దైవాంకితులను గౌరవిద్దాం

Fr. Sesetti Mariadas M.S.F.S.

23 Aug 2026

సామాన్య ఆదివారము -21 (A)
యెషయా 22:19-23,
రోమీ 1:33-36,
మత్తయి 16:13-20 :
ద్వితీయ వాటికన్ సమావేశమునకు ముందు 1960లో శ్రీసభ చాలా రకాలైన ఒత్తిడులకు, ఒడిదుడుకులకు గురియైనది. అప్పటి పరిశుద్ధ పాపుగారు ఆ తీవ్ర పరిస్థితులనుంచి ఏ విధంగా శ్రీసభను ముందుకు నడిపించాలోయని దిగ్బ్రాంతి చెందుతూ ఉండేవారు. కారణమేమంటే, గురు జీవిత అంతస్తుల్లో కష్టాలు, మఠ జీవితాల్లో కలహాలు, వివాహ జీవితాల్లో మనస్పర్థలు, విశ్వాసుల జీవితాల్లో లోప భూయిష్టాలు, శ్రీసభ వ్యవహారాల్లో రాజకీయాలు ఇంకా ఎన్నో సమస్యలతో సతమతమౌతున్న క్రైస్తవ సమాజానికి సమయానుకూల సందేశాన్నిచ్చి సంరక్షించడానికి పాపుగారు ప్రయాసపడుతూ, ఒక సాయంత్రం బాగా అలసిపోయి, ప్రతీరోజు తాను విధిగా చేసే సాయంత్రం ఒక గంట ఆరాధనను ఆయన ఆరోజు శరీర బడలికచే సరిగా చేయలేక ప్రభూ! శ్రీసభ నీది, నీకే చెందుతుంది. దాని సమస్యలన్నీ నీవే చూసుకో-నేను బాగా అలసిపోయాను. విశ్రాంతి తీసుకుంటానికి వెళ్తున్నాను అని రాత్రి నిద్ర కోసమై వెళ్ళారట. నిజమే... శ్రీసభ సమస్యలన్నీ తీరుస్తూ, శ్రీసభకు వాస్తవంగా నిత్యజీవన సౌందర్యాన్ని, శుభ సందేశాన్ని ఇచ్చేది స్వయంగా ప్రభువే! పేతురు అనే రాయి కానివ్వండి, వేరొక ప్రముఖ దైవ సేవకుడు కానివ్వండి. మన మందరం కేవలం నిమిత్త మాత్రులమే - మనందరం చిన్న సహాయకులమే - నిరాడంబర సేవకులమే - నిజానికి ఆ ప్రభువే పటిష్టమైన శ్రీసభ నిర్మాణకర్త. ఆయనే మూలరాయి. ఆయనే శ్రీసభ ప్రధాన యాజకుడై యుండియు, తన ప్రేమ సామ్రాజ్యమును విస్తరింపజేయుటకై పేతురు అనే పునాది రాయి మీద తన శ్రీసభను నిర్మించి, పేతురుకు ప్రధానాధిపత్యాన్ని ఇవ్వడం గురించి ఈనాటి పఠనాలు మనకు సందేశాన్నిస్తున్నాయి.

మొదటి పఠనము : యెషయా 22:19-23 : :
యెషయా గొప్ప ప్రవక్త. అతడు దేవుని దూతగా ఎన్నుకొనెను. (యెషయా 6:8) యెషయా ప్రవక్త పరిచర్య కాలంలో షెబ్నా అనే ప్రముఖ వ్యక్తి. రాజ గృహ నిర్వాహకుడు, రాజప్రసాధ్యక్షుడుగా ఉండెను. అతడు తన గర్వపుటాలోచనలవలన, తప్పుడు సలహాలవలన తన యజమానుని రాజకుటుంబమునకు మచ్చ దెచ్చెను. (యెషయా 22:15-18). షెబ్నా అప్పటి ఇస్రాయేలు రాజగు హెజెకియాకు సలహా దారుడు. ఆ రాజు తూర్పున ఉన్న అస్సీరియాకు కప్పం కడుతూవస్తున్నాడు. అంటే అతడు అస్సిరియా అదుపు ఆజ్ఞల్లో ఉన్నాడన్నమాట. అలా ఉండగలగడమే దైవ చిత్తమని యెషయా ప్రవక్త హెజేకియారాజుకు నచ్చచెప్పాడు. అయితే షెబ్నా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన సలహాను హెజెకియారాజుకిచ్చి, దక్షణాన ఉన్న ఐగుప్తు దేశపు రాజు మద్దతుతో అస్సీరియాపై దండెత్తమని రాజుని ప్రభావితుడ్ని చేసెను. తత్కారణంగా ప్రభువు కోపించి యెషయా ప్రవక్త ద్వారా షెబ్బాతో ఇట్లనెను. “నేను నిన్ను ఉద్యోగమునుండి తొలగింతును. నీ ఉన్నత స్థానమునుండి నిన్ను పడద్రోయదును. నీ స్థానమున నేను హిల్కియా కుమారుడును నా సేవకుడునైన యెల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికారమును అతనికి త్తును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రివంటివాడగును. దావీదు వంశపురాజు తాలపు చెవిని అతనికిత్తును. అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసిన దానిని, ఎవరూ తెరువలేరు. (యెషయ 22:19-23)

రెండవ పఠనము : :
రోమీ 11:33-36 : ఈ రోజు రెండవ పఠనము దేవుని యొక్క విశిష్ఠ వ్యక్తిత్వ సంపదను శక్తిని తెలియపరుస్తున్నాయి. దేవుని ఐశ్వర్యమును అంచనా వేయగల శక్తిమంతుడెవడు? ఆయన ఐశ్వర్యము అనంతము. ఆయన ఐశ్వర్యము ఎంతో ఘనమైనది. ఆయన వివేకము, విజ్ఞానములకు పరిమితి ఎక్కడ! కొలబద్ధయేది? ఆయన వివేక విజ్ఞానములు ఎంతో గాఢమైనవికావా? ఆయన నిర్ణయములను పరీక్షింపగలవాడెవు? ఆయన మార్గములను ఎరిగినవాడెవడు? ఆయన మనస్సు ఎవరికి గోచరము? ఆయనకు సలహాదారుగా ఉండగలవాడెవడు? ఆయనకేదైన ఇవ్వ సాహసించువాడెవడు? ఈ పైనుదహరించిన విషయములన్నియు దేవుని యొక్క అనంతశక్తి ఐశ్వర్యములను, వివేక విజ్ఞానములను, గాఢమైన ఆలోచనలను, దృఢమైన నిర్ణయాలను, లోతైన మనస్సును విశిష్టమైన వ్యక్తిత్వ సంపదలను, ఉన్నతమైన అంతస్థును వ్యక్తపరుస్తూ, సమస్త మునూ ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే అనే పరమ సత్యాన్ని వెల్లడిస్తూ, ఆయనకే సదా స్తుతి వైభవములు, గౌరవ మహిమలు చెందాలని సూచిస్తుంది.

మత్తయి 16:13-20 : :
ఈనాటి సువిశేష పఠనము పేతురు ప్రత్యేక అధికారం, అతని ప్రధానాధిపత్యం గురించి తెలియపరుస్తుంది. యేసు తనను గురించి ప్రజలు ఏమని భావించుచున్నారు అని తన శిష్యులను అడుగగా, వారు “కొందరు స్నాపకుడగు యోహాను అనియు, ఇంకొందరు ఏలియా అనియు, మరికొందరు యిర్మియా లేదా ప్రవక్తలలో ఒకడ నియు చెప్పుకొనుచున్నారు” అని సమాధానమిచ్చిరి. అపుడు యేసు “మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు?” అని శిష్యులను సూటిగా ప్రశ్నించెను. అందుకు కేవలము సీమోను పేతురు “నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు” (మార్కు 8:29) అని చెప్పగా ప్రభువు ఆనందించి “యోనా పుత్రుడవగు సీమోను! నీవు దన్యుడవు. సరైన సమాధానమిచ్చితివి. అయినను ఈ పరమ సత్యమును నీకు తెలియ జేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు. అని ఖచ్చితముగా తెలియపరుస్తూ “నీవు పేతురువు. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదవు. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బధింతువో, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును”. ఈ ప్రత్యేక అధికారమును ప్రభువు అతనికి ఒసగెను. పేతురు యొక్క సమాధానమే శాంతి సామ్రాజ్య స్థాపనకు పునాదియై దైవరాజ్య విస్తరణకు అంకురార్పణ గావించినది. అయితే ఇచట పేతురు కాదు ప్రధానము - ప్రభువే! పేతరు కేవలము రాయి మాత్రమే. నిర్మించువాడు ప్రభువే - పేతురు నిమిత్త మాత్రుడే - ప్రభువే నవ జీవన నిర్మాణ ప్రదాత. అయినా పేతురుకు ప్రధాన ఆధిపత్యము ఇవ్వబడినది. కారణం అతని ద్వారా పరలోక తండ్రి తన కుమారుని యొక్క ఉనికిని చాటిచెప్పడమే _ నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు (మత్త. 16:16) అందుకే పేతురు యొక్క ప్రధానాధిపత్యము!

ప్రసంగము : :
పూర్వం ఒక రాజు తన కొలువులో ఒక శక్తిగల మంత్రిని నియమించదలచి, ఆ పదవికి తగిన అర్హత కలిగిన వ్యక్తిని ఎన్నుకొనే నిమిత్తమై ఆ మంత్రి పదవి ఆశించి వచ్చిన అభ్యర్థులకు ఒక సమస్యనిచ్చి దానిని పరిష్కరించిన వారికే మంత్రి పదవి వసుందని చెప్పెను. ఆ సమస్య ఏమనగా రాజుగారివద్ద ఒక విచిత్రమైన తాళము ఉండెను. దానిని తెరచుట చాలా కష్టము. కాని తెరచినవారికి మంత్రి పదవి దక్కును అని ప్రకటించగా, వచ్చిన అభ్యర్థులలో చాలామంది ఈ విచిత్రమైన తాళమును తెరుచుట అసాధ్యము అని భయపడి దానిని కనీసము చూడకుండానే వెళ్ళిపోయిరి. మరి కొందరు దానిని అటు ఇటు త్రిప్పిచూచిరి. కాని తెరువ ప్రయత్నించ లేదు. కాని ఒక యుక్తిగల యువకుడు దానిని నిశితముగా పరిశీలించి నిశ్చింతగా ఉండెను. తగిన సమయము వచ్చినపుడు అసలు అది తాళము వేయబడనేలేదు అనే విషయమును రాజు గారికి తెలిపెను. కావున రాజుగారు అతని యొక్క సునిశితమైన పరిశీలనాశక్తిని మెచ్చుకొని, అసలు తాళమే వేయలేదనే రహస్యమును కనుగొని సునాయాసముగా సమస్యను పరిష్కరించగలిగినందుకు సంతసించి అతనికి ప్రధాన మంత్రి పదవినిచ్చి సత్కరించెను. అటులనే ఈ రోజు ప్రభువు పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెను. కారణమేమన పరలోకతండ్రి తన కుమారుని మనుష్యావతారము ద్వారా తన కుమారుడు దైవ కుమారుడైన క్రీస్తువు అనే విషయం లోకమంతటికిని తెరచి ఉ 0చిన్పటికిని, పేతురు మాత్రమే ప్రభువైన క్రీస్తుని నిజమైన తత్వాన్ని ప్రకటించెను. “నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అనే సంగతిని (మత్త. 16:16), అందుకు ప్రభువు సంతసించి పేతురుకు ప్రధానాధిపత్యము ఇచ్చి గౌరవించెను. ఇంకను “నేను నీకు పరలోకరాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో, అది పరలోకమందును బంధింపబడును” భూలోకమందు నీవు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడును”. అనే ప్రత్యేక అధికారమును కూడా కట్టబెట్టెను.

ఇటువంటి ప్రత్యేక అధికారమును పొందిన పేతురు యొక్క వ్యక్తిత్వమును మనము అవగాహన చేసుకొనుట సముచితము. పేతురు చాలా సాధారణమైన, చదువు రాని వ్యక్తి. (ఆ.కా. 4:13). అతడు ఒక జాలరి (లూకా 5:1-11). ఒకసారి అతను రాత్రంతయు శ్రమించి కూడా చేపలను పట్టలేకపోయెను. అపుడు ప్రభువు సూచించిన విధముగా అతడు వల వేయగా వల చినుగునన్ని చేపలు పడెను. తదుపరి పేతురు ప్రభువు పవిత్ర పాదములపై పడి “ప్రభూ! నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు” అని వేడుకొనినప్పటికిని, ప్రభువు అతనితో నీవు “భయపడవలదు, ఇకనుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు” అని అభయమిచ్చి ఆశీర్వదించగా, పేతురు భక్తిగలవాడైనప్పటికిని, భయస్తుడు, బలహీనుడు. నీటిపై నడచు అనుగ్రహము పొందియు భయపడెను, సందేశించెను. బలహీనతను ప్రదర్శించెను. (మత్త. 14:22-32)

యేసు శిస్యుల కాళ్ళు కడుగు సందర్భములో పేతురు - ప్రభువేమిటి? పాపాత్ముడ నైన నా కాళ్ళు కడుగటమేమిటి అని అడ్డుపడగా ప్రభువు అతనితో మృదువుగా, “నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదుకదా” అని పలుకగా పేతురు చిన్న పిల్లవానివలె తన విధేయతను ప్రకటిస్తూ, వినమ్ర హృదయంతో అట్లయిన ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగుము” అని తన పారదర్శక స్వభావమును ప్రదర్శించెను. (యోహాను 13:1-9)

వేరొక సందర్భములో పేతురు భయభ్రాంతుడై ప్రభువు ఎవరో తనకు తెలియదు, మూడు సార్లు బొంకి పొరబడినను చివరకు తన తప్పును తెలుసుకొని వెక్కివెక్కి ఏడ్చి పశ్చాత్తాపమొందెను. (మత్త. 26:69-75). ఒక సారి పేతురు ప్రభువుతో తన అచంచల విశ్వాసమును వ్యక్తపరుస్తూ విశ్వాస పాత్రుడుగా ప్రభూ! మేము ఎవరి యొద్దకు పోయెదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు” అని తన ప్రగాఢ విశ్వాసమును వ్యక్తపరుస్తూ (యోహాను 6:68)

మరోకసారి ప్రభువు తాను అనుభవించవలసిన బాధలను, మరణాన్ని గూర్చి ప్రస్తావించినపుడు మానవ మాత్రుడుగా "ప్రభూ! దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక! ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక! అనెను. అపుడు ప్రభువు పేతురుతో ఓ సైతానూ! నా ఎదుటనుండి పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంక ముగా ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు” అని (మత్త. 16:21-23). ఈ విషయమునే ఈనాటి సువిశేషములో ప్రభువు ప్రస్తావిస్తూ “నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోక మందున్న నా తండ్రియేగాని, “రక్త మాంసములు”కావు అని ఉద్ఘాటించెను.” దివ్య రూపధారణను గాంచిన పేతురు ప్రభువుతో, ఆనందభరితుడై, నీ అనుమతియైనచో నీకు, మోషేకు, ఏలీయాకు మూడు శిబిరములను నిర్మింతును (మత్త. 17:1-13) అని చెప్పి, ఎల్లప్పుడు అటువంటి ఆనందమయ జీవితాన్ని ఆశించిన పేతురు చివరకు రక్తవ్యోన్ముఖుడై తనమందకు మేపరిగా ఉండుటకు సముఖతను వ్యక్తమొనర్చెను. ప్రభువు తనతో మూడుసార్లు నా మందను మేపుదువా? అని అడిగినపుడు అవును ప్రభూ! నేను నీ మందకు కాపరిగా ఉండెదను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన ప్రేమ ప్రభువు పట్ల వ్యక్తపరచెను. ప్రభువిచ్చిన బాధ్యతను స్వీకరించెను. ప్రేమ లేనిదే బాధ్యతను నిర్వర్తించలేము. ప్రేమ పూరితమైన బాధ్యత ప్రభువుకు ప్రీతికరముగా ఉండును. (యోహాను 21:15-17) తన అనుచురుడైన పునీత యాకోబు తల్లడిల్లిన పేతురు ప్రభు ప్రేమకు సాక్ష్యమిస్తూ చివరకు వేదసాక్షిగా మరణించుట అతనికి క్రీస్తుపట్లగల ప్రేమను ఒక గొప్ప సాక్షిగా వ్యక్తపరుస్తుంది (1 పేతురు 5:1-4).

పేతురుకు ప్రభువు ప్రధానాధిపత్యమును ఇచ్చెను. అందుకు కారణము పేతురు చాలా పరిపూర్ణమైన వ్యక్తి అనికాదు. కాని ప్రభువు అతనిని పరిపూర్ణునిగా జీవించుటకు తన ప్రేమకు సాక్ష్యమిచ్చుటకు కావలసిన బలమును, అనుగ్రహ ఆశీస్సులను ప్రసాదించి, తనను తనమందకు ప్రధాన కాపరిగా నియమించెను. కావున మన బలహీనతలను గురించి మనము ఎక్కువగా ఆలోచింపక, మనలో ఉన్న పవిత్రాత్మ శక్తిని ఆ ప్రభు కార్యకలాపములయందు వ్యక్తపరచుటకు పేతురులా మనము కూడా సముఖత చూపిన యెడల తప్పక ప్రభువు మనలందర్ని తనదైన రాజ్యస్థాపనలో తమ చిత్తానుసారము మనలను వాడుకొని ఆశీర్వదిస్తారు. ప్రభు గెత్సమని తోటలో ఆవేదన పడుచున్నపుడు, “నా ఆత్మ మరణ వేదనపడుచున్నది. మీరచటనే యుండి జాగరణ చేయుడు” అని పలికినాసరే, పేతురు ఆ ప్రభు ఆవేదనా సమయములో నిద్రించెను. అపుడు ప్రభువు “ఇదేమి! మీరు నాతో ఒక గంట సమయమైనను మేలుకొని ఉండలేక పోయితిరా? (మత. 26:36–41) అని తన ఆవేదనను వ్యక్త పరచినప్పటికిని పేతురును విడనాడలేదు కదా! వేరొకసారి పేతురు ప్రభువుమీద గల ప్రేమతో, ప్రభువుని బంధించవచ్చిన సైనికుని కుడిచెవిని తెగనరికి హింసా ప్రవృత్తిని చూపిన పేతురుతో నీ కత్తిని ఒరలో పెట్టుము, హింస పనికిరాదని హిత బోధచేసి అతని ద్వారానే తన శాంతి సామ్రాజ్యాన్ని ప్రభువు స్థాపింప ప్రయాసపడ లేదా? “అందరు మిమ్ము విడిచి పెట్టిపోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికిని విడనాడను” (మత్తయి 26:33) అని ప్రగల్బాలు, గొప్పమాటలు పలికిన పేతురు ముమ్మారు బొంకినను ప్రభువు అతనిని మన్నించి తన వానినిగా స్వీకరించలేదా? ఎన్నో విధములుగా బలహీనుడైనప్పటికిని ప్రభువు అతనికి తన దివ్య రూపమును దర్శింప అవకాశమిచ్చెను (మత్తయి 17:1-13). కావున పేతురు యొక్క ప్రధానాధి పత్యము ప్రభువు దగ్గర నుంచి సంక్రమిస్తుందని మనము గ్రహించాలి. ఎన్నో రీతుల బలహీనుడైన పేతురును ప్రభువు ఆదరించి గౌరవ స్థానాన్ని శ్రీభలో ప్రసాదించి అతనిని ప్రధానకాపరిగా నియమించెను కావున మనమును అతని అధికారమును గుర్తించి, ఆ దైవకాపరి స్థానాన్ని గౌరవించాలి. పోపుగారి సానాన్ని ఒక గొప్ప ఐకమత్యానికి గుర్తుగా శ్రీసభలో మనము అర్థంచేసుకొని ఐక్యతా భావంతో జీవించాలి. వారి నాయకత్వాన్ని బలపరచి, విధేయతను పాటించాలి. ఒకసారి పునీత కేథరిన్ సియన్నా, మనం పోపుగారిపట్ల ఏ విధంగా మెలగాలో తెలియపరుస్తూ ఇలా అన్నారు. “పాపుగారిగా ఎన్నిక కాబడిన వ్యక్తి ఎవరైనాసరే వారిని మనము అధికముగా గౌరవించాలి. వారిపట్ల నిండైన ప్రేమను చూపించాలి. వారిపట్ల భక్తి ప్రపత్తులతో మెలగాలి. వారిని సంపూర్ణముగా విధేయించాలి, ప్రేమించాలి ఎందుకనగా దేవుని కుమారుని తర్వాత అత్యధికముగా గౌరవింపబడేది వారితల్లి మరియతల్లి ఆ తదుపరి స్థానము పాపుగారిదేకదా” - అని పునీత కేథరినా వారు తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.

పేతురు అంటే ఒక వ్యక్తికాదు, ఒక దైవశక్తిగా మనము అర్థం చేసుకోవాలి. కేవలము అతనిలో ఉన్న దైవశక్తి మాత్రమే అతనికి క్రీస్తు యొక్క నిజస్వరూపాన్ని, “నీవు దైవకుమారుడవు” అనే సత్యాన్ని బహిర్గతం చేయడానికి తోడ్పడింది. కావున అతని యొక్క అంతస్థును మనము గౌరవించాలి. దేవుని యొక్క ప్రధాన ప్రతినిధిగా ఆయనపట్ల మనకు తగిన మర్యాద, పూజ ప్రభావములు చూపించగలగాలి. (మత్తయి 10:2) అయితే ఈ ప్రధమ స్థానము లేక మొదటి శ్రేణి పదవి సేవ చేయుటకే గాని సేవింపబడుటకు కాదు (మార్కు 10:45). మొదటి క్రైస్తవులు పేతురు యొక్క అధికారమును, ఆధిపత్యమును అనుసరించి జీవించినట్లు మనమునూ ఆ పేతురు స్థానములో ఉన్న కతోలిక క్రైస్తవమతాధికారి, మన ప్రధాన యాజకులయిన పరిశుద్ధ పాపుగారిని, పీఠాధిపతులను, మఠాధిపతులను, గురువులను, దైవ ప్రతినిధులను గౌరవించాలి. దేవుని ప్రతినిధులను మనము గౌరవభావంతో చూడడం నేర్చుకొన్నట్లయితే అది భగవంతున్ని గౌరవించినట్లవుతుంది. కాని ప్రస్తుత సమాజములో కొన్ని సార్లు మనము ఇటువంటి విషయాలలో తగినవిధంగా జీవించలేకపోతున్నాము. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని ఆధ్యాత్మికతను, చివరకు భగవంతున్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము.

కారణమేమనగా మనం భౌతికమైనవాటిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాము. ధనము, అంతస్తు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులు, పదవులు ఇటువంటి వాటివలన మరియు టెక్నాలజీ యొక్క పురోభివృద్ధి వలన మానవుడు దైవ సంబంధిత విషయాలలో తగిన గౌరవభావాలు కలిగియుండక, భక్తిప్రవత్తులు సన్నగిల్లుతున్నాయి. కావున పేతురుని మనం ఈరోజు ప్రత్యేకంగా స్మరించి గౌరవించే ఈ క్రమంలో మరొక్కసారి మన మందరము ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో, తగిన శ్రద్ధను చూపి ప్రభువును గౌరవించుదాం. వారి ప్రతినిధులను అనుసరించుదాం! అలాగయితే మన జీవితాలు ధన్యమవుతాయి (మత్త 13:16-17).

అభ్యాస క్రియలు :
1. మత పెద్దలను, గురువులను వారి అధికారమును గుర్తించి, గౌరవింపుము.
2. పేతురువలె నీవును క్రీస్తు ప్రభువు ప్రేమకు సాక్ష్యమిమ్ము.
3. ఏదేని అధికారము సేవింపబడుటకు కాదు, సేవించుటకే అనే సత్యమును గుర్తించి అనుదిన జీవితములో అభ్యసింపుము.

కంఠత వాక్యము :
“యోనా పుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు... నీవు పేతురువు. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదవు... నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులును ఇచ్చెదను”. (మత్తయి 16:17-19)

సుకృత ప్రార్థన :
పరలోక తండ్రీ! క్రీస్తుని అనుసరించి జీవించుటకు కావలసిన ఆత్మ ధైర్యాన్ని, పవిత్రాత్మ అనుగ్రహాలను దండిగా ప్రసాదింపుము. ఆమెన్.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN