నేటి పునీతులు: పునీత పేతరు క్రిసోలోగు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

30 Jul 2026

పునీత పేతరు క్రిసోలోగుగారు ఇటలీలోని ఎమీల్య ప్రాంతంలోని ఇమోల పట్టణంలో క్రీ||శ|| 380లో జన్మించారు. ఇమోల పీఠాధిపతిగారే వీరిని చదివించి పెద్దచేసి డీకనుగా నియమించారు. క్రీ||శ|| 424లో వారి యొక్క తెలివితేటలు, అనర్గళంగా ప్రభువాక్యం శక్తివంతంగా బోధించే సమర్థతను బట్టి రావెన్నా పీఠంకు ఆర్చిబిషప్పుగా 3వ సిక్స్-తు పరిశుద్ద పోపుగారు అభిషేకించారు.

పేతురు క్రిసోలోగుగారు అనతికాలంలోనే అనంతరం వచ్చిన పోప్ లియో (సింహరాయులు) ఘనుడుగారితోను, 3వ వలెంటేనియన్ చక్రవర్తితోను సన్నిహితం పెంచుకొని వారి విశ్వాసాన్ని అపారంగా చూరగొన్నారు. పేతురుగారు శ్రీసభ విశ్వాసాన్ని బాగా వేళ్లూనజేశారు. తన మేత్రాసనంలో విగ్రహారాధన జరుగకుండ నిజమైన దేవుని తెలియజేసి ఆరాధింపబడేలా చర్యలు తీసుకున్నారు. మూఢనమ్మకాలు మూఢాచారాల్ని ఏదో తెలియని పూర్వరోజుల్లోలా గ్రుడ్డిగా నమ్మరాదని కల్పిత దేవుళ్లు రాళ్లు రప్పలు, పుట్టలు చెట్టులు, నక్షత్రాలు గ్రహాలు ఇలా పూజించి వ్యర్ధమని నచ్చజెప్పారు.

మాటకారి మంచి ప్రసంగీకుడని పేతురుగారికి పేరుండేది. క్రిసోలోగు అంటే 'బంగారు మాటలు పలికేవాడు' అని అర్థం. అదేమాట వారి పేరుకు ఇంటి పేరులా వాడబడుట విశేషం. వీరు గంభీర పదజాలం, మహావాక్యాలతో ప్రసంగాలు, వ్రాతలు ఉండరాదని చెప్పేవారు. అందుకే వారు మాత్రం సాధారణ మాటలు, కుదింపబడిన ప్రసంగాలే చెప్పేవారు, వ్రాసేవారు. శ్రోతలు విసుగుచెందడం వారికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఆశ్చర్యం, విచారం ప్రకటించే సందర్భాలో మాటలేకుండా కేవలం వారి ముఖకవళికలు, చేతుల కదలికలతోనే భావ వ్యక్తీకరణ చేసి వినేవారిని తమ ప్రసంగంలో లీనంచేసే సమర్థులు వీరు. అవిశ్వాసుల్ని ఒప్పించేలా వీరు ప్రసంగించేవారు.

వీరు వ్రాసిన 176 వేదోపన్యాసాలు ఇప్పుడు మనకు లభ్యమవుతున్నాయి. ఆ రోజుల్లో సాధ్యమైనంత మట్టుకు ప్రభు ప్రసాదం ఎక్కువసార్లు స్వీకరించమని వీరు కోరేవారు. పండుగ అంటే అల్లరిచేయడం విందువినోదాలు కాదని వారు ఒక ప్రఖ్యాత వాక్యంచెప్పారు "సైతానుతో వినోదం పంచుకునేవారు క్రీస్తుతో ఆనందించలేరు." అని అన్నారు. మరో సందర్భంలో పేతురుగారు "భక్తి అను వస్త్రాన్ని ఒంటికి ధరించు. పరిశుద్ధతను నడికట్టుగా పెట్టుకో. క్రీస్తును నీ శిరస్త్రాణంగా తల పై కప్పుకో. క్రీస్తు సిలవను నీ ముఖానికి రక్షణ కవచంగా ఉంచుకో. దివ్య జ్ఞాన సంస్కారాన్ని హృదయం పై అలంకరించుకో. నీ ప్రార్థనా పరిమళాలు సదా ఉన్నతస్థాయికి చేరనిచ్చుకో” అని చెప్పారు. ఇలా మరువలేని ఉదాత్తమాటలెన్నో వారు తెల్పారు.

ఆ రోజుల్లో యుతీషెస్ అను ఒక పండితుడు శ్రీసభ సిద్ధాంతాలకు పెడార్థాలు పలుకుతూ ప్రచారం చేయసాగాడు. కాన్స్టాంటి నోపుల్ లో జరిగిన క్రైస్తవ మతాధిపతుల మహాసభలో ఆ వక్రభాష్యకారుని క్రైస్తవ మతం నుండి వెలివేశారు. అట్టి పరిస్థితుల్లో పేతురు క్రిసోలోగుగారు అతన్ని పిలిపించుకొని సమైక్య క్రైస్తవ ఏకైక శ్రీసభ ఉండేందుకు వీలుగా రోము పీఠాధిపత్య సిద్ధాంతాన్ని నమ్మమని ఎంతో ఇదిగా ప్రాధేయపడ్డారు. పునీత ఆగ్స జెర్మానుగారు క్రీ||శ|| 448లో చనిపోగా వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారు ఇమోల పీఠంలోనే క్రీ||శ|| 450 డిసెంబరు 2వ తేదీన కన్నుమూశారు. క్రీ|| శ|| 1729లో 13వ బెనడిక్టు పోపుగారు వారిని గొప్ప శ్రీసభ వేదపండితునిగా గుర్తింపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN