప్ప విశేషంగా చెప్పుకున్నారు. వారు క్రీ||శ|| 590 సెప్టెంబరు 3వ తేదీన 64వ జగద్గురువుగా విశ్వ శ్రీసభపాలనా బాధ్యతల్ని చేపట్టారు.

మొదటగా వారు రోమునగరంలో పునీత మేరి మేజర్ దేవాలయం వద్ద ఏడు ప్రదేశాల్లో ప్రజలు సంతాప సూచకంగా ప్రదక్షిణగా వచ్చి ప్రభువు క్షమాపణ, దయకై ప్రార్థించేలా చేశారు. అప్పుడు అతిదూత మిఖాయేలు పునీత హడ్రియన్ గారి సమాధి పై దర్శనమై తమ శక్తి ఖడ్గాన్ని ఝుళిపించగా శాంతి, మంచి కాలం ప్రాప్తించిందని చెప్పబడింది. శ్రీసభ తొలి వెయ్యేళ్లలో గొప్ప పోపు వీరేనని చరిత్ర వెల్లడిస్తుంది.

క్రీ||శ|| 593లో సత్యవేద వ్యాపకంకై ముందుగా శాంతి కొరకై వీరు లొంబార్డిరాజు అగిల్ ఉల్ఫ్ తోను ఫ్రాన్సు, స్పెయిన్ పాలకులతోను చర్చించి శాంతి ఒడంబడికలు చేయించారు. వీరి ఆదేశం పై పునీత అగస్టీనుగారు తమ 40 మంది గురువులతో క్రీ||శ|| 596లో ఇంగ్లాండు వెళ్లి మత ప్రచారం ముమ్మరం చేశారు. శ్రీ సభక్రమబద్ధంగా ఉండేందుకు గ్రెగోరిగారు పూర్తి కృషిచేశారు. ఘనాపాఠి అనిపించారు.

పునీత గ్రెగోరిగారు శ్రీసభ దైవార్చన సంగీతాన్ని సంస్కరించారు. 'గ్రెగోరియన్ చాంట్ అని అతి శ్రావ్య బాణీలతో శ్రీసభ పూజ పాటలను వెలయింపజేసి ప్రసిద్ధికెక్కారు. వీరు ప్రామాణిక పూజా ప్రార్థనల్ని కూడా సవరించారు. ప్రస్తుతం మనం చెప్పే పరలోక జపం వారు ఆమోదించిందే. వీరు క్రైస్తవ జీవితం సిద్ధాంతాల మీద రచనలు చేశారు. విశ్వ లేఖలు వెల్లడించారు. క్రైస్తవ ఆథ్యాత్మికత్వం, సన్యాసుల మఠవాసాన్ని అభివృద్ధి పర్చేందుకు గ్రెగోరిగారు చాలా కృషిచేశారు. తమ ప్రజ్ఞపాటవాలతో అన్యులు విగ్రహారాధకులకు తమ సత్యోపదేశంతో కనువిప్పు కలిగించారు. మఠవాసులను కార్యోన్ముఖులను చేశారు నూతన పంథాలో.

గ్రీకు చక్రవర్తులు రోమాపురి అభివృద్ధిని విస్మరించినందువల్ల వీరే తమ మునుపటి అనుభవంతో రోమునగర పౌరపాలన చేపట్టారు. అధికారంకోసం బిరుదుల కోసం కాన్స్టాంట్ నోపుల్ పీఠాధిపతులు ప్రాకులాడుతుండగా "దేవుని సేవకుల సేవకుడు" అని గ్రెగోరిగారు తనను తాను పిలుచుకున్నారు. ఈ పిలుపు బిరుదునే నేటికీ పోపుగార్లు వినియోగిస్తున్నారు. గ్రెగోరిగారు క్రీశ11 604 మార్చి 12న పరలోక ప్రాప్తినొందారు. లాటిను శ్రీసభ పండితులుగా పునీతులు అగస్తీను, అంబ్రోసు, జెరోముగార్ల తర్వాత నాలుగవవారు వీరేనని పేర్గాంచారు. వీరి మధ్యవర్తిత్వాన జరిగిన అద్భుతాలకు లెక్కలేదు.

గాయకులు, సంగీత కళాకారులు, విద్యాపండితులు, బోధక ఉపాధ్యాయులకు వీరు పాలక పునీతులుగా నియమింపబడ్డారు. గ్రెగోరి ది గ్రేట్ అనబడ్డారు. గ్రెగోరి అంటే మంచి కాపరి అని అర్థం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN