ప్రతిరోజు బైబిల్ చదవాలి

ఫాదర్ పూదోట జోజయ్య, sj
01 Sep 2026
చాలామంది బైబిల్ గురించి చెబుతుంటే శ్రద్ధగా వింటారుగాని, బైబులును మాత్రం చదవరు. ఈ పద్ధతి సరైనది కాదు. బైబులును గూర్చి వింటేకాదు,స్వయంగా చదువుకొని ప్రార్థన చేసికొంటే బైబులు వస్తుంది.ఈత వేయడం ద్వారా ఈతా,పాట పాడడం ద్వారా పాటా,నాట్యం చేయడం ద్వారా నాట్యమూ, క్రీడను అభ్యాసం చేయడం ద్వారా క్రీడా వస్తాయి.కేవలం ఈ కార్యాలను గూర్చి ఉపన్యాసాలు వింటే ఇవి రావు. బైబులు కూడ ఇంతే. కనుక విశ్వాసి స్వయంగా దివ్యగ్రంథ పారాయణానికి పూనుకోవాలి. రోజూ ఓ పావుగంట కాలమైనా బైబిల్ గ్రంథం చదువుకోవాలి.
పౌలు గారి శిష్యుడు తిమోతి చిన్నవాడుగా ఉన్నపుడే అమ్మమ్మ అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని దివ్యగ్రంథం చదివించేదట (2తిమో. 1:5, 3:15). తరువాత చాల యేళ్ళు గడిచాక, నీవు చిన్ననాడే అలవాటు చేసుకున్న బైబులు పఠనాన్ని అశ్రద్ధ చేయవద్దని పౌలు తన శిష్యుడు తిమోతిని హెచ్చరించాడు (1తిమో. 4:13). కాబట్టి బైబిల్ గ్రంధాన్ని ప్రతిరోజు ఓ పావు గంట అయినా చదువుదాం, ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడతాం, బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు.
