సమృద్ధికి చిరునామా కరుణామయుడు

Fr. Sesetti Mariadas M.S.F.S.

01 Aug 2026

సామాన్య ఆదివారము - 18
యెషయ 55:1-3;
రోమీ 8:35,37-38;
మత్త. 14:13-21.
1. యెషయా 55:1-3:
యెషయా గ్రంధం చాలా నిడివి గలది. పండితులు దీనిని మూడు భాగాలుగా విభజించారు. రెండవ భాగాన్ని (40-55 అధ్యాయాలు) రెండవ యెషయా అన్నారు. రెండున యెషయా గ్రంథాన్ని ప్రథమ యెషయా శిష్య గణంలోని సభ్యుడు క్రీ.పూ. 550లో వ్రాసాడు. రెండవ యెషయా ప్రవచన సమయానికి ఇశ్రాయేలు జనం బాబిలోనియా ప్రవాసంలోనికి కొనిపోబడ్డారు. 43:14,48:20) యెరూషలేము శిథిలమైంది. పునర్నిర్మాణం జరగాల్సివుంది. ప్రవాస తుది రోజుల్లో నున్న యూదులు దుఃఖ సాగరంలో మునిగివున్నారు. నిరాశలో దిక్కుతోచక, దుస్థితిలోనున్నారు. యావేను విడిచిపెట్టాలను శోధనలో నున్నారు. వారిని యెషయా చైతన్య శీలి, ఆశావధి, కనికర వ్యక్తి, గొప్ప విశ్వాసి. సుమారు 50 సంవత్సరాలుగా ప్రవాస జీవితానికి అలవాటు పడిపోయి, అందులోనే సుఖాన్ని పొందుతున్న యూదులకు సుధీర్చ ఎడారి ప్రయాణం చేసి పునర్నిర్మాణం గావింపబడుతున్న నగరానికి మరలి రావడం నచ్చడంలేదు. రెండవ యెషయా తన ప్రవచనాల ద్వారా ఈ జనానికి నచ్చచెపుతున్నాడు. వారు యెరూషలేంకు తిరిగి రావాలి 55వ అధ్యాయం. రెండవ యెషయా గ్రంధానికి తుది వాక్యాలు. ఈ తుది వాక్యాలలో మొత్తం భాగంలో (40-54 అధ్యాయాలలో ప్రస్తావించబడిన నూతన నిర్గమము (40:1-11, 55:12-13) మార్గము (40:3,27; 55:7-9) విందుకు ఆహ్వానం (40:11చ 55:1-2) ప్రభుని వాక్యము (40:8; 55:11) మున్నగు ప్రముఖ ధ్యానాంశాలు పునఃప్రస్తావించబడ్డాయి. నేటి పఠన భాగంలో రెండవ యెషయా అభాగ్య జనాన్ని ఆనంద విందుకు ఆహ్వానిస్తున్నాడు. బైబిల్ లో విందు దృష్టాంతం ఇశ్రయేలు ప్రజలను దేవుడు యావే ఆదరించు వైనాన్ని తెలియచేస్తుంది. నూతన యుగపు సమృద్ధిని సూచిస్తుంది. అందుకు ప్రవక్త రమ్మని ఆహ్వానిస్తున్నాడు. సంతృప్తినిచ్చే శ్రేష్టమగు భోజనంనకు యెరూషలేంకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. యెరూషలేంనందు తినడానికి మంచి భోజనం, త్రాగడానికి చల్లని నీరు ఉచితంగా లభిస్తాయి. అనగా దేవుడే జీవోద్దారను చేయు శక్తి. యెరూషలేం మరలి రావడమనగా యావేతో నూత్నీకరింప బడిన బంధంలోనికి రావడం, నిబంధన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవడం తద్వారా యావేకు పునరంకితం కావడం. దీనిలోనే యూదా ప్రజలు జీవాన్ని పొందుతారు. ఈ పఠన భాగం ప్రకటిస్తున్న వేద సత్యం - యావే ఆదుకొంటాడు. జీవింపచేస్తాడు. కాని జనం యెరూషలేంకు తిరిగి రావాలి. ఆయనకు పునరంకితం కావాలి.

2. రోమీ 8:35, 37-39 :
రోము నగర విశ్వాస సంఘాన్ని దర్శింప తలంచి పౌలు, తన రాకకు సంఘాన్ని సిద్ధపరచడానికి, తన విశ్వాసాన్ని సంస్థలతో పంచుకొంటూ ఈ లేఖను వ్రాసాడు. ఈ లేఖలో ప్రధమ భాగంలో తన విశ్వాస సిద్ధాంతాన్ని వివరించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మన ప్రభుయేసు క్రీస్తు దేవుని సువార్త. సువార్త దేవుని నీతిని తెలియ చేస్తుంది. మానవులందరి రక్షణకు శక్తివంతమగు ఆధారం దేవుని సువార్త. అన్యులు, యూదులు అందరూ దేవుని కోపాగ్నిని పొందవలసియున్నను, దేవుడు తన నీతిని క్రీస్తు ద్వారా ఎరుకపరచి, ఆయనను అంగీకరించినవారి విశ్వాసం మూలంన వారిని నీతిమంతులను చేసి రక్షించాడు. (4:1-25). విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారికి దేవుని ప్రేమ రక్షణ అభయాన్నిస్తుంది. (5:1-8:39). నీతిమంతునిగా చేయుబడిన విశ్వాసి రక్షింపబడతాడు. క్రీస్తుతో నూతన జీవాన్ని అనుభవిస్తాడు. విశ్వాసి పొందిన ఈ విడుదల మూడు విధాల జరుగుతుంది. (5:12-7:25) పాప మరణముల నుండి విడుదల (5:12-21), అహం నుండి విడుదల (6:1-13), చట్టం నుండి విడుదల (7:1-25), విశ్వాసి తన క్రైస్తవ జీవితాన్ని ఆత్మద్వారా జీవించి, సిద్ధపరచి ఉంచబడిన వైభవమును పొందుతాడు. (8:1-39). ఆత్మద్వారా క్రైస్తవ జీవితం బలపరచబడుతుంది 8:1-13), ఆత్మద్వారా క్రైస్తవుడు దేవుని బిడ్డగా తయారవుచున్నాడు, వైభవాన్ని పొందనున్నాడు. (8:14-30). దీని తరువాత భాగంనేటి ఆదివారానికి కేటాయించబడిన ధ్యాన భాగం.

ఈ భాగంలో (8:31-39) క్రీస్తుని ప్రదర్శింపబడిన దేవుని ప్రేమను పౌలు కీర్తించాడు. (8:31-39). ఇది పౌలు వ్యక్తపరచిన విశ్వాస సిద్ధాంతం యొక్క ముగింపు భాగం. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు రక్షణ అందచేయడానికి ఏర్పాట్లలో నున్నాడు. ఇది ఆయన ప్రేమవలన జరుగుతుంది. క్రీస్తుకూడా మనలను ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనంగా తన తండ్రి కుడిప్రక్కన మనకోసం మొరపెట్టుచున్నాడు. అందవులన మనం భీతి చెందనవసరం లేదు. మన రక్షణకు ఎన్ని ఆటంకాలు వచ్చినా పరవాలేదు, దేవుడు వాటిని ముందుగానే అధిగమించాడు. ఆయన ప్రేమలో ఏర్పాటు చేయబడిన మన రక్షణను ఏ శక్తియు, ఏ పరిస్థితియు నాశనం చేయలేదు.

మత్తయి 14:13-21లో సువార్తీకుడు తను ఉద్దేశించిన శిష్య సంఘ విశ్వాసాన్ని పటిష్టపరచడానికి యేసుని మన మధ్యనున్న దేవుని కుమారునిగా ప్రకటించి, శిష్య సంఘం ఆయనను ఆలకించి, అనుసరించి, దైవరాజ్యంలోనికి, దేవుని పాలన క్రిందకు వచ్చి, సర్వులను క్రీస్తు శిష్యులనుగా చేయు బాధ్యతను స్వీకరించుచున్నారని గుర్తుకు తెస్తున్నాడు. మత్తయి సువార్తలో యేసు పాత నిబంధనలో చట్టాన్ని యిచ్చిన మోషేవలె, నూతన చట్టాన్నిచ్చాడు. దేవుని రాజ్యాన్ని గూర్చి ఉపమానాల ద్వారా శిష్యులకు బోధించాడు. (13వ అధ్యా., ఇక తరువాత భాగంలో (13:53-17:27) యేసుని పరిచయం చేస్తూ, శిష్యులకు ఆయనను గూర్చి క్రమేణా, నెమ్మదిగా తెలియజేయు చున్నాడు. యేసు వడ్రంగి కుమారుడు. (13:55), దేవుని ప్రజను ఎడారిలో పోషించు వాడు (14:13-21, 15:32-39, 16:8-10). ఆయన, నీటిపై నడచు ప్రభువు (14:27), రక్షించు దేవుని కుమారుడు (14:33), దావీదు కుమారుడు (15:22) సజీవ దేవుని కుమారడగు మెస్సయా (16:18), శ్రమలలోనున్న వారితో శ్రమలను పొందు (16:21), మనుష్య కుమారుడు (16:27). ఆయనను ఆలకించు వారిని, తను జీవించినట్లు జీవించువారిని స్వీకరిస్తాడు (16:27). ఆయన దేవుని ప్రియ కుమారుడు, ఆయన యందు దేవుడు మిక్కిలి ఆనందించుచున్నాడు. శిష్యులు ఆయనను ఆలకించాలి (17:5). ఈ భాగంలో శిష్యులు దైవరాజ్య రహస్యాలకు, దేవునికి పరిచయం చేయబడతారు. ఈ భాగంలో క్రీస్తు తన శిష్య సంఘానికి పునాదులు వేస్తున్నాడు. వారిని శిష్య సమాజంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ భాగం క్రీస్తుని స్వంత గ్రామాలలో స్వయాన తూలనాడబడడంతో మొదలవుతుంది. (13:53-58). అనగా శిష్య సమాజంకు అదే గతి పట్టనుందని చెప్పకనే చెపుతున్నాడు సువార్తీకుడు. నజరేతూరిలో నిరాదరణ పఠనంలో యేసు తనను తాను ప్రవక్తగా చెప్పుకొన్నాడు. యూదా జాతి ప్రవక్తలను మత్తు పెట్టె జాతి. బాప్తిస్మ యోహానునికి అదే గతి పట్టింది. (14:1-12) యేసుకు కూడా అదే గతి వేచియుంది.

నేటి సువార్త భాగం (14:13-21)లో మత్తయి యేసుని మెస్సయా యుగపు ప్రవక్తగా చిత్రీకరిస్తున్నాడు. గొప్ప జన సమూహంను ఎడారి ప్రాంతంలో అద్భుత విధంగా పోషించడం, పూర్వం యావే తన ప్రజను మన్నాతో పోషించిన విధానాన్ని గర్తుకు తెస్తుంది. (వలస 16, సంఖ్యా 11). తన ప్రజల ఆకలిని మెస్సయా అగు యేసుని, ఆయన శిష్యగణ పరిచర్య ద్వారా దేవుడే స్వయాన తీరుస్తాడు. యేసు మెస్సయా కాలపు, అంత్య కాలపు ప్రవక్త. ఎలీజా సారెఫతు గ్రామ విధవరాలికి భోజనాన్నిచ్చినట్లు (1 రాజులు 17:8-16), ఎలీషా రొట్టెలను (2 రాజులు 4:42-44) ఐదు రొట్టెల రెండు చేపలు దృష్టాంతం స్మరింప చేస్తుంది. ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసిన మెస్సయా యుగపు విందు యేసు, ఆయన శిష్యుల పరిచర్యలో నెరవేరుతుందని మత్తయి చూపిస్తున్నాడు. (చూడు: యెష. 55:2-3), దేవుడు అందరి ఆకలిని తీర్చాలను ఆశతో నున్నాడు. యేసుని, ఆయన శిష్యుల పరిచర్యలో నెరవేరు తుంది.

ఈ ఐదు రొట్టెల రెండు చేపల కథనంలో, ప్రస్తావించబడిన “సాయం సమయం” రొట్టె విరచుట, రొట్టె తీసుకొని, ఆశీర్వదించి, తృంచి, పంచుట మున్నగు క్రియా పదాలు సత్రసాధ భావాలను స్ఫురింప చేస్తున్నాయని గ్రహించగలము. అంతే కాదు, ఈ కధనంలో చాలా ధ్యానాంశాలున్నాయి. ఆకలితో అలమటిస్తున్నవారిపట్ల మనం కరుణను కలిగివుండాలి. (14:16). అవసరంలో నున్నవారి భౌతిక అవసరాలను గుర్తించు సున్నిత మనస్తత్వాన్ని కలిగి, మన ఆహార వనరుల్ని వారితో పంచుకోవాలి. (14, 16, 18-19). దివ్య సత్రసాధానికి పంచుకొనే గుణానికి మధ్య వీడని బంధముంది (19). మన భౌతిక ఆధ్యాత్మిక ఆకలిని తీర్చువాడు యేసే. ఆయనే ఆత్మీయ భోజనం.

'కోటి విద్యలు కూటి కొరకే' అని ఆర్యోక్తి. మానవుని మొట్టమొదటి ముఖ్యావసరం ఆహారం. దీనివలన మనిషి ఆకలితీరి సంతోషం, తృప్తి, శక్తికలుగుతాయి. జీవితం నిలబడుతుంది. ఇది దేవుని ఏర్పాటు. అలాగే ఆహారం కూడ దేవుని వరమే. మానవులకు, సమస్త జీవరాసులకు కావాల్సిన ఆహారంను సృష్టించినవాడు ఆయనే. “గింజల నిచ్చు మొక్కలన్నియు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నియు మీకు ఆహారం అగునుగాక. క్రూరమృగాలకు, ఆకాశ పక్షులకు నేలమీద ప్రాకుజంతువులకు పచ్చని మొక్కలు ఆహారం అగునుగాక”. ఆది 1:29-30. “దేవా! నీవు నీ గుప్పిలి విప్పగ సమస్త జీవరాశులు సంతృప్తి చెందును. కీర్తన. 104:27-28. ఆహారం శ్రమించి సంపాదించుకోవాలి. ఎవడును పరాన్న భుక్తులు కారాదు. “పనిచేయనివాడు భోజనమునకు అనర్హుడు. మీలో కొందరు సోమరులుగ ఉన్నారనియు... క్రమబద్ధమైన జీవితమును గడుపవలయుననియు, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలయునని యేసు క్రీస్తు నామమున అట్టివారిని మేము శాసించి హెచ్చరించుచున్నాము.” 2 తెస్స. 3:10-12. పనిచేయరా తిమ్మా అంటె కడుపునొప్పి అమ్మా అన్నాడట. కూడు పెడత రారా అంటే మరోక ముద్ద వేయమ్మా అన్నాడట సోమరితిమ్మ. యేసు తన దైవశక్తిని వినియోగించి సులభంగ శ్రమించకుండ రాళ్లను రొట్టెలుగా చేసికొని తినటానికి నిరాకరించారు. మాయ మంత్రాలలో మోసంతో ఆహారం సంపాదించ కూడదు.

ఆహారం జీవితంలో ముఖ్యమైనదేగాని అదే జీవితం కాదు. కారాదు. మనిషి బ్రతకటానికి తినాలిగాని, తినటానికి బ్రతుకరాదు. కొందరి జీవితంలో ఆహాంమే ప్రాధాన్యత. కొందరు భుక్తి లేక భక్తి లేదంటారు. భగవంతుడు ఇవ్వనిదే ఏ భుక్తి రాదు. భగవంతుని ఆరాధన సైతం విడిచి భుక్తికోసం ఆరాటపడుతుంటాడు. అన్ని సంతృప్తిగా, సమృద్ధిగా ఉన్నను దేవుని నమ్మకంగ విధేయతగ ఉండలేకపోయారు. ఎడారిలో ఎంతమన్నా కురిపించినా, మొఖం మొత్తినదాక తిన్నను వారు దేవునికి విశ్వాస పాత్రులుగా లేకపోయారు. భుక్తి ఉంటే భక్తి ఉంటుందనేది సరికాదు.

ఈ శారీరక ఆహారాన్ని పొందాలన్నా, పొందినదానివలన సరైన ఫలితం పొందాలన్నా మరోక ఆహారం భుజించాలని అంటున్నారు యెషయ ప్రవక్త మొదటి పఠనంలో “నా మాటలు శ్రద్ధతో ఆలకించిన యెడల మీరు మంచి ఆహారంను భుజించి ఆనందించగలరు” దేవుని వాక్కు అనే అన్నపానీయాలను స్వీకరించిన యెడల అన్ని చక్కగా ఉంటాయి అంటున్నారు. భగవంతుడు ప్రత్యక్షంగను, పరోక్షంగను మాట్లాడుతుంటారు. ఆహారం ఎంతగ ఉన్నను కొంత మాత్రమే తినగలం. తిన్నదానిలో కొంత మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. కొంత శరీరంలో నిల్వ ఉంటుంది. కొంత వ్యరంగ పోతుంది. అతిగా తింటే నిల్వ ఎక్కువై శరీరానికి హాని చేస్తుంది. సరైన శ్రమ, వ్యాయామం లేకుంటే ఆహారం అపకారం చేస్తుంది. ఈ విధంగ శరీరాన్ని నిర్మించి పరోక్షంగ తన'మాట' చిత్తం ఏమిటో చెప్పకనే చెప్పారు. కనుక మానవుడు కేవలం రొటెవలన మాత్రమే జీవింపడుగాని దేవుని మాట వలన జీవించును. ద్వితీ.8:3. ఆహారం సరిపోయినంత కావాలన్నా, దొరికిన ఆహారం చక్కగ ఆస్వాదించాలన్నా దేవుని మాట ప్రకారం జీవించాలి. 'ఇతరుల కడుపు కొట్టకూడదు' అంటారు. “పేదలను పీడించి వారి ధాన్యమును దోచుకొంటిరి” ఆమోసు 5:11. ఆహారం ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన హక్కు. దీనిని ఎవరు కాలరాయకూడదు. ఎవరును ఆకలితో ఆలమటించే పరిస్థితికి తీసికొని రాకూడదు. ఉన్న ఆహారాన్ని ఇతరులతో పంచుకోవాలి. “నేను యిష్టపడు ఉపవాసమిది.... మీ భోజనం ఆకలిగొనినపుడు నాకు ఆహారం ఇచ్చితిరి. దప్పిక గొనినపుడు దాహం తీర్చితిరి.” ఇతరుల ఆకలి దప్పులు తీర్చినవారే నీతిమంతులు. స్వరరాజ్యమునకు అర్హులు. తీర్చనివారు దుర్మార్గులు. నరకానికి పాత్రులు. మత్త 24,42. “రెండు అంగీలున్నవాడు ఏమిలేని వానికి ఒకటి ఈయవలయును. భోజన పదార్ధములున్నవాడును అట్లే చేయవలయును.” లూకా 3:11.

ధనవంతుని పాపం లాజరుకు అన్యాయం చేయుటకాదు, పీడించుట కాదు మరేది కాదు. సమృద్ధిగా ఉండియు తాను మాత్రమే అనుభవిస్తు ఆకలితో అలమటి స్తున్న ఆ నిరుపేదలాజరును ఇంత అన్నం పెట్టి ఆదరించకపోవుటయే. లూకా 16:19-31. విందులు కేవలం బంధుమిత్రులకే కాదు, అభాగ్యులకును అన్న దానం చేయాలి. లూకా 14:12-14. ప్రభువు మనస్సు ఎరిగిన ఆదిమ సంఘం అన్నీ అమ్మి ఉమ్మడి జీవితం జీవించారు. అ.చ. 4:32-36.

ఆహారం కేవలం ఆకలి తీర్చుకొనుటకే కాదు. శక్తిని పొందుటకే కాదు, మానవ జీవితంలో అది మరోక ముఖ్య పాత్ర పోషిస్తున్నది. ఇది ఎలా ఆరంభం అయిందో తెలియదుగాని అన్ని సంస్కృతులలోను అంతర్భాగం అయింది. అదే విందు భోజనం. కలభోజనం. ఇది సఖ్యతకు, స్నేహానికి, బంధుత్వానికి, విశ్వనీయతకు, ఒప్పందాలకు ముద్రగ ముగింపుగా తయారైంది. కలభోజనాలు మంచి సంబంధ బాంధవ్యాలకు గుర్తుగా ఉంటున్నాయి. ఒప్పందాలు ఏర్పరచుకొన్న తర్వాత విందుభోజనంతో దానిని స్థిరపరచుకొంటున్నారు. వివాహ బంధాలు కుదుర్చుకొన్న తర్వాత కలభోజనాలతో బంధం సుస్థిరం చేసికొంటున్నారు. ఏదైన కార్యానికి వెళ్లి భోజనం చేయకుంటే వారితో మనస్పర్ధలు ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఈ విధంగ విందు భోజనం సఖ్యతకు సంతోషానికి ప్రతీక ఉంది. అందువలననె మెస్సయా కాలాన్ని, దైవ రాజ్యాన్ని విందుతో పోల్చారు. ఈజిప్టు నుండి బయలుదేరేముందు విందు ఆరగించారు. నిర్గ 12. సినాయి ఒప్పందం విందుతో ముగుస్తున్నది. నిర్గమ 25: 5, 11. విందు అంటే అని పుషులంగ ఉంటాయి. అలాగే అంత్య కాలంలో అన్ని సమృద్దిగ లభిస్తాయని అరం. యెష. 25:6; 65:11-15, కీర్త. 22:5, ప.గీ. 5:1, మత్త. 9:15, ప్రక. 19:9, లూకా 22:16-18, మత్త. 5:6, లూకా 22:29.

వీనిని బట్టి రెండు విషయాలు గ్రహింపవచ్చు. కృపాకాలమున ఇహలోక ఆహారానికి ఏ కొరత ఉండదని యేసు నిరూపిస్తున్నారు. ఐదువేల మందికి సమృద్ధిగ, తృప్తిగ భోజనం పెట్టారు. అయిన.ఎంతో మిగిలింది. ఆత్మీయ ఆహారం కూడ పుష్కలంగ లభిస్తుందని ఆయన ఋజువు చేసారు. వారికి వాక్యం, భోజనం రెండూ పుష్కలంగా లభించాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN