విశ్వ రాజ్జి - మరియతల్లి - నిర్వచనం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
22 Aug 2026
మరియమాత విశ్వగ్లోబు మీద నిల్చొని ఉండటంకొన్ని చిత్రపటాలలో గమనించవచ్చు.ఆమె పాదముల కింద ఒక సర్పం ఉంటుంది.దాని తలను ఆమె త్రొక్కినట్లుండే ఈ చిహ్నం ఆదికాండంలోని సంఘటనను గుర్తు చేస్తుంది... "ఆమె సంతతి వారు నీ తలను చితక గొట్టుదురు" (ఆది 3:15). ఆమె పరలోక భూలోక రాజ్ఞీగా ప్రకటించబడింది.అది ఆమె ఔన్నత్యానికి దేవుడు ఆమెకిచ్చిన గౌరవానికి ప్రతీక. ఆమె తలచుట్టూ ఉన్న పన్నెండు నక్షతాలు,పన్నెండు అపోస్తులులను సూచిస్తాయి. ఈ పన్నెండు ఆపోస్తులు ప్రపంచ నలుమూలలా వ్యాపించిన తిరుసభకు ప్రతినిధులు,ఈ సంజ్ఞలు దర్శన గ్రంథంలో వివరించబడినట్లు గమనించాలి: "అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను.ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను.సూర్యుడే ఆమె వస్త్రములు,చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను.ఆమె శిరస్సుపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను" (దర్శన 12:1) సూర్యచంద్రుల ప్రస్తావన పగలు రాత్రికి సంకేతము. ఈ చిహ్నాలు ఆమె తన పవిత్రతతో ఈ లోకంలో సాధించిన ఘనతను,దైవానుగ్రహముతో పొందిన అత్యున్నత స్థానాన్ని గుర్తుచేస్తున్నాయి.ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు, దేవుడు ఆమెతోనున్నాడని గాబ్రియేలు సన్మనస్కుడు సెలవిచ్చాడు (లూకా 1:28) ఆమె తల మీది కిరీటం ఆమె విశ్వరాజ్ఞ అన్న సూచనను తెలియజేస్తుంది. 1954లో 12వ భక్తినాధ పాపుగారు ఆమెను పరలోక రాజ్ఞీగా అభివర్ణించారు. తాము చెప్పే జపమాలలో దేవరహస్యాన్ని ధ్యానించడం కతోలికుల భక్తి మార్గాలలో ఒకటి.
