స్నేహ బంధం!( కథ)

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
02 Aug 2026
స్నేహ బంధం!( కథ)
----//---/--////---
ఆ ఊరు మరియా పురం.ఓ మారుమూల ప్రాంతం.ఒక పెద్ద కొండకు దిగువున వున్న కుగ్రామం.ఏడాదికోమారు ఊరి తిరు నాళ్ళకు మాత్రం కొండ పై వుండే మేరీ మాత ఆలయం భక్తులతో కిటకటలాడుతుంది.ఆ ఊరికున్నది ఒకే ఒక్క పల్లె బస్సు. ఆ బస్సు ప్రయాణ సమయంలో కొండల నడుమ, సెలయేరులను దాటుకుంటూ,చల్లటి గాలిని స్పృశిస్తూ ప్రయాణీకులకు వీనులవిందు చేస్తుంది.అది పల్లె బస్సు కావడంతో చిన్న చిన్న ఊళ్ళను దాటుకుంటూ ముందుకు కదులుతుంటుంది.
అంతేగాక అటవీ మార్గాన నిలువెత్తుగా నిలచిన పచ్చటి చెట్లు,ఆ చెట్లపై పక్షుల కిలకిలరావాలు,పచ్చగా అల్లుకున్న పైర్లు,సెలయేటి నడకలు నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి.ఆహ్లాదకర వాతావరణానికి పల్లెలే చిరునామా అంటే సమ్మతించని వారుంటారా?
అయితే అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణానికి , కొండలపై వెలసిన కోవెలలకు నిలయమైన మరియా పురం లాంటి పల్లెటూళ్లను వదిలి చాలా మంది కృత్రిమ అందాలకు ,వసతులకు నిలయమైన పట్న వాసాలకు అలవాటుపడ్డారు. ఉద్యోగాల కోస మో, వ్యాపారాల కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో అలా వెళ్లిన వాళ్లలో కొంతమంది , తమ బాధ్యతలు నెరవేర్చుకొని విశ్రాంత జీవనులై పోయి,తమ పిల్లలు సంపాదనా మార్గాలను వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోగా, ప్రశాంత జీవనాసక్తితో తిరిగి పల్లెటూళ్లలో తమకున్న పాత ఇళ్లకు చేరుకుంటున్నారు.అలా ఎప్పుడో వ్యాపార నిమిత్తం పట్నం వెళ్లి, అక్కడే స్థిరపడి పోయి ,ఆర్ధిక స్థాయి పెరగడంతో తన చిన్న నాటి స్నేహితులనందరిని దూరం పెట్టిన మరయ్య, ఇప్ప్పుడు ఈ పల్లె బస్సులో భార్యతో సహా తమ ఊరు మరియా పురానికి తిరిగివస్తున్నాడు. ఉన్న పిల్లలిద్దరూ అమెరికా లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండిపోవడంతో,మరయ్య దంపతులు పట్నంలో ఒక అపార్టుమెంటు లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కొంతమందికి ఇటీవలే ఒక క్రొత్త రకమైన అంటు వ్యాధి సోకి కొందరు మరణించడంతో వీళ్ళు బిక్క చచ్చిపోయి బితుకు బితుకుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.ఇక్కడ తమకేమైనా అయితే ఎక్కడో పరాయిదేశంలో ఉన్న తమ పిల్లలు చూడ్డానికి కూడా రాలేని పాడు కాల మొచ్చిందని వాళ్ళు లోలోపల కుమిలిపోతూ ఉంటే ఒక రోజు మరయ్యకి, మరియా పురం లో ఉంటున్న తన చిన్న నాటి స్నేహితుడు రాయన్న దగ్గరనుండి ఫోన్ వచ్చింది."మరయ్యా! ఈ రోజు స్నేహితుల దినోత్సవమని పేపర్లలో,టీవీ ల్లో చెబుతుంటే నా ఫ్రెండువైన నిన్ను ఫోనులో నన్నా పలకరిద్దామనిపించింది. చిన్నప్పుడు నిన్ను అరే మరయ్యా,,ఒరే 'మర్రిగా' అని పిల్చినా ఇప్పుడు నిన్ను ఎందుకో అలా పిలవ లేక పోతున్నాను. మనం పెద్ద వాళ్ళమయి పోవడం ఒక కారణమైతే, మన మధ్య ఉన్న అంతస్తుల భేదం చేసిన దూరం కూడా ఒక కారణం కావొచ్చు. కానీ ఈ మధ్య ఎందుకో మన ఊళ్ళో ఇద్దరం కలిసి తిరిగిన రోజులు,ఇద్దరం కొండ మీద ఉన్న మరియ తల్లి గుడి కి వెళ్లి జపమాల చెప్పుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి.నిన్ను చూడాలని అనిపిస్తున్నది.కొన్ని రోజులు నీతో గడిపి ఆ నాటి స్నేహపు హాయిని మళ్ళీ పొందాలనిపిస్తున్నది. నేనేమో ఈ ఊరు వదిలి రాలేను. అయినా నువ్వు మాత్రం ఆ పట్నంలో ఏమి ఉంటావు? మీరుండే అపార్టుమెంటు లో కొందరికి ఏదో అంటు రోగం వచ్చిందని ఈ రోజు పేపర్లో చూశాను. ఆ రోగభయం తగ్గిందాకా ఇక్కడకు వచ్చి మా ఇంట్లో ఉండొచ్చుగా! వెంటనే వచ్చేయండి.మనం కొన్నాళ్ళు కలిసి గడపొచ్చు ఏమంటావ్?" అని బాల్య స్నేహితుడు ఆప్యాయంగా పిలుస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్లై మరయ్యకి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదే కదా స్నేహ బంధం అంటే ,ఆపదలో మేమున్నామంటూ అండగా నిలిచే వాళ్లే కదా నిజమైన స్నేహితులు, అనుకుంటూ వెంటనే భార్యని తీసుకొని మరియా పురం బస్ ఎక్కేసాడు. పచ్చని చెట్టూ చేమల దారిలో సాగిన పల్లె బస్సు గమ్యం చేరుతుండగా కొండపై కొలువున్న మేరీ మాత కోవెల కన్నుల పండుగలా దర్శనమిస్తుంటే కన్నులు మూసుకొని క్రీస్తు ప్రభుని కన్న తల్లికి చేతులెత్తి దండం పెడుతూ,స్నేహితుడితో కలిసి, కన్న తల్లిలాంటి ఊళ్ళో ఉంటూ,అక్కడ ఉన్న తమ పాత ఇంటిని పునర్నిర్మించుకొని, అమ్మ ఒడిలాంటి జన్మ స్థలమైన మరియా పురం లో శేష జీవితాన్ని హాయిగా గడపాలని దృఢంగా నిశ్చయించుకుని బస్సు దిగాడు మరయ్య..
అందుకే కవులు అంటారు మరి,
"లోక మందు స్వార్ధ గుణము లేని దొక్క స్నేహమే
చీకు చింత లన్ని ఎగుర గొట్టు మైత్రి బంధమే
శోక మంత మాయమగును మిత్రులున్న చెంతనే
సోకు మీర సౌఖ్య మిచ్చు సఖియ సఖుల సన్నిధే! " అని.
(సమాప్తం)
