పునీత బెతానియా మార్తమ్మ స్మరణ

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

29 Jul 2026

పునీత మార్తమ్మ అనునామె మరియమ్మ, లాజరులకు అక్క. బెతానియా గ్రామంలో నివశించే వారు. మార్తమ్మ గృహకార్యక్రమాలు క్రమం ప్రకారం నిర్వహించేది. ఈ ముగ్గురు ఉన్నతకుటుంబంవారు యూదయాలో ఏసుప్రభువుకు మిత్రులు. అందువల్ల ఏసు ఆ ప్రాంతంకు వచ్చినప్పుడల్లా వారి యింట బస చేస్తుండేవారు. మార్తమ్మకూడ ఎంతో శ్రద్ధ కలిగి ప్రభువు సంక్షేమం పట్టించుకునేది. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తమ శక్తిమేరకు వండివడ్డించి సంతృప్తి పడేది.

మనం సువార్తలో ఒక గొప్ప సంఘటనను లూకా 10:38-42 వరకు చదువుతాం. ప్రభువాక్యాన్ని వింటూ, మననం చేసుకుంటు ప్రభువు పాదాలవద్ద సేవచేసుకుంటున్న సమయంలో (యోహా. 11:1-2 ప్రకారం బెతానియా మరియమ్మ - మగ్దల మరియమ్మ ఒక్కరేగా చెప్పబడ్డారు. కాని కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం వారు వేరు వేరు వ్యక్తులు అనిచెప్పబడింది) మార్తమ్మ పెక్కు పనులలో సతమత మగుచు ఏసుప్రభువు వద్దకు వచ్చి "ప్రభూ ! నా సహోదరి పనులన్నియు నా పై వదలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా ? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు" అంది. అప్పుడు యేసు "మార్తమ్మా! మార్తమ్మా ! నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురత పడుచున్నావు. కాని అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది. అది ఆమె నుండి తీసివేయబడదు." అని సమాధానమిచ్చారు.

అనుదినం ఇంటి పనులతో సతమతమయ్యే వ్యక్తిగా మారమ్మను చూపించి, మరియమ్మను పాప పశ్చాత్తాపంతో క్షమాపణ పొంది ప్రభువాక్యాలు ధ్యానించి శాంతిపొందినట్లుగా సువార్తలో చదువుచున్నాం. ఈ ఇద్దరి జీవితాల్లో ప్రభువు మరియమ్మ జీవితంనే సమర్థించారు. వెలుతురున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్లు అవకాశం ఉన్నప్పుడే వెంటనే వాక్యంవినడం, ఆత్మశుద్ధి కార్యక్రమం చేపట్టాలని ప్రభుచిత్తం. భౌతిక ఆహారం- ఆత్మాహారం సమస్య వచ్చినప్పుడు మొదట ఆత్మ ఆహారంవైపు మొగ్గారు ప్రభువు.

లాజరు వ్యాధిగ్రస్తుడై చనిపోయినప్పుడు మరియమ్మను ఇంట్లో ఉంచి (యో. 11:20) మారమ్మ ప్రభువుకు ఎదురువెళ్లి ఎంతో విశ్వాసంతో చురుకుదనంతో, ధైర్యంతో "ప్రభూ ! మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడు కాడు" (యోహా. 11:32) అని తన నమ్మకం వ్యక్తంచేసింది. ఆమె పట్టుదల దుఃఖం, అర్థింపును బట్టే ప్రభువు లాజరును బ్రతికించి తన దైవ మహిమను చాటారు. మనిషి పునరుత్థానంగూర్చి దైవ రహస్యం వెల్లడించారు. ఉత్తరించుస్థల ఆత్మల విమోచన గురించిగాని మన ఇతర అవసరాలగూర్చిగాని మార్తమ్మను పోలి మనం అడిగితే ప్రభువు అద్భుతాలు చేస్తారని ఇక్కడ తెలుసుకుంటాం. దిక్కులేని ఆత్మలకు ముక్తి మనమే అడగాలి. లాజరు పై ప్రేమ ఉన్న ప్రభువు ప్రతి మనిషి పై ప్రేమ కలిగి ఉన్నారు. కాని అడిగేవార్ని బట్టి వరం ప్రాప్తిస్తుంది. అందువల్లే మార్తమ్మ మర్యాదల వలితంగా ప్రభువు ఫలితాన్నందించాడు. ఎన్నో రెట్లు పెద్దవరం అది. ఆమె అన్నం పెట్టింది. ప్రభువు ఆమెకు పవిత్రాత్మను పెట్టారు. సంప్రదాయ చరిత్ర ప్రకారం మారమ్మ, మరియమ్మ, లాజరు ఫ్రాన్సుదేశం వెళ్ళి అక్కడ ప్రభువాక్యం బోధించారని అక్కడే చనిపోయారని తెలుస్తుంది. మార్తమ్మ క్రీ||శ|| 84లో చనిపోయినట్లుగా తెలుస్తుంది. వంట చేసేవారికి, వంటపని వృత్తిగా కలవారికి మార్తమ్మ పాలక పునీతురాలు. మార్తా అంటే గృహపాలకురాలు, గౌరవ మహిళ అని అర్థం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN