ఆపదలో ఆదుకునే దేవుడు

Fr. Sesetti Mariadas M.S.F.S.

08 Aug 2026

సామాన్య ఆదివారము -19
1 రాజు. 19:9,11-13,
రోమీ 9:1-5;
మత్త 14:22-33.
భగవంతుడు మన సర్వావస్థలయందును మనకు దగ్గరగ తోడుగ ఉంటారని దివ్యగ్రంథ పఠనాలు నేర్పిస్తున్నాయి. ఇహలోకాన ప్రతి ఒక్కరికి ఏదో రకమైన కష్ట నష్టాలు, వ్యాధి బాధలు, ఇబ్బందులు మొదలగు విపత్కార పరిస్థితులు తటస్థించే అవకాశం ఉంది. అవి తలంచుకొన్నపుడు లేదా సంభవించినపుడు భయాందోళనలకు గురికావటం మానవనైజం. భయం అనే ఈ ఉద్వేగం మనిషి నిర్మాణంలోని అంత ర్భాగం. ఉదాహరణకు కంటికి ఆపద కల్గించేది ఏదైన దగ్గరకు వస్తున్నపుడు మనకు తెలియకుండానే కనురెప్పలు మూతబడతాయి. కొందరు కోడెనాగులను సైతం ఆటాడిస్తారు కాని గొంగళి పురుగు, బొద్దింకలు మొదలగు చిన్న చిన్న క్రిమి కీట కాదులకు భయపడుతుంటారు. ఆపదలు సంభవిస్తాయని భయం. ప్రాణం పోతుందని భయం. ఆస్తిపాస్తులు, పరువు ప్రతిష్టలు, పదవులు, బంధుమిత్రులు ఇలా ఉన్నవి. పోతాయని భయం. లేనివాడికి రేపు ఎలా అని భయం, మనిషిని భయం ఎన్నో రకాలుగా పట్టి పీడిస్తుంది. దీనికి కొన్ని కారణాలు వాస్తవం. కొన్ని ఊహా జనితం. ఏలియా ప్రవక్త బాలు ప్రవక్తలను సంహరించినపుడు మెసెబేలు రాణి "నీవు మా ప్రవక్తలను వధించినట్లే రేపిపాటికి నేను నిన్ను వధింపనేని దేవతలు నా ప్రాణములనే బలిగొందురుగాక” (1 రాజు. 19:2) అని శపధం చేసింది. ఇది వాస్తవం. కనుక ఏలియా భయపడి పారిపోతున్నాడు. నిరాశ నిస్పృహలకు గురౌతున్నాడు. 19:4. సువార్తలో శిష్యులు యేసును పెనుభూతం అనుకొని, ఊహించుకొని భయపడు తున్నారు. భూతం మనిషికి హాని చేస్తుందని భయం. కొందరికి దేవుడు కూడ భూతంలా కనిపిస్తారు. తనకు మొక్కకపోతే, బలులు అర్పించకపోతే హాని చేస్తారని భయం. కొందరికి సాటి మనుష్యులు కూడ పెనుభూతాల్లా కనిపిస్తారు. కొందరు నిస్కారణంగా హానిచేసేవారు లేకపోలేదు.

అలా అన్ని అందరిని పెనుభూతాల్లా ఊహించుకొని భయపడటం అర్ధరహితం. పేతురుగారు పెనుగాలికి భయపడి మునిగిపోసాగారు. పెనుగాలి జనిమే, అల్లకల్లోల అలలు నిజమే. తాను కొంతదూరం నీటిపై నడవటం నిజమే. అయితే అంతలోనే అపనమ్మకం, అనుమానం, ఆదాము ఏవమ్మల ప్రభు అడుగుల చప్పుడు విని భయపడి దాక్కొన్నారు. ఆది. 3:8-18. సాదారణంగ తప్పుచేసినవారు భయపడుతుంటారు. అబ్రహాం ఈజిప్టుకు వెళ్లినపుడు అందమైన తన భార్య నిమిత్తం తనను చంపుతారని భయపడి చెల్లి అని అబద్దం చెప్పమంటాడు. ఆది. 12:10-13. బేతేలు దగ్గర యాకోబు రాత్రి బసచేసినపుడు ఏ భయంలేక నిద్రించాడు. కాని తరువాత “ఇక్కడ దేవుడుండుట నిజం. ఇది నాకు తెలియదు గదా” అనుకొనెను. అపుడు అతనికి భయం పుట్టింది. ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది. ఆది. 28:16-17. దైవ కుమారునికి సాకుడు తండ్రియైన యోసేపు భయపడినారు. మత్త. 2:22. మరియమాత కలత చెందింది. లూకా 1:29. దేవదూతను గాంచిన జకరియ భయపడ్డాడు. లూకా 1:12. హేరోదు రాజు భయపడినవాడు మత్త. 14:5. ప్రధార్చాకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడ్డారు. మత్త. 21:26,46. చివరకు యేసు కూడా తన సిలువ మరణంను తలంచుకొని భయపడినారు. “అపుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతుడాయెను”. మార్కు 14:33. ఈ విధంగా ఈ లోకంలో భయాందోళనలకు, కలతలకు, చీకు చింతలకు గురికాని మానవుడంటు ఎవరు లేదు.

ఈ ఉద్వేగాన్ని ఎలా అధిగమించాలి? భయం ఎన్నో అనర్ధాలకు మూలం. “ఎంతో వింత మానవుడు, తన నీడకు భయపడు భీమరుడు” అంటాడొక కవి. భయంతో రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు నిరాశ నిస్పృహలకు లోనౌతారు. ఏలియా ప్రవక్త భయపడి మరణమే మేలు అనుకొంటున్నాడు. ఇలా ఆలోచించి అనేకులు ఆత్మ హత్యలను చేసుకొంటున్నారు. ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం అనుకొనే ఈ రోజుల్లో ఇలా ఆత్మ హత్యలకు పాటుపడేవారి సంఖ్య విపరీతంగా పెరగటం విడ్డూరం! కేవలం భౌతిక శారీరకాభివృద్ధి మీదనే దృష్టి సారించటం, మానసిక వికాసాన్ని కల్గించె ' ఆధ్యాత్మికతపై శీత కన్నువేయటమే ముఖ్య కారణం. మనిషి భౌతికంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నా మానసికంగా, ఆధ్యాత్మికంగా పతనం అవుతున్నాడు. ఉదా: నేటి వద్యావవస్థను పరిశీలించాలి. విద్యార్థుల మేధో శక్తిని అధికం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని వారిని శారీరకంగా, బలపరచే ఆటపాటల మీద శ్రద్ధ, అవకాశం లేదు. మానసికంగా, ఆధ్యాత్మికంగా దృఢపరచే ప్రక్రియలకు చోటులేదు. వీరు ఎన్నో మార్కులు, ర్యాంకులు సాధిస్తున్నారు గాని, శారీరకంగా, మనసికంగా ఎంతో సున్నితంగ తయారవుతున్నారు. జీవిత సమస్యలకు ఎదుర్కొనే మనసైర్యం లేక సులభంగ ఆత్మ హత్యలు చేసికొంటున్నారు. జీవిత పోరాటంలో ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని, తల్లి దండ్రులు సమాజం పిల్లలకు నేర్పించాలి.

భయం కొందరిని నిర్వీర్యం చేస్తుంది. తమ శక్తి సామర్థ్యాలను మర్చిపోయేలా లేదా సమాధిచేసేలా చేస్తుంది. పేతురుగారు ఆ సరస్సులో ఎన్నో మారులు ధైర్యంగా చేపలవేట సాగించి ఉంటారు. ఎన్నో తుఫానులు ఎదుర్కొని ఉంటారు. ఆనాటి నమ్మకాల ప్రకారం భూతాల జడిపింపును చవిచూచి ఉంటారు. అయినా భయపడి నందువలన ఈత కొట్టగల తన సామర్థ్యాన్ని మరిచి మునిగిపోతున్నానని అరుస్తున్నాడు. ఏలియ ప్రవక్త అంతవరకు అన్ని విధాల తనకు తోడుగ ఉన్న దేవుడు తనను విడిచి పెట్టడని గ్రహించక, రాణి మాటలకు భయపడి తన శక్తినే మరచిపోతున్నాడు. తాను ప్రార్థించగ దేవుడు అగ్నిని కురిపించి దహనబలిని గావించారు. తన శక్తిని మరచి నిరాశ నిస్పృహలకు గురౌతున్నాడు. భయం మనిషిని ఆలోచించకుండ చేస్తుంది. అగ్ని, ఘోరగాలి, భూకంపం ప్రవక్త తన మదిలో అనుభవిస్తున్న భయానికి రూపాలు. ఆభయంలో ఆయనకు భగవంతుడు కనిపించటం లేదు, ఆయన కొంచెం నిమ్మళించినపుడు దైవశక్తిని కనుకొనగలిగాడు. విపత్కార పరిస్థితులు ఎదురైనపుడు ప్రధమ స్పందన భయాందోళనవలే, అందువలన దేవుని అభయ హస్తం, దైవ చిత్తం చూడటం కష్టమే. కాని కొంచెం తేరుకొని నెమ్మది సై తప్పక అభయ హస్తం చూడగలం. తాత్కాలికంగ వెనుకంజవేసిన ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను భగవంతుడు మనకిచ్చాడని మరువరాదు. ఆటంకాలకు, వ్యతిరేకతకు భయపడి ఎందరో తాము సమాజానికి చేయగల్గిన మంచిని చేయలేకపోతున్నారు. రోమ. 8:31-39.

కొంత ఆరోగ్యకరమైన భయం అవసరమే. అందువలన జాగ్రత్త పడతాం. పాపం చేయటానికి భయపడాలి. శిక్షకు భయపడాలి. దైవ భయం విజ్ఞానమునకు మూలం.

కొందరు ఇతరులు హాని తలపెడుతున్నారని ఊహించుకొని భయపడి ముందు గానే వారిపై ఎదురుదాడికి దిగుతారు. ఇది సరికాదు. వారు హాని చేయవచ్చు. చేయకపోవచ్చు, అంతేకాక ఇతరులు అపకారం చేసినా తిరిగి అపకారం చేయ రాదన్నది యేసు ఆజ్ఞ. హానిచేయుటకు పూర్వమే వారికి హాని చేయుట కిరాతకం. తనను చంపటానికి కుట్రలు జరుగుతున్నాయని వాస్తవం తెలిసినా ఆయన తాత్కాలికంగా బీతిల్లినను, ఎదురుదాడి మాత్రం చేయలేదు. పైగా యూదాను ఎంతో ప్రేమగా చూచారు. చివరకు ధైర్యంతో ఆ బాధలను ఎదుర్కొని జయించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN