ఎవరు అన్యులు? ఎవరు విశ్వాసులు? ఎవరు దేవుని బిడ్డలు?

Fr. Sesetti Mariadas M.S.F.S.
15 Aug 2026
సామాన్య ఆదివారము - 20 (A)
యెషయా 56:1,6-7,
రోమీ 11:13-15,29-32;
మత్తయి 15:21-28
ఒకసారి ఒక యువకుడు ఇలా అంటున్నాడు. “ఫాదర్! బైబిలు చదవాలంటె చాల భయంగా ఉంది. అది చదువుతుంటే దేవుడు ఇంత భయంకరంగా, పక్షపాతంగ వ్యవహరిస్తారా అని భయం కల్గుతుంది. ఉదా:- “నీవు శీఘ్రమె పోయి అమాతకీయులను వధింపుము” వారి ఆస్తి పాస్తులను శాపం పాలుచేయుము. వారిలో ఒక్కరిని కూడ బ్రతకనీయవద్దు. స్త్రీలను, పురుషులను, పసికందులను, చంటిబిడ్డలను, ఎడ్లను, గొఱ్ఱెలను, ఒంటెలను, గాడిదలను అన్నింటిని మట్టుపెట్టుము. ఇది యావె ఆజ్ఞ.”1 సామూ. 15:3. దేవుడు ఇంత ఘోరమైన ఆజ్ఞ ఇస్తారా? ఇంత పక్షపాతంగ వ్యవహరిస్తారా? అందరు ఆయన బిడ్డలు కారా? బైబిలు చదివె అనేకమంది సమస్య ఇది. ఇలాంటి సంఘటనలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. దేవుని సృష్టి విచిత్రమైనది. అంతు చిక్కనిది. అందులో ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి. మనుష్యులలోను ఎన్నో విచిత్ర పోకడలు ఉన్నాయి. కొందరు “ఏక దేవుని విశ్వసించి ఆరాధిస్తుంటే కొందరు బహు దేవతారాధన చేస్తుంటారు. ఇది ఎలా సంభవించింది? అంతుచిక్కని పరమ రహస్యం! ఏకదేవుడైన తనను పూజించేవారిని ఒకలాగ (ప్రేమతో) 'విగ్రహారాధకు' లను మరోకలాగ (అసహ్యంతో) చూస్తుంటారు. ఇది బైబిలు గ్రంథ సారాంశం. మిగత ఏ మతంలోగాని, సంస్కృతిలోగాని లేని మన గర్షనీయమైన గుణం ఒకటి యూదులలో (క్రైస్తవులలోను. మహ్మదీయులలోను) ఉంది. యావె ప్రభువు తమను మాత్రమె తన జనంగా ఎన్నుకొన్నారని, మిగిలిన వారందరిని తిరస్కరించారని గుడ్డిగా, మూర్ఖంగ విశ్వసించారు! తాము మాత్రమే ప్రపంచంలో అధికులం అని విర్రవీగేవారు. అన్యులను కేవలం నరకానికి సమిధలుగా సృష్టించారని అన్నారు. వారిని కుక్కలకన్న, పందులకన్న హీనంగ చూచారు. అందువలన దేవుడె వారిని, వారికున్న వన్నియు నాశనం చేయమన్నట్లు వ్రాసికొన్నారు. తాము చేసిన అకృత్యాలన్నింటిని ఆ విధంగా సమర్ధించుకొన్నారు. యూదులద్వార అందరికి రక్షణ అని అపుడపుడు వారిలో కొందరు అన్న మాటలకు అంత విలువ నివ్వలేదు. ఈనాడు క్రైస్తవులలో కూడ ఈ ధోరణ ప్రభలుతున్నది. ఈ వైఖరి మారాలి.
ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు అన్యులు ఏవిధంగా దేవుని కృపను, ఆదరణకు పాత్రులగుచున్నారో వివరిస్తున్నాయి. ప్రథమ పఠనం. యెషయ 3: 56-66 గ్రంథ ప్రారంభవచనాలు. ఈ గ్రంధం బాబిలోనియ ప్రవాసం తర్వాత వ్రాయబడింది. ఈ గ్రంధకర్త రక్షణ, దైవకృప అన్ని జాతులకు అంటున్నారు. “నా ఆలయం సకల జాతి జనులకు ప్రార్ధనాలయం అనుబడును” అంటున్నాడు. అన్యులను బాగా చూచుకోవాలని ఆనాడే సూచనలు ఇవ్వబడినాయి. వీటిని అంతగా పట్టించుకోలేదు. “మీరు పరదేశిని చెరుపరాదు, బాధింపరాదు. (నిర్గమ 22:21) “యావె దేవాది దేవుడు.... అతడు పక్షపాతం చూపడు. పరదేశులను ఆదరించి వారికి కూడు గుడ్డ దయచేయును. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు”. ద్వితీ. 10:17-19. యెషయ వాగాన భూమికి బయట నివసించువారికి కూడ దైవ కృప లభించును అంటున్నాడు. తన కాలంలో (ఎజ్రా 4:3, మలాకి 1:3) మొదలగువారు సంకుతి మనస్సులతో ప్రవర్తిస్తుంటె ఈయన అందుకు వ్యతిరేకంగ ప్రకటిస్తున్నాడు.
అనేకులు దైవకృప పొందినట్లు చూడగలం. కొందరు దేవుని ప్రణాళికలో పాలి భాగస్థులయినారు. తామారు, రాహాబు కాననీయులు. ఆది. 38; యెహోషువ 2, ఊతు మోవాబు స్త్రీ రూతు 1. బెత్నెలు హితీయురాలు 2 సామూ 11. వీరంత అన్యులె అయినప్పటికి, దేవుని ప్రణాళికలో భాగస్తులు అయినారు. సారపాతు విధవరాలు 1 రాజు 17, సిరియా నామాను 2 రాజు. 5, కొరెషు రాజు యెషయ 45:1 దేవుని కృపను పొందారు. ఎందరో ప్రవక్తలు బోధించినను “దేవుని ప్రజలు” మారు మనసు పొందిన దాఖలాలు లేవు. కాని యోన బోధించగ అన్యులైన నినివె వాసులు మనసు మార్చుకొన్నారు. యూదులలో ఒక వర్గం వారు దేవుడు అందరికి అన్నారు. కాని అధిక సంఖ్యాకులు అది నమ్మలేదు. యెషయ 2:1-4, 11:1-9, 45:22, 49:6, 0:1-8, 66:18-23. యెషయ అందరికి రక్షణ అంటున్నారు. యేసు కూడ దేవుడు అందరికి తండ్రి, అందరి మేలుకోరువారు. “అంటున్నారు మత్త. 5:45.
ఆదిమ సంఘంలో రక్షణ యూదులకు మాత్రమే అనేవారికి, అందరికి అనెవారికి మధ్య ఘర్షణ ఉన్నట్లు 2వ పఠనం స్పష్టం చేస్తున్నది. పేతరుగారు మొదట యేసు ప్రభువు, తాను కూడ యూదుల కొరకె అని నమ్మినట్లు తెలుస్తుంది. అయితే ఆయన తర్వాత తెలిసికున్నారు. “దేవుడు ఎట్టి పక్షపాతము లేక ఆయనకు భయపడుచు సత్ప్రవర్తన గల ఏ జాతి వాడైనను ఆయనకు అంగీకారయోగ్యుడె” అని ప్రకటిస్తు న్నాడు. అ.చ. 10:34-35.
సువార్త పఠనంలో యేసు వర్ణ విచక్షణ చూపించినట్లు కనబడుతున్నది! మత్త 10:5; 15:24. అపోస్తులును ప్రచారానికి పంపించే నాటికి వారికి దైవ రాజ్యం గూర్చి తెలిసింది చాల తక్కువ. కనుక “అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరీయుల ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కాని చెదరిపోయిన గొఱ్ఱెలవలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళి పరలోకరాజ్యం సమీపించినదని ప్రకటింపుడు మత్త. 10:5-7. తాను మాత్రం అందరికి బోధించారు. అందరిని స్వస్థపరచారు. మరోక విషయం గమనించగలం. మార్కు సువార్తలో శిష్యులను పంపినపుడుగాని 6:7-13 కననీయ స్త్రీతో మాట్లాడినపుడు గాని 6:24-29 మత్తయి సువార్తలోని మాటలు కనబడవు. మత్తయి సువార్తలో “నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొఱ్ఱెల కోసం మాత్రమే పంపబడితిని” అనే మాటలు మార్కులో లేవు. మత్తయిగారు యూదుల కొరకు తన సువార్తను వ్రాసారని గుర్తించాలి. ఇది సంఘంలో ఘర్షణకు అద్దం పడుతున్నది. రెండు సువార్తలలోకూడ యేసు “కుక్క పిల్లలు” అనె పదంవాడారు. ఆయన ఏ సందర్భంలో అలా అన్నారో ఒకసారి పరిశీలించాలి. మానవుడిగ యేసుకు కూడ కొంత పరిమితి ఉంది. అలసట, విసుగు, కోపం, నిరాశ అపుడపుడు కలిగాయి. ప్రతి స్వస్థత ఆయన శక్తిని హరిస్తున్నది. తనను వాడుకొంటున్నారెగాని అర్థం చేసుకోవటం లేదు. విరోధులు ఎక్కువవుతున్నారు. అందువలన ఆయన కొంత విశ్రాంతి, ఏకాంతం కోరుకొన్నారు. మార్కు 7:24. ఇలాంటి సమయంలో ఆ స్త్రీ రావటం ఒక విధంగా దురదృష్టకరం. ఆమె కష్టము తీవ్రమైనది. అయినా యేసుని బాధ, ఆయన మానసిక స్థితి ఆమెకు తెలియదు. ఆమె తన బాధగురించే ఆలోచిస్తున్నది గాని యేసును గురించి ఆలోచించటం లేదు. కొందరు బయటకు తమ బాధను వెల్లడించగలరు, కొందరు చేయరు. బహుశ యేసు అసహనంలో ఆ సామెత వాడి ఉండవచ్చు. ఆయనకు ఎవరిని కించపరచె నైజం లేదు. ఆయన వెంటనే ఆమె కోరికను స్పందించలేకపోవటం మేలే చేసింది. పరోక్షంగా ఆమె సహనాన్ని, పట్టుదలను పెంచింది. ఇది యూదులకు ఒక గొప్ప గుణపాఠం. “మీరు కుక్కలు, పందులు అనుకొనెవారు మీకంటె ఓర్పుతో, నిరీక్షణతో, వినయం, విశ్వాసంతో ఉన్నారని” చెప్పినట్లైంది. మీరు తిరస్కరించిన రక్షణా రొట్టి, వారి పాలవుతుంది. 2వ పఠనంలో పౌలుగారు అలాగే చెపుతున్నారు. ఈనాడు క్రైస్తవం స్వీకరించని వారిని ఎలా చూస్తున్నాం? 'అవిశ్వాసులు' అంతా నరకానికి పోతున్నారని విశ్వసిస్తున్నామా? నేను ఒకసారి ఇల్లు అద్దెకు తీసికొని అన్యులమధ్య నివసించాల్సి వచ్చింది. పక్క ఇండ్లలోనివారు అన్యులు ఒక పెద్ద ఆవిడ, ఒక మధ్యవయస్సురాలు (సుమారు 25 సం||లు ఉండవచ్చు). ఇద్దరు ఉదయాన్నే స్నానం చేసి, పూలు కోసి దేవుని ముందు కూర్చొని చాలా సమయం జపం, భగవద్గీతను చదవటం చేసేవారు. అలాగే సాయంకాలం కూడ, కాని మన క్రైస్తవులకు అలాంటి అలవాటు లేదు. ఆదివారం కూడ అనేకులు పూజకు కూడ వచ్చేవారు కాదు. ఎవరు అన్యులు? ఎవరు విశ్వాసులు? ఎవరు దేవుని బిడ్డలు?
