నేటి పునీతులు:పునీత అల్ఫోన్స్ మరియ లిగోరి

డా. కె. రాజారెడ్డి
01 Aug 2026
దైవ పిలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లభిస్తుంది. పిలుపు పొందిన విధములో బేధాలుంటాయి. కాని ఆ పెలుపులో మరియతల్లి సున్నితమైన, నిర్ణయాత్మకమైన ప్రమేయం గుప్తమై ఉంటుంది. కొందరు పునీతులు మరియమాతపై అధికమైన ప్రేమను, అనుబంధమును కలిగి వుంటారు. అలాంటి "మరియ పునీతులలో" అల్ఫోన్స్ మరియ లిగోరిగారు ఒకరు. ఆగష్టు 1న వారి ఉత్సవమును కొనియాడు సందర్భంగా వారిని గూర్చి మరియమాతను గురించి వారి ఆలోచనలను ధ్యానించుదాం.
క్రీ.శ. 1696లో ఇటలీ దేశంలో నేపుల్స్ నగరమునకు సమీపములోగల "మరియనెల్ల" అను గ్రామములో ఒక ఉన్నత కుటుంబములో జన్మించిన అల్ఫోన్స్ మరియ లిగోరి తన 16వ సంవత్సరము నాటికే న్యాయశాస్త్రములో పట్టభద్రుడై న్యాయవాద వృత్తిని చేపట్టారు.కాని ఒక న్యాయమైన వ్యాజ్యంలో అపజయం పాలయ్యాడు. మానవ ప్రయత్నం కంటే ఎక్కువగా మంచిని చేయగల "దేవుని శక్తి" గొప్పదని గ్రహించాడు.దేవుని సేవే ఉత్తమమని తలంచి న్యాయవాద వృత్తిని మానుకున్నాడు.
తండ్రి అంగీకారముతో గురుశిక్షణ పూర్తి గావించాడు. 1726 డిసెంబర్ 21న గురుపట్టాభిషేకం పొందారు. దైవ ప్రజలకు కాపరిగా, పేద సాదలను చేరదీసి విశ్వాసమును పటిష్టపరచారు. దైవంచే ప్రేరేపించబడి రక్షక సభను ప్రారంభించారు.తమ సభ గురువుల ద్వారా సువార్తను నలుమూలలా చాటారు.
1762లో పీఠాధిపతిగా అభిషేకం పొందారు. మఠాలను,గురు శిక్షణాలయాలను సంస్కరిం చారు. నిష్టతో సువార్త ప్రచారం చేశారు. 1787లో 90 ఏండ్ల ప్రాయంలో నిత్యనివాసం చేరుకొన్నారు.1839లో 16వ గ్రెగోరి పాపుగారు పునీత పట్టం కట్టారు. అల్ఫోన్స్ అనగా వెలుగు అని అర్థం.
మరియమాతను గూర్చి లిగోరిగారి కొన్ని ఆలోచనలతో పంచుకుందాము.
మరియ మన జీవము : అల్ఫోన్స్ లిగోరి మరియమాత మన జీవమని చెప్పడానికి రెండు కారణాలను పేర్కొన్నారు. మరియతల్లి మన పాపములకు క్షమాపణను తన కుమారుని నుండి పొందేలా చేస్తారు.మనలను స్థిరమైన భక్తి మార్గంలో నడిపించి శాశ్విత జీవమును పొందునట్లు చేస్తారు.
మన ఆత్మ మన శరీరానికి ప్రాణాన్నిస్తుంది. అలాగే "దైవకృప" మన ఆత్మకు జీవాన్నిస్తుంది.దైవకృపలేని ఆత్మ జీవిస్తున్నప్పటికీ, వాస్తవంగా మరణించినట్లే. భౌతికముగా జీవిస్తున్నను ఆత్మీయంగా మరణించిన వారమే.మరియమాత తన మధ్యస్థ ప్రార్ధన ద్వారా మనకు పాపక్షమాపణను లభింపచేసి ఆత్మలకు జీవమును ప్రసాదించి ఆత్మీయంగా జీవించునట్లు సహాయపడతారు. చివరకు నిత్య జీవం పొందునట్లు సహకరిస్తారు.అందువలన శ్రీసభ మరియ మన జీవం అని చాటుచున్నది.
మరియ నోవా ఓడ : జల ప్రళయంలో నోవా ఓడలోని ప్రాణులన్ని క్షేమంగా రక్షింపబడ్డాయి.అలాగే మరియ అనే ఓడను ఆశ్రయించినవారు నిత్యనరకమనెడి వినాశనము నుండి తప్పక రక్షింపబడతారు. నోవా ఓడలోని కౄరమృగాలు కూడా రక్షింపబడ్డాయి.ఎంతటి పాపాత్ములైన మరియమాతను ఆశ్రయిస్తే ఆదరణ పొందు తారు. వారు తప్పక పశ్చాత్తాపము, పరివర్తనచెంది మంచి జీవితం జీవించి నిత్యనరకము నుండి రక్షింపబడతారు.
అల్ఫోన్స్ మరియ లిగోరిగారి జీవిత కేంద్రం యేసుప్రభువే. ఆ ప్రభువు ఆధారంగా మరియమాత పట్ల ప్రేమ,భక్తి, విశ్వాసములను ప్రదర్శించారు. దేవుడు మరియ ద్వార యేసును మనకు అనుగ్రహించారు.కనుక, మరియ ద్వారానే యేసును తప్పక చేరుకోగలమని లిగోరిగారి విశ్వాసము. దివ్యసత్ప్రసాదం పట్ల కూడా అమితమైన అనురక్తిగలవారు. పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుట శ్రీసభవిశ్వాస సత్యమే.కనుక ఆ తల్లిని గౌరవిస్తూ ప్రార్ధించుదాము.
