"దైవమే నా ధనము - దైవ రాజ్యమే నా గృహము"

ఫాదర్ పూదోట దాసయ్య

18 Aug 2026

సామాన్య 20వ మంగళవారము
"ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే, ఒంటె సూది బెజ్జంలో దూరి పోవుట సులభతరము, అని యేసు శిష్యులతో చెప్పెను."
(పు. మత్తయి 19:24)

ప్రార్థన: సర్వాధికారియైన ఓ యేసు ప్రభువా, ఓ సమృద్ధి ప్రదాత, సకల ఐశ్వర్యములు నీనుండే లభించుచున్నవి. సమస్తమునకు ఆధారభూతుడవు నీవే. మా సంతోషం నిమిత్తము, సిరిసంపదలను ఇచ్చావు. వాని వైభవమును చూసి, వానిని మాకు దయచేసిన నిన్నే స్తుతించి, నీ ప్రేమను పొందాలని కాంక్షించారు. ఓ దేవా, నీ మహిమ ఐశ్వర్యములకై నీకే స్తుతులు అర్పిస్తున్నాను. ఓ నా గొప్ప ప్రభువా, మానవ లోకం, సంపదల సుడిగుండంలో చిక్కుకొని పోయింది. ధన బలం, గర్వానికి కారణమై, నీ వైపు చూడకుండా చేస్తుంది. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కష్టం అన్నారు. నీ ప్రజలమైన మేము, సిరి సంపదలు, అవి కొనివచ్చే, పేరు ప్రఖ్యాతలలో, లోక వ్యామోహములలో చిక్కుకొని, సృష్టికర్తవైన నిన్నే, దిక్కరిస్తున్నాము. ధన కాంక్ష అన్ని అనర్థాలకు మూలం అని గ్రహించేలా చేయండి. ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన సమస్తమును నీవే మా కనుగ్రహించారు. మిమ్ము అనుసరించుటకు, నీవు మా క్షేమము కోరి ఇచ్చినది ఏదియు, మీ ప్రేమకు, మీ రాజ్య ప్రవేశానికి, ఆటంకము కాకుండునట్లు వినియోగించేలా చేయండి. ఓ దేవా, సమస్తమును త్యజించి, మిమ్ము అనుసరించిన శిష్యులకు, మీరు వాగ్దానం చేసిన, నూరంతల ఆశీర్వాదాన్ని, నిత్య జీవితమునకు వారసత్వాన్ని మాకును దయచేయండి. ఓ యేసయ్యా, మా బలహీనతల వలన, నీ కంటే మిన్నగా ఈ లోక వస్తువులపై, ఆశను, ప్రేమను పెంచుకుంటున్నాము. ధనం లేకపోతే జీవితం లేదని భావిస్తున్నాము. డబ్బు సంపాదనకై జీవితాన్ని వెచ్చించి, మీ ఆజ్ఞలను దిక్కరిస్తూ ఉన్నాము. సోదర ప్రేమ లోపించి, మా తోటి వారిని మోసగించి, ధన కాంక్షతో బ్రతుకుచున్నాము. ఓ దేవా, త్యాగపూరిత హృదయాన్నివ్వండి. నాపై కనికరం చూపి, మీరే నాకిచ్చిన సమృద్ధిలో, నా తోటి వారి క్షేమమును, అభివృద్ధిని, ఆరోగ్యమును, అవసరాలను గుర్తెరిగి, ప్రేమతో, సేవా భావముతో, వారితో పంచుకునే ఉదార స్వభావాన్ని ఇవ్వండి. నా ఆస్తి, అంతస్తు నీవేయని గుర్తించి, సకల సమృద్ధిలో సదా మీకే మహిమకరంగా జీవించుదునుగాక. ఆమెన్.

ఆత్మాభ్యాసం:
1. యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని జీవించుటయే, సురక్షితమని నేర్చుకున్నాను. ఈ లోకం నాకు అందించే, సెక్యూరిటీ కంటే, యేసుక్రీస్తులో నాకు లభించే సెక్యూరిటీనే ఆశిస్తున్నాను.
2. డబ్బు/సంపదలు ఇవ్వలేని జీవిత బీమా, యేసుక్రీస్తు లోనే కనుగొన్నాను. నా ఆత్మ సంరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువేనని విశ్వాసముతో ప్రకటిస్తున్నాను.
3. డబ్బుతో కొనలేని ఆత్మ సంతోషం, యేసుక్రీస్తు సహవాసంలోనే లభిస్తుంది. నిత్య జీవం పొందాలంటే, వెలకట్టలేని యేసు స్నేహం కోరుకుంటున్నాను. ప్రభువు సన్నిధిలోనే నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను.
4. యేసుక్రీస్తు కోసం, ఈ లోక సంపదలను త్యజించుటకు సిద్ధంగా ఉన్నాను. సమస్తమును విడిచిపెట్టి యేసు మార్గంలో జీవిస్తాను. ఆస్తి అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, చదువుసంధ్యలు, ఈ లోకంలో నా గౌరవాన్ని పెంచుతాయేమో గానీ, పరలోక రాజ్యంలో యేసు సమక్షంలో, నాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరలోకంలోనే నిజమైన సంపద కోరుకుంటున్నాను.
5. లోకము దృష్టిలో ధనవంతునిగా ఉండి, దేవుని దృష్టిలో పేదవానిగా ఉండుట కంటే, లోకము దృష్టిలో పేదవానిగా ఉండి, దేవుని దృష్టిలో సంపన్నునిగా ఉండుటకు ఆశాభావంగా ఉన్నాను. దానికి తగిన విధంగా నా జీవితాన్ని మలచుకుంటాను. యేసు బోధనలకు అనుగుణంగా జీవిస్తాను.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN