"పిలువబడిన వారు - ఎన్నుకొనబడిన వారు"

ఫాదర్ పూదోట దాసయ్య

20 Aug 2026

సామాన్య 20వ గురువారము
"పిలువబడిన వారు - ఎన్నుకొనబడిన వారు"

"పిలువబడిన వారు అనేకులు, కానీ, ఎన్నుకొనబడిన వారు కొందరే."
(పు. మత్తయి 22:14)

ప్రార్థన: కరుణామయా, ప్రేమగల ప్రభువా, మిక్కిలి ప్రేమతో పేరు పెట్టి మమ్ము పిలిచి, పరలోక విందుకు ఆహ్వానించారు, పుష్టిగా మమ్ము పోషించి రక్షించారు.‌ ఓ మా యేసయ్యా, అయోగ్యులమైన మమ్ము, మీ ప్రజలుగా స్వీకరించి, కనికరముతో ఆదరించి, మీ ప్రేమ విందుకు ఆహ్వానించారు. మీ ప్రేమ విందులో పాల్గొనే అదృష్టాన్ని ఇచ్చినందుకు శతకోటి వందనాలు. ఓ ప్రభువా, మీ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేలా కృప చూపండి. మీ విందులో పాల్గొనే ఆశీర్వాదం పొంది, మీ విందును స్వీకరించి, రక్షణ భాగ్యాన్ని పొందే అవకాశాన్నివ్వండి. ఓ యేసయ్యా, పరలోక రాజ్యాన్ని పెండ్లి విందుతో పోల్చి ఉపమానంలో బోధించారు. మీ రక్షణ బలి ఫలాలను, సమృద్ధిగా మాలో ఫలింప చేయుటకు, జీవాహారముతో మమ్ము పోషించుటకు, ప్రేమతో మమ్ము ఆహ్వానించారు. కానీ పిలువబడిన వారు నిరాకరించారు. కొందరు ఈ లోక సంబంధమైన వ్యవహారాలను ఎత్తి చూపిస్తూ, నిర్లక్ష్యం వహించారు. ఎవరి ప్రయోజనాలను వారే చూసుకున్నారు. పూర్తిగా నిన్ను తృణీకరించారు. మరికొందరు, మీ సేవకులను నిర్ధాక్షిణ్యంగా హతమార్చారు. అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. రక్షణ అవకాశాన్ని కోల్పోయారు. నిత్య శిక్షకు పాత్రులయ్యారు. ఓ ప్రభువా, మీ నిత్య ప్రేమతో, సమస్త జాతి ప్రజలపై కనికరం చూపండి. మా అందరి రక్షకుడవు నీవే. మమ్ము తృణీకరించకండి. మా బలహీనతలను లెక్కించండి. మా పాపములో మమ్ము విడిచి పెట్టకండి. దారి తప్పిన గొర్రెలమైన మమ్ము, సురక్షిత ప్రాంతానికి చేర్చండి. ఓ ప్రభువా, నీ ప్రేమ విందులో పాల్గొనుటకు అర్హత నిచ్చారు. మీలో నేను పొందిన జ్ఞాన స్నానం ద్వారా, మీ ప్రేమ విందులో పాల్గొనుటకు అవసరమైన, వివాహ వస్త్రమును, నాపై కప్పారు. ఈ పరిశుద్ధతా వస్త్రమును, నా విశ్వాస ఘనతకు గుర్తుగా నిలిపారు. ఓ ప్రభువా, నీ ఆహ్వానాన్ని స్వీకరించి, ప్రేమ విందును ఆరగించి, రక్షణ వరాలలో ఫలించి, నీ సాక్షిగా జీవించి, పరలోక రాజ్యంలో, నీ సేవకునిగా నా జీవితం వర్ధిల్లునుగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. ఈ లోకంలో మనము కొనియాడు అన్ని మహోత్సవాల కంటే, అత్యంత మహోన్నత ఉత్సవము, దైవ రాజ్యములో దేవుడు సిద్ధపరచిన మహోత్సవమే. ఆ మహోత్సవములో పాల్గొనుటకు, నేను ఎంతో ఆత్రుతతో ఉన్నాను. ప్రభువు ఎన్నుకొనిన ప్రజలలో నేను ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
2. యేసుక్రీస్తు శరీరంలోని భాగముగా, ఎల్లప్పుడూ నా బాధ్యతలను నేను నెరవేరుస్తూ, దేవుడు ఇవ్వబోతున్న బహుమానమునకై నిరీక్షిస్తాను.
3. ప్రభువు పిలుపును అందుకొని, నా సొంత ఇష్టా యిష్టాలను, నా ప్రాధాన్యతలను, నా కోరికలను ప్రక్కన పెట్టి, ప్రభువు పిలుపుకు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటాను. పిలుపు అందిన వెంటనే, ప్రభువుని ఆహ్వానము స్వీకరించి, సంతోషముతో ఆయన విందులో పాల్గొంటాను. ఆయన ఎన్నుకొనబడిన మందలో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
4. ప్రభుని ఆహ్వానమును, వివిధ సాకులు చూపుచూ, తృణీకరించి, నన్ను నేను సమర్ధించుకోవడం అవివేకంగా భావిస్తున్నాను. మొట్ట మొదట దేవుడే, ఆ తరువాతనే ఇతర విషయాలు. ప్రభువు ఎప్పుడు పిలిచారని కాదు, తాను పిలిచిన వారిలో నాకు ఆహ్వానం లభించడమే ఆనందంగా భావిస్తున్నాను.
5. పరలోక విందుకు ప్రభువు విశ్వాసులందరినీ ప్రేమ పూర్వకముగా ఆహ్వానిస్తున్నాడు. ఆయనతో కలిసి భుజించడం కంటే గొప్ప బహుమానమే లేదు. అందుకు నేను అయోగ్యుడనే, ప్రభువే నాపై కనికరించి, యోగ్యతా వస్త్రమును కట్టబెట్టి, పరలోక పంక్తిలో చేర్చుకున్నారు. ఈ భాగ్యమును కోల్పోకుండా గౌరవప్రదంగా జీవిస్తాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN