"నేపాల్ కన్నీరు - క్రీస్తు ఓదార్పు"

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
27 Aug 2026
ఆనంద పరవశాన ఆడుపాడు వేళలో,
జలరాకాసి మింగేసెను క్షణకాల లీలలో!
రసువా మొదలు ధాదింగ్ దాకా
ఆ కాళరాత్రిలో, ఇళ్లు, వంతెనలు,
ఆస్తులన్నీ కొట్టుకుపోయె వరదలో!
దిక్కుతోచక ప్రజలంతా
చెల్లాచెదరై పారిరి,
బాలలు అబలలంతా భయముతో వణికిరి!
ఈతగాళ్ల గుండెల్లోన
గజగజలు రేగెను,
ఉప్పొంగిన ప్రళయమున
ఊపిరిలే పోయెను!
ఎక్కడ చూచినా నేడు నిట్టూర్పు
ఓదార్పులే, పల్లెపల్లెనా మోగెను
మరణ మృదంగములే!
కంటిపాపలవంటి అమాయక
ప్రాణాలు నేలకూలెను,
కరుణామయుడు క్రీస్తుప్రభువే
కాపాడ తరలిరావలెను!
"మరణఛాయల లోయలో
నేను నడచినను, నీ దండము,
నీ ఊతకర్రయే నన్ను ఆదరించును!"
ప్రచండ నదీ ప్రవాహాలనైనా
ఆపగల ప్రభువు నీవే,
విలపించే నీ ప్రజల విన్నపాలు
వినే తండ్రీ నీవే!
సిలువ నీడను చేరి
ప్రభుని శరణు వేడుదాం,
ప్రజారక్షణకై, ఆత్మల
ఉపశాంతికై ప్రార్థిద్దాం!
పునరుత్థానపు ఆశను
హృదయాలలో నింపుకుందాం,
శాంతి సమాధానముల ఆ
శరణ్యమునే పొందుదాం!!
