నేటి పునీతులు: పునీత రేమండ్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

31 Aug 2026

పునీత రేమండ్ గారికి 'నొన్నాటస్' అనేది ఇంటి పేరుగా వాడుకలోకి వచ్చింది. నొన్నాటస్ అంటే తల్లి గర్భం నుండి సహజంగా ప్రసవమై జన్మింపలేదని భావం. రేమండ్ గారి తల్లి ప్రసవ వేదనతో అర్ధాంతరంగా కన్నుమూయగా, వెంటనే శస్త్ర చికిత్సచేసి గర్భంనుండి శిశువును వెలుపలకు తీశారు. ఈ శిశువు క్రీ||శ|| 1204లో ఆవిర్భవింపగా రేమండ్ అని జ్ఞానస్నానంలో పేరిడినారు. వీరు ఉన్నత వంశానికి చెందినా, వీరిది మాత్రం స్పెయిన్ దేశంలోని ఒక నిరు పేద కుటుంబం.

"నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుము" అని పలికిన ఏసుక్రీస్తుని సిద్ధాంతాన్ని కార్యాచరణ రూపంలో ఉంచడానికి పునీత పేతురు నొలాస్కాగారు స్పెయిన్ దేశంలో సముద్ర తీరాన ఉన్న బార్సెలోనా పట్టణంలో 'మెర్సిడేరియన్లు' అనే సభను స్థాపించారు. క్రీస్తు విశ్వాసంలో క్రమశిక్షణలో పెరిగిన రేమండ్ గారు ఈ మెర్సిడేరియను సభపట్ల బాగా ఆకర్షితులై ఆ సభలో చేరారు. మఠవాసిగా శిక్షణ పొంది గురువుగా అభిషిక్తులయ్యారు. పేదలకు సేవలందించడంలో ఈ సభవారు ఎంతో ముందుండేవారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడేవారు. ఆ రోజుల్లో ధనవంతులు తమ ఇళ్లల్లో, పొలాల్లో, వ్యాపారాల్లో శాశ్వతంగా పనిచేసేందుకు డబ్బు ఇచ్చి బానిసలను కొనేవారు. ముఖ్యంగా నల్లజాతి ప్రజలు, నీగ్రోలు బానిసలుగా అమ్మబడేవారు. వారికింత తిండి పెట్టి గొడ్డుచాకిరీ చేయించేవారు యజమానులు. అట్టి యజమానుల చెరలోని బానిసలను విడిపించి స్వేచ్చ ప్రసాదించేందుకు ఈ మెర్సిడేరియను సభవారు తమ శక్తియుక్తులను ధారపోసేవారు. జాలిచూపేవారు.

పునీత రేమండ్ నొన్నాటస్ గారు కూడ తమ జీవితంలో ఎక్కువభాగం ఈ బానిసలను విడిపించడానికి అవసరపడినంత ధనాన్ని పోగుచేయడానికి వాడవాడల వీధివీధి తిరిగి భిక్షమడిగేవారు. దాన ధర్మాలను స్వీకరించేవారు. ఆ విరాళం సొమ్మును యజమానులకిచ్చి ఎందరో క్రైస్తవ బానిసలకు విముక్తి ప్రసాదించేవారు. రేమండ్ గారి సమర్ధత, సభ నియమావళి పట్ల నిబద్దత నెరింగిన పెద్దలు వీరిని సభ శ్రేష్ఠులుగా నియమించారు. సభశ్రేష్ఠులుగా వీరు రెట్టింపు ఉత్సాహంతో అనేకమంది బానిసలను వెలనిచ్చి విడిపించారు. "అల్జీర్స్ దేశం"లో క్రైస్తవ బానిసలు అనేకంగా ఉండుటచే వారి తరపున రేమండ్ గారే బంధితుడైనారు. ఒక బంధీని విడిపించడానికైతే ఎనిమిది మాసాలు గొడ్డుచాకిరీ చేశారు కూడ. ఆ విధంగా రేమండ్ గారు జైల్లో కూడ బంధింపబడి భయంకరమైన ఇబ్బందుల్ని ఎదు ర్కొవాల్సి వచ్చింది. అక్కడ సాటి ఖైదీలతో పాటు పలు కష్టాలు భరిస్తూనే జైలు అధికారుల్ని క్రైస్తవులనుగా మార్చేందుకు మత ప్రచార సేవల్ని గమనించిన అక్కడి మహామ్మదీయ ఉన్నతాధికారులు వీరి నోటికి తాళం బిగించారు. చివరకు వీరి సభ సభ్యులు అవసరమైన ధనాన్ని ఇచ్చి వీరిని జైలునుండి విడిపించారు.

ఫాదర్ రేమండ్ గారు తన జీవితకాలమంతా ఈ బానిసల విముక్తి సేవలోనే గడపడం వినిన పరిశుద్ద పోపుగారు వారిని సువార్తా సేవ చేయమని కోరారు. అట్లాగే పోపుగారి ఆదేశానుసారం రేమండ్ గారు క్రైస్తవ మతం తరఫున యుద్ధాల్లో పాల్గొనే క్రూసేడు వీరులకు సువార్తను బోధించారు. వారిని ఎంతో ప్రోత్సహించి క్రైస్తవులను చిన్నమందను కాపాడుకోడానికి క్రీస్తు సైన్యంగా తీర్చిదిద్దేవారు.

అయితే అల్బీర్స్ దేశంనుండి రేమండ్ గారు బంధవిముక్తులైన అనంతరం క్రీ||శ|| 1239లో తమ మాతృదేశమైన స్పెయిన్ కు తిరిగి వచ్చారు. అప్పటి జగద్గురువు 9వ గ్రెగొరిగారు వీరి సేవాదీక్ష త్యాగజీవితంను తెలసుకొని వీరికి కార్డినల్ పదవిని కట్టబెట్టారు. ఆ మరుసటి సంవత్సరం రోమునగరానికి ప్రయాణమై మార్గమధ్యంలో తమ 36వ ఏట క్రీ||శ|| 1240 ఆగష్టు 30న స్వర్గస్తులైనారు. క్రీ|| శ|| 1657లో అలెగ్జాండరు జగద్గురువులు వీరిని పునీతులుగా వెల్లడించి కొనియాడారు.

ప్రసవ వేదనలో ఉన్న మహిళలు, మంత్రసానులు, తప్పుడు నేరాలు మోపబడిన వాళ్లు పునీత రేమండ్ గారిని ప్రార్థిస పొందుతున్నారని విశ్వాసుల గట్టి నమ్మకం. వీరి పేరుమీద క్రొవ్వొత్తులను, నీళ్లను ఆశీర్వదించి శ్రీసభ గురువులు రోగు లకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రేమండ్ అనగా జ్ఞాన సంరక్షణ అని అర్థం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN