నేటి పునీతులు: పునీత యుప్లియస్
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
12 Aug 2026
మూడవ శతాబ్ద ద్వితీయార్ధంలో యుప్లియస్ ఇటలీకి దిగువనగల సిసిలీ ద్వీపంలో జన్మించారు. గొప్ప క్రైస్తవ భక్తుడు. ఆ రోజుల్లో డయోశ్లేషియాన్ చక్రవర్తి జరిపిస్తున్న వేదహింసలు క్రైస్తవులను భయభ్రాంతులను చేస్తున్నాయి. అందువల్ల ఎందరో రహస్య క్రైస్తవులుగా జీవిస్తుండేవారు. ఏదోక సందర్భంలో వారి విశ్వాసం బయట పడినప్పుడు వేదసాక్షి మరణంకు వెనుదీయక క్రీస్తు సాక్షులుగా వెలుగొందేవారు.
అట్టి కోవలోకి చెందిన డీకనుగారే ఈ పునీత యుప్లియస్ గారు. గవర్నరు అయిన కల్వేషియన్ దర్బారులో పట్టుబడిన కొందరు క్రైస్తవ విశ్వాసులు నిశ్శబ్దంగా లోలోన దేవుని ప్రార్థించుకుంటు చేతులు కట్టుకొని ఉండగా యుప్లియస్ గారి హస్తాల్లో మాత్రం క్రీస్తును గూర్చిన సువార్తల పుస్తకం మెరుస్తూ కనిపించింది. గవర్నరు అడిగిన ప్రశ్నకు యుప్లియన్ “అవును నేను క్రైస్తవుడను. ఏసుక్రీస్తు నామం కొరకు మరణించడానికి నేను మహదానందంగా ఉన్నాను” అని బిగ్గరగా నిర్భయంగా బదులిచ్చారు. అందుకు వారు కారాగారంలో వేదనలకు గురిచేయబడ్డారు. తీవ్రంగా కొట్టబడ్డారు. వారికి బ్రతకడానికి ఒకే ఒక అవకాశం ఇచ్చారు. రోమను దేవతలకు ఒక్కసారి వంగి నమస్కరిస్తే విడిచి పెడ్తామన్నారు.
యుప్లియస్ గారికి ప్రాణాల పై తీపిలేదు. క్రీస్తు నామం మీదే ఎడతెగని మక్కువ ప్రదర్శించారు. "పిత పుత్ర పవిత్రాత్మను మాత్రమే ఆరాధింపగలవాడను" అంటూ వారి ప్రలోభాలను తిరస్కరించారు. శ్రీసభ విశ్వాసంకు కట్టుబడి ఉన్నానని తన గట్టిమాటను విన్పించారు. “త్రిత్వైక దేవునే మ్రొక్కుతాను. నా దేవునికి మించిన అన్యదేవుడు లేనేలేడు" అని సాక్ష్యం పలికారు. వెంటనే కారాగార భటులు తమ పెద్దల ఆజ్ఞచొప్పున ఆ మహనీయుని పవిత్ర హస్తాల్లో నుండి పవిత్ర గ్రంథాన్ని గుంజుకుని ఒక త్రాడుకు కట్టి వారి మెడలో
వేళ్లాడదీశారు. తలారులు ఉన్న విభాగంలోనికి విభాగంలోనికి బరబర ఈడ్చుకుపోయారు. అక్కడ ఆ క్షణమే ఆ వేదసాక్షి తల క్రూరంగా నరకబడింది. ఈ బలమైన క్రైస్తవ విశ్వాసియైన డీకను క్రీ||శ|| 304లో అతి పిన్న వయస్సులోనే క్రీస్తుకోసం హతులుకావడం మరెందరో క్రైస్తవులకు నూత్నబలం చేకూర్చింది. వారు జీవించి ఉన్నరోజుల్లో వారు నుడివినట్లు “దేవుని పై నమ్మకం పెట్టుకో! వారినే విశ్వసించు. వారు మనకు ఆప్తులు. కాగా మనకెందుకు ఇక కలవరం ?” అనే సందేశం జ్ఞప్తికి తెచ్చుకున్నారు విశ్వాసులు.
