చాపెల్ ఆన్ వీల్స్’ — వాహనంలోనే దివ్యకారుణ్య ఆరాధన

జోసెఫ్ అవినాష్
02 Sep 2026
మెక్సికోలోని మొంటెర్రే అగ్ర పీఠం ఒక వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించింది.‘చాపెల్ ఆన్ వీల్స్’ పేరుతో ఒక ప్రయాణ వాహనాన్ని చిన్న ప్రార్థనా మందిరంగా మార్చి,చర్చిలు అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజల వద్దకు దివ్యకారుణ్య ప్రభువును తీసుకెళ్తున్నారు. ఈ వాహనంలో దివ్యకారుణ్య ఆరాధనకు ప్రత్యేక స్థలం, విశ్వాసులు పాప సంకీర్తన చేసుకునేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేశారు.మొత్తం 18 మంది ప్రయాణించగల ఈ వాహనాన్ని మూడు భాగాలుగా విభజించారు.వెనుక భాగంలో నలుగురు వ్యక్తులు దివ్యకారుణ్య సన్నిధిలో ప్రార్థించేందుకు అవకాశం ఉండగా,మధ్య భాగంలో పాప సంకీర్తన కోసం ఏర్పాట్లు చేశారు.ప్రజలు దేవాలయానికి వచ్చే వరకు ఎదురుచూడకుండా,దేవుని సన్నిధినే ప్రజల వద్దకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.దేవాలయాలు లేని ప్రాంతాల్లో కూడా దివ్యకారుణ్య ఆరాధనకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించబడిందని దీనికి బాధ్యత వహిస్తున్న ఫా. అడ్రియాన్ విలాగ్రాన్ గెరెరో తెలిపారు.ఈ వినూత్న ప్రయత్నానికి విశ్వాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
