ఆగస్టు 22వ (పరిశుద్ధ మరియరాణీ మహోత్సవం)

Father gopu praveen

21 Aug 2026

...రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన క్రీస్తు భగవానుడి తల్లియగు మరియమాతను కతోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుండే రాజ్ఞీగా గౌరవించటం ఆనాదిగా వస్తున్న విశ్వాసం

...భూలోక జీవిత యాత్ర ను విశ్వాసముతో ముగించుకొని "మోక్షారోపణం" చెందిన మరియతల్లిని తండ్రి కుమారా, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెను ఇహఃపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు. శ్రీ సభ ఆమెను రాజ్ఞీగా ఎన్నుకొని "మరియరాజ్ఞీ" మహోత్సవాన్ని నెలకొల్పింది.

ప్రతిఏటా ఆగస్టు 22వ తేదీన మన తల్లి శ్రీ సభ "మరియరాజ్ఞీ" ఉత్సవాన్ని భక్తివిశ్వాసాలతో కొనియాడుతూ. మరియమాత ఇహ: పరలోకాలకు రాజ్ఞీ అనే సత్యాన్ని ప్రకటిస్తుంది. ఈ మేరకు మరియరాజ్ఞీ పండుగను గూర్చి, మరియతల్లి రాచరీకమును గూర్చి కొన్ని విషయాలను ధ్యానిద్దాం-:

ప్రాచీన విశ్వాసం-:
4వ శతాబ్ద కాలానికి చెందిన పునీత ఎఫ్రేమ్ గారు మరియతల్లిని ఎలినరాలు అని, రాణీ అని సంబోధించారు. ఈ సంబోధనలు అప్పటినుండి శ్రీ సభలో కొనసాగుచున్నవి. కథోలిక వేదపండితులు, మత పెద్దలు, మరెందరో పునీతులు మరియతల్లిని రాణీగా సంబోధించడం కొనసాగించారు. ఏడవ శతాబ్ద కాలానికి చెందిన పునీత ఇల్డెఫోన్సస్ గారు మరియతల్లిని గూర్చి ఈ విధముగా పేర్కొన్నారు

"నేను క్రీస్తు దాసుణ్ణి గనుక మరియ దాసుణ్ణి మరియ దేవుని దాసురాలు గనుక నా రాజ్ఞీ నేను మరియరాజ్ఞీని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసుకుంటాను అని పేర్కొన్నారు". 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు మరియమాత గౌరవార్థం పరిశుద్ధ రాణి వందనం, పరలోక రాణి వందనం,మోక్షారాజ్ఞీ వందనం అని సంబోధించినట్లు శ్రీసభ సాంప్రదాయం ద్వారా, పితరుల బోధనల ద్వారా తెలుస్తున్నది.

పండుగ చరిత్ర-:
1954 అక్టోబర్ 11న 12వ భక్తి నాథ పోపు గారు విశ్వాసుల కోరిక నిమిత్తం "మరియరాణీ" పండుగను దైవార్చన జాబితాలో చేర్చారు. అప్పటినుండి ఈ పండుగకు విశ్వాస సత్య హోదా లభించినది. 12వ భక్తి నాథ పోపు గారు మరియ మాతకు "రాణీ" అనే బిరుదు ఆమోదయోగ్యమైనదని పేర్కొన్నారు. ఇప్పుడు "మరియరాణి" పండుగను మరియ "మోక్షారోపణ" పండుగ నుండి ఎనిమిదవ నాడు(ఆగస్టు 22) కొనియాడినట్లు శ్రీసభ నిర్ణయించింది.

మరియరాజ్ఞీ -: నిర్వచనం
మరియమాత పిత,సుత, పవిత్రాత్మ అను ముగ్గురు దైవ వ్యక్తుల సమక్షంలో ఇహ:పరలోకాలకు రాజ్ఞీగా నియమింపబడింది. సర్వ సృష్టిప్రాణులందరికీ ఆమె రాజ్ఞీ."కృపారసము గల మాతయై యుండెడి రాజ్ఞీ" వందనము మొదలైన ప్రాచీన జపములు ఆమెను రాజ్ఞీగా పేర్కొంటాయి .కనుక బహు ప్రాచీన కాలం నుండే క్రైస్తవ భక్తజనులు ఆమెను రాజ్ఞీగా కొనియాడుతూ వచ్చారని విశదమవుతుంది. మరియ తల్లి రాజ్ఞీత్వం పరిపాలన కొరకు కాదు మన కొరకు తన ప్రియ కుమారునికి మనవి చేయటం కోసం. ఆ తల్లి మానవులందరి కొరకు క్రీస్తుకు మనవి చేస్తుంది. క్రీస్తు ద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వర ప్రసాదాలను అర్ధించి పెడుతోంది. ఆమె రాజ్యం క్రీస్తు రాజ్యం- దైవ రాజ్యం భూమిపైన ఉత్తరించు స్ధలములో,నరకంలో, మోక్షంలో కూడా ఆమె రాచరికం చెల్లుతుంది. నరకంలోని దుష్ట ఆత్మలకు గర్వభంగం కలిగిస్తారు.ఉత్తరించు స్థలము లోని ఆత్మలకు తన ప్రియ కుమారుని ద్వారా విడుదల ప్రసాదిస్తారు. మోక్షం లోని దేవదూతలకు, సకల పునీతులకు రాజ్ఞీగా ఉన్నారు. క్రీస్తు రాజ్య పాలన చేయనంత కాలము మరియ రాజ్ఞీగా ఉంటారు ఇది దైవ చిత్తం.

మరియరాజ్ఞీ-: దేవుని ఉద్దేశం-:
క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు అడుగు జాడల్లో నడిచే వారికి ఆయన రాజ్యపాలనలో సైతం పాలుపంచుకుంటారు అన్న వాగ్దానం మరియమాత విషయంలో నెరవేరినది.(మత్తయి 19:28) అనగా దేవుని సామ్రాజ్యంలో పాలకులుగా, న్యాయమూర్తులుగా అధికారము నెరపెదరు. ప్రభువును అనుసరించడంలో శ్రమలకు గురైనవారు ప్రభువు పాలనలో భాగస్తులు అవుతారు(లూకా 22:28-30) ప్రభువు కొరకు మరణించిన వారు ఆయనతో రాజ్యపాలన గావిస్తారు( 2 తిమోతి 2:11-12) మరియతల్లి తన ఇహః లోక జీవితమంతా దేవుని చిత్తమునకు విధేయంగా జీవించారు. దేవుని చిత్తానుసారము జీవించారు క్రీస్తును సిలువ మరణం వరకు అనుసరించారు. రాచరికమునకు కావాల్సిన అర్హతలన్నిటిని సాధించారు. అయితే మరియమాత రాచరికం ఆమె సొంత శక్తి వలన పొందిన కాదు. అది రాజైన క్రీస్తు పై సంపూర్ణంగా ఆధారపడి ఉన్నది. మరియతల్లి దీనత్వమును బట్టి దేవుడు ఆమె యందు గొప్ప కార్యములు చేసి మహిమ పరిచారు. దేవుని పట్ల మరియమాత చూపిన సంపూర్ణ విశ్వాస, విధేయతల వలన దేవుడు ఆమెను ఇహ:పరలోకాలకు రాజ్ఞీగా నియమించారు.

మరియ రాజమాత, పరలోక రాజ్ఞీ-: బైబిల్ ఆధారాలు

మరియ రాజమాత-:
క్రీస్తు రాజ్య పాలనలో భాగస్తురాలుగా, దేవుని న్యాయ సభలో ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నారు. ప్రజల తరుపున మనవి చేయు న్యాయవాదిగాను, తన కుమారునికి సలహాదారునిగా ఉన్నారు మరియతల్లి. పాత నిబంధనలో దావీదు వంశపు రాజులలో రాజు గారి తల్లి మాత్రమే రాజమాత హోదాను కలిగి ఉంటారు. సొలొమోను రాజు తన తల్లి బెత్షెబను చూచి సింహాసనమును దిగి శిరస్సు వంచి నమస్కరించి మరల ఆసనం మీద కూర్చుంటాడు. రాజునకు కుడి పక్క బెత్షెబకు మరియొక ఆసనము వేయగా ఆమె దాని పై కూర్చుంటుంది(1రాజు 2:19). రాజు తన తల్లితో అమ్మ! నీ మనవులు నాకు తెలుపుము. వాటిని నెరవేరుస్తాను అంటాడు. అదేవిధంగా మన తల్లి మరియరాజ్ఞీ కూడా మన మనవులను రాజాధిరాజైన తన ప్రియ కుమారునికి విన్నవించి మనకు సాధించి పెట్టుచున్నారు.

మరియ రాజమాత,పరలోక రాజ్ఞీ బైబిల్ ఆధారాలు-:

1.యెషయా ప్రవక్త ప్రవచనము-:
"సరే వినుడు; ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి యిమ్మానువేలు అని పేరు పెట్టును".
(యెషయా 7 : 14) యెషియా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం దావీదు వంశములో జన్మించబోవు రాజుకు తల్లి కాబోతున్న రాజమాత మరియను గూర్చి తెలియపరుస్తున్నది. ఆ కుమారునికి "ఇమ్మానుయేలు" అని పేరు పెట్టబడును. "ఇమ్మానుయేలు" అనగా దేవుడు మనతో ఉన్నారని అర్థం. దావీదు వంశములో జన్మించిన రారాజు మెస్సయ్య కు తల్లి మరియమాత కావున తన కుమారుని రాజ్యములో "రాజమాతగా" "పరలోక రాజ్ఞీగా." వెలుగొందుతున్నారు.

2. సైతాను పై యుద్ధం-:
ఆదికాండము 3:15 ప్రకారము స్త్రీ సంతతి( క్రీస్తు) సాతాను తలను చిదుకగొట్టును అని ఉంది. దావీదు వంశపు రాజులు తమ శత్రుసైన్యాన్ని జయించినట్లుగా దావీదు వంశంలో జన్మించిన క్రీస్తు భగవానుడు సైతాను అహమును అణచి దాన్ని సామ్రాజ్యాన్ని కులద్రోశారు. సాతాను సంతతి తలను చిదుక గొట్టు యుద్ధములో క్రీస్తుతో మరియ సంపూర్ణంగా సహకరించి రాజమాతగా ఉన్నారు.

3.యోహాను దర్శనం-:
"అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను"
(యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 12 : 1)
పై వచనములో సూర్యుడే వస్త్రములు గల స్త్రీ మరియమాతను సూచిస్తున్నది ఆ స్త్రీ కుమారుడే సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలించును. పరలోక సింహాసనమును అధిష్టించి దైవ రాజ్యస్థాపన గావిస్తారు. సైతాను రాజ్యమును కూల్చుతారు (దర్శన 12:5) ఆ స్త్రీ శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటంతో రాచరికపు అంతస్తులతో అలరారు చున్నారు ఆమె ఇశ్రాయేలీయుల 12 గోత్రములు ప్రజలకే గాక 12 మంది అపోస్తులులచే నిర్మితమైన యావత్ విశ్వ శ్రీ సభకు చెందిన వారు యోహాను గారికి కలిగిన ఈ దర్శనము రాచరికపు స్త్రీ రారాజుకు జన్మనివ్వటమునకు గుర్తుగా ఉన్నది.

4.ఎలిజబేతమ్మ సాక్ష్యం-:
మరియతల్లి ఎలిజబేతమ్మను సందర్శించినప్పుడు ఎలిజబేతమ్మ ఆనందముతో మరియతల్లిని "నా ప్రభువు తల్లి" అని పేర్కొన్నారు ఈ విధంగా అనటం ద్వారా మరియ రక్షకుడు, రాజైన క్రీస్తు భగవానుడు తల్లి రాజమాత అని సాక్ష్యం ఇస్తున్నారు(లూకా 1:43)

పరలోక పట్టాభిషేకం-:
దేవుడు తన దూతలను పంపి మరియమాతను ఆత్మ శరీరాలతో మోక్షానికి తోడ్కొని వచ్చారు. మోక్షంలో గొప్ప ఉత్సవం జరిగింది.దేవుడు తన ప్రియ పుత్రిక మరియను చూచి సంతోషిస్తున్నారు .క్రీస్తు భగవానుడు తల్లిని గాంచి ముగ్ధుడైపోయాడు. పవిత్రాత్మ దేవుడు తన నివాసమైన పవిత్ర మరియను చూచి పరవశించాడు. అందరూ ఆమెను గౌరవిస్తూ ఆహ్వానించారు. దూత గణాలు ఆనంద నాదము చేశాయిణ స్తుతి గీతాలు ఆలపించాయి. త్రిత్వేక సర్వేశ్వరుడే ఎదురేగి ఆహ్వానించి సింహాసనం మీద ఆసీనురాలను చేసి పరలోక, భూలోక రాణిగా ప్రకటించి అభిషేకించి కిరీటంతో అలంకరించారు. స్వర్గస్తులంతా సంతోషించారు. మరియతల్లి వినయ విధేయతలతో ఒదిగిపోయి దేవుని స్తుతించారు.

భక్తి భావం-:
మరియ ఇహఃపరలోకాలకు రాజ్ఞీ అని మనము సంపూర్తిగా విశ్వసించాలి మరియు సేవించాలి. మన జప తపాలు, భక్తి క్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞీకి కానుక పెట్టాలి. 12వ శతాబ్దం లోనే భక్తుడు బెర్నార్డ్ గారు మరియతల్లిని ఉద్దేశించి తల్లీ! నీ శరణుజొచ్చి,నీ సహాయమడిగి,నీ వేడుకోలును కోరుకున్న వాళ్ళల్లో "నిరాశ చెందినవాడు ఒక్కడు లేడు" అని సవాలు చేశాడు. ఈ సవాలు మనకు ధైర్యం ఆశను కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతుండాలి. తల్లిచాటు బిడ్డలుగా భక్తి వంతమైన జీవితాన్ని జీవించాలి క్రీస్తు మార్గంలో నడవాలి అందరికీ పండుగ శుభాకాంక్షలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN