దైవార్చన సంగీతం దేవుని మహిమను చాటుతూ విశ్వాసులను పవిత్రతలో నడిపించాలి - పోప్
వాటికన్ వార్తా విభాగం
19 Aug 2026
బుధవారం సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో XIV దైవార్చన సంగీతం గురించి బోధిస్తూ,అది కేవలం ప్రార్థనా కార్యక్రమంలో భాగంగా వినిపించే సంగీతం మాత్రమే కాదని, ఆరాధనలో అంతర్భాగమని అన్నారు.రెండవ వాటికన్ మహాసభలోని Sacrosanctum Concilium బోధనను ప్రస్తావిస్తూ,దైవార్చన సంగీతం యొక్క ప్రధాన ఉద్దేశం దేవునికి మహిమ కలిగించడం,విశ్వాసులను పవిత్రతలో ఎదిగేలా చేయడం అని వివరించారు.పవిత్ర గానం ప్రార్థనకు స్వరాన్ని అందించడంతో పాటు,సంఘ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుందని,విశ్వాసుల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని,జరుపుకుంటున్న విశ్వాస రహస్యంలోకి మరింత లోతుగా ప్రవేశించేందుకు సహాయపడుతుందని చెప్పారు.సంగీతం ద్వారా మన హృదయం దేవునితో, తోటి విశ్వాసులతో ఏకమవుతుందని పేర్కొన్న పోప్, పునీత ఆగస్టిన్ చెప్పిన “పాడటం ప్రేమించేవారి లక్షణం” అనే భావాన్ని గుర్తుచేశారు. దైవార్చన సంగీతం గంభీరమైనదిగా, సరళమైనదిగా,ఉన్నత ప్రమాణాలతో కూడినదిగా ఉండాలని, ప్రధానంగా పవిత్ర గ్రంథం,ప్రార్థనా గ్రంథాలు మరియు సంఘ ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి ప్రేరణ పొందాలని సూచించారు.గ్రెగోరియన్ గానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని,లాటిన్ సంఘంలో ఆర్గన్ వంటి సంప్రదాయ వాయిద్యాలకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పారు.అదే సమయంలో,దైవార్చన సంగీతంలో నాణ్యతతో పాటు ప్రార్థనా సందర్భానికి తగిన భావం,గౌరవం,ఆధ్యాత్మిక లోతు ఉండాలని స్పష్టం చేశారు.
