"యేసు హస్తము: స్వస్థపరచును - రక్షణ నిచ్చును"

జోసెఫ్ అవినాష్

01 Sep 2026

సామాన్య 22వ బుధవారము
"ప్రొద్దు గ్రుంకు చుండగా, నానావిధ రోగ పీడితులైన వారినందరను, వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద, తన హస్తమునుంచి వారిని అందరిని స్వస్థపరచెను."
(పు. లూకా 4:40)

ప్రార్థన: పరమ వైద్యుడవైన ఓ యేసు ప్రభువా, అనేక వ్యాధులతో బాధపడుతున్న వారికి, మీరే దివ్యౌషధముగా, మీ హస్తమును వారిపై నుంచి స్వస్త పరిచారు. విశ్వాసముతో మీ చెంతకు వచ్చిన వారికి, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి ఆశీర్వదించారు. మా రక్షణ కర్తవైన నీ సన్నిధికి చేరినవారికి, మీరు ఎప్పుడూ సమీపముగానే ఉన్నారు. మా కాపరిగా ఉండి, చెదరిపోయిన వారిని తిరిగి హక్కున చేర్చుకున్నారు. గాయపడినవారిని ప్రేమతో ఆదరించి, వారి గాయాలకు కట్టు కట్టి, వారిలో మనో ధైర్యాన్ని నింపారు. ఓ ప్రభువా, మీరే మా గృహాలను సందర్శించి, మహాద్భుతమైన నీ సన్నిధియే మాకు ఆశీర్వాదంగా ఇచ్చారు. మీ బోధనలను ఆలకించి, మీ చిత్తానుసారముగా జీవించే వారికి, ‌ ఆనందదాయక జీవిత వరాన్ని ఇచ్చారు. ఓ ప్రభువా, జ్వర పీడితురాలైన సీమోను అత్తను సందర్శించి, ఆమెను తాకి స్వస్త పరిచారు. ఆమె పొందిన స్వస్థతకు కృతజ్ఞతగా, ఆమె మంచము నుండి లేచి మీకు పరిచర్యలు చేసింది. మీరు చేసిన మేలు మరచిపోక, మీ సేవలో జీవించే అవసరాన్ని నేర్పింది. నీ నుండి వరాలు పొందడమే కాదు, మీ అనుగ్రహముతో మా తోటి వారికి మేలు చేయడం, అవసరాల్లో తోడుగా ఉండడం, మీరు మాపై చూపిన కనికరాన్ని, మా తోటి వారి యెడల చూపాలని నేర్పారు. ఓ ప్రభువా, నీ కోసం మేము చేసే అతి చిన్న కార్యమైనా, మీ దీవెనకు యోగ్యంగా మార్చి, మీ రక్షణ ఫలాలను ఉదారంగా, సంపూర్ణంగా, దయ చేయుచున్నారు. ఓ ప్రభువా, మీ రాకను గమనించిన అనేకమంది, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని విశ్వాసముతో నీ చెంతకు తీసుకుని వచ్చారు. వారి విశ్వాసాన్ని మెచ్చారు. రోగుల తరుపున వారి బంధువుల ఆరాటాన్ని చూశారు.‌ మీ చెంతకు రాలేకపోతున్న రోగులను, బాధితులను, పాపాత్ములను, మనోవేదనతో బాధపడుతున్న వారిని, అభాగ్యులను, పేదవారిని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని, మీ కనికరమునకు దూరంగా‌ ఉన్న వారిని, మీ సన్నిధికి తీసుకుని వచ్చి, మీ దర్శన భాగ్యాన్ని ప్రసాధించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. మీరు మాత్రం, కీర్తిప్రతిష్టలు ఆశించక, మనసున్న మనిషిగా, దైవశక్తితో రోగులను తాకి స్వస్త పరిచారు. వారి విశ్వాసాన్ని బలపరిచారు. మీ నుండి వారు జీవం పొందారు. రక్షణ వరప్రసాదాలను మీరే వారికి ప్రసాదించారు. ఓ యేసు ప్రభువా, ఎంతోమంది అభాగ్యులు, మీ ప్రేమ అనుభూతిని పొందారు. మీకు సాక్షులుగా మారారు. ఓ ప్రభువా, నీవు దేవుని కుమారుడవని, క్రీస్తువని, అపవిత్రాత్మలతో నిండిన వారు కూడా‌ గ్రహించారు. మీ మహాశక్తిని గుర్తించారు. మీ అధికారాన్ని గౌరవించారు. మీకు లోబడి, మీరు గద్దించగానే, మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఓ ప్రభువా, ఉన్నతమైన మీ అధికారానికి లోబడి ఉండేలా, మీకు విధేయించేలా, మీ గొప్పతనాన్ని, మీ పవిత్రతను, మీ గౌరవాన్ని, మీ దైవత్వాన్ని ప్రకటించేలా చేయండి. మీకు సాక్షులముగా జీవిస్తూ, మీ ప్రియ శిష్యులంగా జీవించుదుముగాక. మమ్ము పవిత్రులను చేయండి. పాప కళంకమును తీసివేయండి. మేము పొందిన వరాలకు కృతజ్ఞులమై జీవించేలా చేయండి. మీ దివ్య హస్తాలను మాపై చాపి మమ్ము దీవించండి. మా తోటి వారికి దీవెన కరంగా మా జీవితం ఉండునుగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. యేసుక్రీస్తువే పరమ వైద్యుడని విశ్వసిస్తున్నాను. ‌‌నా వ్యాధి బాధలలో ఆయనను మాత్రమే ఆశ్రయిస్తాను.
2. తీవ్ర జ్వరముతో ఉన్న సీమోను అత్తను ప్రభువు స్వస్థపరిచాడు. స్వస్థత పొందిన ఆమె యేసుకు, యేసు శిష్యులకు పరిచర్యలు చేసింది. దేవుడు చేసిన మేలులను ఎప్పటికీ మరిచిపోను. కృతజ్ఞతా భావముతో ఉంటాను.
3. ఎన్నో రకాలైన రోగాలతో బాధపడుతున్న వారిపై, యేసు తన హస్తములను ఉంచి అందరినీ స్వస్థపరిచాడు. ‌యేసును విశ్వాసముతో ఆశ్రయించిన వారందరికీ రక్షణ లభిస్తుంది. వ్యాధిగ్రస్తుల సంపూర్ణ ఆరోగ్యము నిమిత్తము విశ్వాసముతో ప్రార్థన చేస్తాను.
4. "నీవు దేవుని కుమారుడవు" అని దయ్యం పట్టిన వారు కూడా కేకలు పెట్టారు. యేసు దేవుని కుమారుడని, ప్రవక్తల ప్రవచనాలు బోధిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవదూతలు ప్రకటించారు. యేసుని దేవుని కుమారుడిగా స్వీకరించి, ఆయన అనుచరునిగా జీవిస్తాను.
5. దేవుని రాజ్యమును గురించి, నా మాటలు క్రియల ద్వారా ప్రకటిస్తాను. విశ్వాసుల ఐక్యతను ప్రోత్సహిస్తాను. నిజమైన ఆరాధకులుగా, సత్యాన్ని గ్రహించిన వారిగా, దేవుని కుటుంబముగా జీవించుటకు, దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారానే సాధ్యమని గ్రహించాను. విశ్వాస సంబంధమైన జీవితములో బలముగా ఉంటాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN