ఆగస్టు నెల ప్రార్ధనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
31 Jul 2026
ఆగస్టు నెలలో విశ్వ శ్రీసభ ప్రార్థించాల్సిన ప్రార్థనా ఉద్దేశాన్ని పోప్ లియో XIV ప్రకటించారు.నగరాల్లో క్రీస్తు సువార్త వెలుగు ప్రసరించబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన కోరారు. మారుతున్న నగర జీవితంలో అనేక మంది ఒంటరితనం, నిర్లక్ష్యం,ఆశలేమితో జీవిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటి నగరాల్లో క్రీస్తు ప్రేమను,సువార్త సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు శ్రీసభ నూతన మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజలను కలుసుకునే ప్రతి సందర్భాన్ని సువార్త ప్రకటించే అవకాశంగా మలుచుకోవాలని,ప్రేమతో కూడిన సేవ,ఆతిథ్యం, సోదరభావం ద్వారా ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిని అనుభవించే విశ్వాస సమాజాలను నిర్మించాలని పోప్ కోరారు.నగరాల్లో నివసించే ప్రతి మనిషికి ఆశను,ఆత్మీయ ఆదరణను అందించే సజీవ క్రైస్తవ సాక్షులుగా నిలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను ఈ నెల ప్రార్థన ఉద్దేశం ద్వారా ఆయన ఆహ్వానించారు.
