నేటి పునీతులు: పునీత జాన్ యూదెసు
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
19 Aug 2026
పునీత జాన్ యూదెసుగారు ఫ్రాన్సుదేశంలోని నార్మండి మండలంలోని 'రీపట్టణం'లో క్రీ||శ|| 1601 నవంబరు 14న జన్మించారు. ఇస్సాక్ యూదెస్, మార్తె కోర్బిని దంపతులకు పుట్టిన తెలివి, స్పురద్రూపియైన యూదాసుగారు పెద్ద చదువులకోసం కయెన్ పట్టణంలోని ఏసుసభవారు నిర్వహించే కళాశాలలో తమ 14వ ఏటనే ప్రవేశించారు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా వారు బ్రహ్మచర్యం పాటించడానికి కంకణం కట్టుకున్నాడు. పారిస్ నగరం, ఔబెర్ విల్లీర్స్ నగరాల్లో కూడా చదివి తమ విద్యను ముగించారు. పిమ్మట సన్యసించి క్రీస్తు వాక్యాన్ని ప్రకటింప ఆశించారు.
అందుకే ఫ్రాన్సులోని ఆరేటరీ మఠవాసుల సభలో చేరి కార్డినల్ బెరుల్లేవారి హస్తాం మీదుగా వారి 24వ ఏట పవిత్ర గురుపట్టాభిషిక్తులయ్యారు. గురువుగా శక్తివంచన లేక సేవలందించారు. పునీత విన్సెంట్ ఫెక్టర్ గారంతటి పేరునుగడించి తన వయస్సుకు శక్తికి మించిన ప్రజ్ఞాశాలిగా కొనియాడబడ్డారు.
క్రీ||శ|| 1625లోను 1631లోను నార్మండి మండలంలో రెండు దఫాలుగా ప్రబలిన ప్లేగ్ అనబడు కలరా వ్యాధివల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అట్టితరి ఫాదర్ యూదాసుగారు ధైర్యంగల వాలంటీరుగా నాయకత్వం వహించి ప్లేగువ్యాధిగ్రస్తుల్ని పరా మర్శించారు. క్రీస్తు సాక్షిగా, అపూర్వ పరిచారకునిగా, మత ప్రచారకునిగా తన పూర్తి సేవలతో రోగగ్రస్తుల శారీరక, ఆధ్యాత్మిక అవసరాలను తీర్చకలిగారు.
ఈ గడ్డుకాలందాటిన పిమ్మట దశాబ్దంపాటు ఒక ఆదర్శ గురువుగా శక్తివంతంగా పనిచేశారు. వేద ప్రచారానికి సహాయకులను తయారుచేసుకొని 110 విచారణలను ఏర్పరచ కలిగారు. సుడిగాలిలా ఆ సంఘాల్లో తిరుగాడుతూ క్రీస్తు రక్షణ్యకార్యాన్ని చాటుతూ వేలాదిగా ప్రజలకు జ్ఞాన స్నానాలనందించారు. అన్ని విధాలా పాపానికి వ్యతిరేకంగా ప్రభు సందేశాలతో సమరం కొనసాగించారు. మరణశయ్యపై ఉన్న వృద్ధులను, రోగులను తగు విధంగా ఆయత్తపరచి మోక్ష మార్గం సుగమమయ్యేలా వార్ని తీర్చిదిద్దటంలో కృతకృత్యులయ్యారు.
అనేక కట్టుబాట్లతో కూడి ఉన్న ఆరేటరీ సభలో ఉండి తన పూర్తిస్థాయి సేవల్ని అందింపకలగటం కష్టమని తలంచి ఆ సభనుండి రాజీనామాచేశారు. కార్డినలు రిచేలియగారి అనుమతితో క్రీ||శ|| 1643లో వారు ఏసు మరియ గురుసభను స్థాపించారు. వారు సెక్యులర్ గురువులనబడ్డారు. పరిశుద్ధత, పవిత్రవాక్య పరిచర్య ధ్యేయంగా వారు పనిచేశారు. వీరిది యూదిస్టులసభగా పేర్కొనబడింది. కాని కొన్ని కారణాలవల్ల వీరిసభకు రోమునుండి ఆమోదముద్ర లభించలేదు. అలాగే మెడలీ న్గామి అను ఒక పుణ్యకన్య ఆధ్వర్యంలో పశ్చాత్తాప మహిళలకోసం విజిటండైన్ సభను కయెన్ పట్టణ కేంద్రంగా నెలకొల్పారు.
క్రీ||శ|| 1650లో ఫాదర్ జాన్ యూదెసుగార్ని తమ మేత్రాసనంలో ఒక సెమినరీని స్థాపించి నిర్వహించవలసిందిగా బయెయుక్స్ పట్టణ పీఠాధిపతులచే కోరబడ్డారు. ఆ సంవత్సరమే విజిటండైన్ సభ కన్యస్త్రీ సభికుల పేరుమార్చి 'అనాధల దాతృత్వ మరియమాత మఠకన్యలసభ'యని నామకరణం గావింపగా బయె యుక్స్ పీఠ మేత్రాణులు గుర్తింపు నందించారు.
ఇది ఇలా ఉండగా పాదర్ యూదెసుగారు 1653లో లీసియుక్స్ నగరంలోను, 1659లో రూయెన్ పట్టణంలోను సెమినరీలను నెలకొల్పి నిర్వహించారు. వీరు స్థాపించిన 'అనాధల దాతృత్వ మరియమాత మఠకన్యలసభ'కు 1666లో 3వ అలెగ్జాండరు పోపుగారిచే ఆమోద పతి అనుగ్రహింపబడింది. 1666లోనే ఎవరుక్స్ నగరంలోను, 1670లో రెన్నెస్ నగరంలోను సెమినరీలు పెట్టినడిపించారు. ఏసు పవిత్ర హృదయం, మరియ పవిత్ర హృదయంపట్ల భక్తి ప్రపత్తులను ప్రబలంచేయడంలో యూదె గారు పునీత మేరి మార్గరేట్ అలకోక్వెగారితో కలసి కృషి సల్పడం విశేషం.
పునీత యూదెసుగారు గొప్ప ఆథ్యాత్మిక రచయిత కూడాను. క్రీ||శ|| 1668లో ఏసు పవిత్ర హృదయ ప్రత్యేక పూజాబలికి అవసరపడే గేయాలను యూదెసుగారే రచించారు. ఏసు తిరుహృదయ ఆరాధనా ప్రార్థనలు, పరిశుద్ధ మరియ దేవరతల్లి హృదయ సంస్తుతి ప్రార్థనలు విరచించారు. 1670లో ఈ రచనలు గావించి క్రైస్తవాళిలో విశ్వాసభక్తిని పెంపొందింప కృషిసల్పారు. వీరు నెలకొల్పిన సంస్తుతి మరియ హృదయ సంఘం వీరి సభలో మూడవ వర్గ సభగా విరాజిల్లింది.
మహనీయుడైన ఫాదర్ జాన్ యూదాసుగారు శ్రీసభ వ్యాప్తికి ఇంతగా శ్రమించి క్రీ||శ|| 1680 ఆగష్టు 19న కయెన్ పట్టణ మఠాలయంలో పరమపదించారు. 1925లో వీరికి పునీత పట్టా ప్రధానం చేయబడింది 11వ భక్తినాధ పోపు గారిచే.
