నేటి పునీతులు: పునీత కైతాను

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

07 Aug 2026

పునీత కైతానుగారు ఇటలీదేశంలో విసెంజ పట్టణంలో క్రీ||శ|| 1480లో పుట్టారు. తండ్రి కస్పారు, తల్లి మేరిపోర్. రాజవంశం వీరిది. తండ్రి వెనెటియునుల తరఫున నేపుల్స్ రాజైన ఫెర్డినాండు క్రూరుని పై జరిగిన యుద్ధంలో మరణించాడు. అప్పటికి కైతానుగారి ప్రాయం కేవలం 2 సం||లు. తల్లి సంరక్షణలోనే భక్తి ప్రపత్తులలో పెరిగారు. బాల పునీతునిగా పిలువబడ్డారు. పాదువా పట్టణ విశ్వ విద్యాలయంలో చేరి ఉన్నత చదువులు చదివారు. పౌరశాస్త్రం, శ్రీసభ చట్టాలు విద్యలో డాక్టరేటు పట్టా పొందారు. క్రీ||శ| 1506లో వి సెజా రాజ్య ప్రతినిధులసభలో వారు సెనేటరుగా ఎన్నికై ప్రజా సేవచేశారు. పునీత కైతానుగారే గయెతానో లేక కజెతానోగారిగా కూడ పిలువబడ్డారు. ఆ రోజుల్లో మార్టిన్ లూథర్ ఇంగ్లాండులో పోపుగారికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశాడు. పునీత కైతాను లూథర్ ప్రశ్నలకు ఆచరణాత్మక జవాబుగా తన గురు సేవలందించారు. పోపుగారి పొరబడని అధికారంను సమర్థించారు.

అనంతరం 2వ జూలియసు పోపుగారి కోరికపై శ్రీసభ న్యాయస్థానంలో ఉన్నత పదవినలంకరించారు. పోపుగారి మరణానంతరం క్రీ.శ|| 1513లో తమ పదవికి రాజీనామా చేశారు. పిమ్మట రోము నగరంలోనే ఉన్న “దైవ ప్రేమసభ”లో గురుశిక్షణకై చేరారు. క్రీ||శ|| 1516లో గురువు అయ్యారు. విసెంజా పట్టణం చేరుకున్నారు. తమకు ఉన్న ధనము ఆస్థిపాస్తులన్నీ పేదలకు దానం చేశారు. పెద్ద పదవులు అన్నీ సున్నితంగా తిరస్కరించారు. తమ గ్రామంలోనే దీర్ఘ వ్యాధిగ్రస్తుల కోసం ఒక ప్రత్యేక ఆసుపత్రిని కట్టించి నిర్వహించారు. గతంలో వారు వెనిస్ మరియు రోమునగరంలో గొప్ప ఆథ్యాత్మిక, దాతృత్వ సంస్థల్లో నాయకుడుగా -పెద్ద పదవులు నిర్వహించిన అనుభవం వారికి ఇక్కడ తోడ్పడింది.

క్రీ||శ|| 1523లో క్లర్క్స్ రెగ్యులర్సభ అని ఒక గురువులసభను స్థాపించారు. ప్రజల్లో నివశిస్తూ సువార్త ప్రచారం చేయడం రోగపీడితులకు సేవ చేయడం ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ సభకు థియేట్ పీఠాధిపతి జాన్ కరఫాగారు మొదటి సుపీరియర్ గా పనిచేయటాన థియేటైనుల సభఅని పేరుపడింది. వీరే 4వ పోప్ పౌలుగా శ్రీసభను పాలించారు. థియేటైనులు పరిశుద్ధ విరక్తత్వ జీవితం పాటిస్తూ ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజసేవకూడ చేశారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, నీతి విద్యాబోధ, గురువులకు శిక్షణ వంటి పనులు నెరవేర్చారు. ఈ సభవారు ఎలాంటి ఆస్థిపాస్తులు కలిగి ఉండరాదు. దేవుని కృప పై ఆధారపడాలి. ప్రజలు అందించే గురుపోషణ సాయం పైనే ఆధారం. చాలకుంటే భిక్ష అడుక్కుతినాల్సిందే.

అయితే క్రీ||శ|| 1527లో రోమునగరంలో 5వ చార్లెస్ చక్రవర్తి కతోలికుల పై జరిపిన దాడిలో కైతానుగారు నిర్వహించే మఠగృహం నాశనం చేయబడింది. 12 మంది యువ సభ్యుల్ని చిత్రహింసలు పెట్టారు. పిమ్మట వారంతా వెనిస్ నగరానికి పారిపోయారు. శ్రీసభ వ్యతిరేక శాఖవారు చేసిన ఆగడాల దుష్పలితమిది. వెనిస్ నగరంలో పునీత జెరోము ఎమిలియాని గార్కి అక్కడ 'క్లర్క్స్ రెగ్యులర్ సభ ఏర్పాటు చేయడంలో తోడ్పాటునందించారు. ఈ విధంగా థియేటైనుసభ దినదిన ప్రవర్ధమానమై శ్రీసభవ్యాప్తికి సంస్కరణల అమలుకు ప్రాధాన్యతనిచ్చింది. కైతానుగారు చేపట్టిన ఆథ్యాత్మిక సామాజిక సేవలు శ్రీసభ ట్రెంటు మహాసభవారు శ్రీసభ సంస్కరణలుగా చేపట్టడం విశేషం. వీరు నేపుల్స్ నగరంలో క్రీ||శ|| 1547 ఆగష్టు 7న కన్నుమూశారు. క్రీ||శ|| 1671లో 10వ క్లెమెంటు జగద్గురువులు వీరి పేరును పునీతుల పట్టికలో నమోదు చేసి గౌరవించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN