ఇంకా రాని సురాజ్యం! - కథానిక

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
14 Aug 2026
ఇంకా రాని సురాజ్యం!
----------------------------
రాత్రి పది గంటలైంది.టీవీకి,ఫోనుకి గుడ్ బై చెప్పి బెడ్ పై చేరాను. నా శ్రీమతి " ఏమండీ, ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి. రేపు ఉదయాన్నే మార్కెట్ కి వెళ్ళి మంచి కూరగాయలు పట్టుకరండి" అన్నది. ఆమెతో అలాగేలే అంటూ,మరుసటి రోజు ఆగస్టు 15,కనుక భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, ఒక కథ రాద్దామని ఆలోచిస్తూ నిద్రలోకి జారాను.
ఉదయాన్నే పెందలాడే లేచి, మొఖం కడుక్కొని , దబ దబా మార్కెట్ కి బయలుదేరాను. వీలైనంత పెందలాడే వెళ్తే ఎక్కువమంది జనం ఉండరని నేను వేగంగా నడుస్తున్నాను.నేను అనుకున్నట్టే ఆ వేళలో బజారంతా నిర్మానుష్యంగా ఉంది.కొట్లు ఇంకా తెరవలేదు. నేను బాగా ముందే వచ్చినట్టుంది అనుకొంటూ నడుస్తున్న నాకు , అచ్చం గాంధీ తాత లాగున్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతను ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్టు ,రఘుపతి రాఘవ రాజారాం అనే పాటని బాధగా పాడుకొంటూ ,భారంగా అడుగులేస్తున్నాడు.ఆగస్టు పదిహేను పండగ రోజుల్లో ఏ బిచ్చగాడో అడుక్కోవడానికి ఇలా గాంధీవేషంవేసుకొన్నాడేమోఅనుకొంటూ,"ఏమయ్యా! గాంధీతాత లా భలే వేషం వేశావే!ఇంతకీ నీ పేరేంటి? మీదే ఊరు?"అన్నా! "నేను గాంధీజీ ని బాబూ!మీరంతా జాతిపిత అంటారే ఆ గాంధీని నేనే" అన్నాడు మెల్లగా చల్లని గొంతుతో."ఏంటీ నువ్వు నిజంగా గాంధీ తాతవా?అన్నాను నేను ఆశ్చర్యంగా! "ఔను బాబూ! నాకు తెలుగు ఎట్లా వచ్చు నని అనుకొంటున్నవేమో? నేను ఇప్పుడు స్వర్గ లోక వాసిని కదా? అందుకని అన్ని భాషల్లో మాట్లాడ గలను" అంటున్న ఆయనతో " అయితే మీరు మన దేశాన్ని చూడ్డానికి ఎప్పుడూ ఇలా స్వర్గం నుండి దిగి వస్తుంటా రన్నమాట.మేమంతా స్వాతంత్రం పండుగ జరుపుకొనే రోజుల్లో వచ్చిన మీరు, మీ నాయకత్వంలో సాధించిన స్వతంత్ర భారతాన్ని చూసి సంతోషించకుండా ఎందుకు అలా విచారంగా ఉన్నారు గాంధీ తాతా? "అని అడిగా ఆత్రంగా. "ఏముంది బాబూ! దేశంలో కొన్ని చోట్ల నా విగ్రహాల స్థానంలో నన్ను కాల్చి చంపిన గాడ్సే విగ్రహాలు పెట్టి గౌరవిస్తున్నారు. ఎన్నో ప్రాంతాల్లో అందలాలెక్కిన వాళ్ళు చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని అవినీతి సంపాదన వ్యామోహంలో పడి, కుల మత భేదాలను రెచ్చగొట్టి,ప్రజలను విడగొట్టి, తమ అధికారాలకు ఏ అడ్డు లేకుండా చూసుకొంటుంటే,ప్రజలేమో రౌడీయిజం చేసే వాళ్లకు, బూతు ప్రసంగాలు చేసే వాళ్లకు,జైళ్లకు వెళ్లి వచ్చే వాళ్లకు జే జేలు కొడుతున్నారు!మద్యం మానండి బాబూ అని నేను ప్రచారం చేస్తే, ఈ నాడు ప్రభుత్వాలే మద్యాన్ని ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆడపడుచులు ఒంటరిగా అర్ధరాత్రి నిర్భయంగా తిరగ గలిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్లని నేనంటే,పట్టపగలు కూడా వాళ్ళు నిర్భయంగా తిరగలేని రోజులు మన దేశంలో నాకు కనిపిస్తున్నాయి.స్వరాజ్యమైతే వచ్చింది కానీ నేను కోరుకున్న రామ రాజ్యం ఇంకా నా స్వతంత్ర భారతంలో ఏర్పడలేదే అని నా గుండెల్లో ఒకటే బాధ గా ఉంది బాబూ" అంటూ ఆయన గుండెలపై చేతులతో గట్టిగా కొట్టుకుంటున్నాడు. ఆయన్ని ఆపడానికి "తాతా! ఆగు!గాంధీ తాతా!గాంధీ తాతా" అని నేను పెద్దగా అరవడం మొదలుబెట్టాను!
"ఏంటండీ? పొద్దెక్కినా లేవకుండా ఏందో తాతా తాతా అని కలవరిస్తున్నారు? లేవండి తొందరగా మార్కెట్ కి వెళ్ళి రండి " అని నా శ్రీమతి కేక వేయడంతో కళ్ళు తెరిచిన నాకు అర్ధమైంది,నేను గాంధీ తాత తో మాట్లాడింది ఇలలోకాదు,
కలలోనని. నిజమే మరి "మనకు స్వరాజ్యం వచ్చింది గానీ సురాజ్యం ఇంకా రాలేదు" అనుకుంటూ బెడ్ నుండి పైకి లేచాను.
