"అధికారము‌ శక్తి - మహిమ ఘనత యేసుక్రీస్తులోనే"

ఫాదర్ పూదోట దాసయ్య, వరంగల్లు గురుపీఠం

31 Aug 2026

సామాన్య 22వ మంగళవారము
"ఇతడు అధికారముతోనూ, శక్తితోను, అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే, అవి వెళ్ళి పోవుచున్నవి, అని ఒకరితో ఒకరు చెప్పు కొనసాగిరి."
(పు. లూకా 4:36)

ప్రార్థన: పరమ పవిత్రుడవైన ఓ మా పరలోక ప్రభువా! ఓ పావనాత్ముడా, సర్వాధికారియైన మా యేసయ్యా! మీ పవిత్ర పాదాలను భక్తితో ముద్దు పెట్టుకుంటున్నాము. పాప జీవితంలో జీవిస్తున్న మానవాళి రక్షకుడవు నీవే. మీ బోధనలలో ఎంతో శక్తి ఉంది. మీ వాక్కు వింటున్నంతకాలం హృదయానందం కలుగుతుంది. మాతో మీరు ఉన్నారని సంతోషిస్తున్నాము. మీ వాక్కు ధ్యానిస్తూ ఉంటే మాలో ఎంతో మార్పు వస్తుంది. ఓ ప్రభువా, దయ్యం పట్టిన వారు కూడా, నీవు పవిత్రమూర్తి అని గ్రహించారు. మీకున్న అధికారాన్ని తెలుసుకున్నారు. మీరే సర్వాధికారి. మీకున్న అధికారంతో సమస్తమును పరిపాలించు చున్నారు. సమస్తమును చక్కదిద్దు చున్నారు. క్రమ పరచు చున్నారు. పరిశుద్ధ పరచు చున్నారు. ఓ ప్రభువా, మీరు అధికారంతో, దయ్యమును గద్దింపగా, అందరి సమక్షంలో, ఎవరికీ హానీ చేయక వారినుండి వెళ్లిపోయింది. ఓ ప్రభువా, మేము మీ అధికారానికి లోబడి జీవించడమే, మాకు క్షేమకరం అని తెలుసుకున్నాము. మీ మాటకు ఎంతో శక్తి ఉంది. మీ బోధనలో గొప్ప అధికారం ఉంది. మీ బోధ వినడానికి గుంపులుగుంపులుగా ప్రజలు వచ్చారు. మీరు కేవలం మాటల మనిషి కాదు, క్రియల మనిషిగా జీవించారు. అధికారంతో మీరు ఆజ్ఞాపించగానే, దయ్యాలు గడగడలాడాయి, సముద్రపు అలలు శాంతించాయి, ఎందరో తమ ఆత్మ శరీరములలో సంపూర్ణ స్వస్థతను పొందారు. మీలో రక్షణ పొందారు. ఓ యేసయ్యా, మమ్ము కాపాడగరండి. భయంతో, వేదనతో బ్రతుకు చున్నాము. మీ రక్షణ మాకు కావాలి. మాకు తోడుగా ఉండండి. అంటువ్యాధులు మమ్ము భయకంపితులను చేస్తున్నాయి. మీకు దూరం చేస్తున్నాయన్న భయం మాలో ఉంది. మాకు సంపూర్ణ విడుదలను ఇవ్వండి. మాపై కనికరం చూపండి. విశ్వాసముతో ప్రార్థించ మన్నారు. మీ నామమున నా తండ్రిని ఏమి అడిగినా పొందుతారు అన్నారు. ఓ ప్రభువా, మేము అభాగ్యులమే, పాపుత్ములమే, మా శక్తి సరిపోవడం లేదు, మీ ఆజ్ఞలను పాటించకుండా నీకు ద్రోహం చేశాము, మీ ప్రేమను మరచిపోయాము, మీ సేవను స్వార్థానికి వాడుకున్నాము. మీ సృష్టిని గౌరవించడం లేదు. కలుషితం చేశాము. ఓ ప్రభువా, మీ అధికారంతో మమ్ము శిక్షింపక, కరుణించి, పరివర్తన హృదయాన్నివ్వండి. నీవే మా మంచి కాపరి. నీ స్వరం వినేలా, నీ మార్గంలో నడిచేలా, హృదయశుద్ధిని దయచేయండి. ఓ ప్రభువా, మీకున్న అధికారాన్ని, మా రక్షణకై, మా క్షేమముకై, మా విడుదలకై వినియోగించారు. మీరే, మీ నామమున మాకు ఇచ్చిన అధికారాన్ని, మీ ప్రేమను పంచడానికి, క్రమశిక్షణ పెంపొందించడానికి, మీ ఆజ్ఞలలో జీవించడానికి వినియోగిస్తూ, మాలో పవిత్రతను పెంపొందించుకునేలా చేయండి. సదాకాలము, మీ అధికారమునకు మాత్రమే లోబడి, మీ సంరక్షణలోనే సమృద్ధిగా జీవించుదుముగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. యేసుక్రీస్తు అధికారమునకు లోబడి, ఆయన మహిమను ప్రకటిస్తూ జీవిస్తాను.
2. యేసుప్రభువు నా దైవముగా స్వీకరించి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ, విశ్వాస ప్రయాణాన్ని సఫలం చేసుకుంటాను.
3. ఈ లోకంలో ఎన్నో రకాల శక్తులు, దేవుని యందు విశ్వాసముతో జీవించే వారిని బలహీనపరుస్తున్నాయి. అలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే, ప్రార్థన, ఉపవాస అవసరాన్ని గుర్తించాను. సైతాను ప్రలోభాలకు లొంగక, ఎల్లప్పుడూ ప్రార్థనతో ఎదుర్కొంటాను.
4. అందరూ ఆశ్చర్యపడేలా, యేసు అధికారముతో బోధించాడు. యేసు ఇచ్చిన అధికారంతోనే శిష్యులు బోధించారు. యేసు పేరిట అనేక అద్భుతాలు జరిగాయి. యేసు నామమున పాప క్షమాపణ, నిత్యజీవం పొందడానికి ఆశాభావంతో ఉన్నాను.
5. యేసు నామమున విడుదల, రక్షణ లభిస్తుంది. శోధనలు ఎదురైనప్పుడు, యేసు నామాన్ని స్మరిస్తాను. కష్టాలలో చిక్కుకున్నప్పుడు, యేసు పేరిట ప్రార్థిస్తాను. లోక శక్తులు నన్ను లోబరుచుకున్నప్పుడు, యేసునే ఆశ్రయిస్తాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN