ఏడవనాడు దేవుడు ఎందుకు విశ్రాంతి పొందారు?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం
26 Aug 2026
దేవుడు ఏడవరోజు విశ్రాంతి తీసుకున్నారు అని చెప్పడం ద్వారా దేవుడు చేస్తోన్న సృష్టి సమాప్తమైనదనీ, సృష్టిలో మానవుల ప్రమేయం ఏదీ లేదనీ - సూచన ప్రాయంగా తెలియజేస్తున్నారు పవిత్ర గ్రంథ రచయిత. (349)
మానవుణ్ణి స్వయంగా దేవుడే తన సహాయకుడుగా ఏదెను తోటలో (ఈ లోకంలో) నియమించినప్పటికీ (ఆది 2:15)- మానవుడు కేవలం తాను చేసే శారీరక శ్రమద్వారానే లోకాన్ని విమోచించలేడు.లోక విమోచనం దేవుడు అనుగ్రహించే వరం.అలా దైవానుగ్రహంతో విమోచన పొందిన ప్రపంచమే "కొత్త నింగి - కొత్త నేల" గా రూపాంతరం చెందుతుంది (యెషయా 65:17). లోక సృష్టి అంతిమ లక్ష్యం అదే. ఇక ఏడవనాడు దేవుడు పొందిన విశ్రాంతి, ఆదివారం నాడు మనం తీసికొనే విశ్రాంతి -- పారలౌకిక శాంతికి సంకేతం వంటిది. ఇది పరలోకంలో మనం అనుభవించబోయే అపూర్వమైన శాంతిని ముందుగానే మన అనుభవానికి తెస్తుంది. గనుకనే-ఆరురోజులపాటు మనం చేసిన శ్రమకంటే, ఏడవనాడు. మనం పొందే విశ్రాంతి ఉత్తమమైనది అర్థవంతమైనది అవుతుంది.
