భారత శ్రీసభలో వికసించిన ఆణిముత్యం - పునీత కేరళా అల్ఫోన్సమ్మ

జోసెఫ్ అవినాష్

28 Jul 2026

జులై 28
పునీత కేరళా అల్ఫోన్సమ్మ పండుగ

దైవ నిర్మితమైన శ్రీసభలో పునీత హోదాని పొందటం అంటే ఆషామాషీ కాదు.ఎలాంటి మచ్చ లేని పవిత్రతతో కూడిన జీవితాన్ని గడిపి ఉండాలి. నిష్కళంకమైన హృదయంతో పరుల మనసుని గెలుచుకుని ఉండాలి. తనను ఆశ్రయించిన వారి దుఃఖాలను, ప్రార్థన అవసరతలను కడతేర్చగలగాలి.అందుకే ఎన్నో శల్యపరీక్షల తరువాతే పునీత హోదాని అందిస్తారు.అలాంటి హోదాని పొందిన తొలి భారతీయురాలు పునీత ‘అల్ఫోన్సా’ ఆమె పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమె జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

కేరళలో పూసిన పుష్పం...
1910లో కేరళలోని ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు పునీత అల్ఫోన్సా.ఆమె అసలు పేరు ‘అన్నా ముత్తత్తుపడత్తు’. అల్ఫోన్సా చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించారు. పసితనంలోనే తల్లి చనిపోవడంతో అల్పోన్సాను ఆమె మేనత్త చేతిలో పెట్టారు.ఆ మేనత్త మహాకఠినాత్మురాలని అంటారు. ఎలాగైనా అల్ఫోన్సాని బాగా చదివించడం,ఓ అయ్య చేతిలో పెట్టడమే ఆమె ధ్యేయంగా ఉండేది.కానీ అల్ఫోన్సా మనసు మాత్రం క్రీస్తు మీదే నిమగ్నమై ఉండేది.

పెళ్లిని తప్పించుకునేందుకు..
అల్ఫోన్సాది సంపన్న కుటుంబం కావడంతో ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు రావడం మొదలుపెట్టాయి.చదువు, అందం ఉన్న అల్ఫోన్సాని చేసుకుంటామంటూ వర్తమానాలు మొదలయ్యాయి.కానీ అల్ఫోన్సాకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.క్రీస్తు కోసమే తన జీవితాన్ని అంకితం చేయాలన్నది ఆమె లక్ష్యంగా ఉండేది. అందుకే! తనకి ఎలాగైనా పెళ్లి చేయాలన్న మేనత్త ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆమె ఓ సాహసానికి ఒడికట్టారు. భగభగ మండుతున్న ఊకలో కాళ్లు పెట్టారు.దాంతో ఆమె కాళ్లు తీవ్రంగా కాలిపోయాయి. జీవితాంతం అల్ఫోన్సా ఆ గాయంతోనే గడిపారు.

దేవుని చేతిలో పనిముట్టుగా..
క్రమేపీ అల్ఫోన్సా జీవితం పూర్తిగా క్రీస్తుకి అనుకూలంగా మారిపోయింది.కడకు తనపట్టుదలనెగ్గి భరణాంగనం పట్టణంలోని పునీత క్లారా (క్లేరిస్ట్) మఠకన్యలసభలో 1928 ఆగష్టు 2వ తేదీన తమ 18వ ఏట చేరారు. మఠకట్టుబాట్లును, విద్యను పూర్తిచేశారు. 1930 ఆగష్టు 2న పునీత అల్ఫోన్సుస్ లిగోరిగారి పండుగరోజున అన్నాకుట్టి దివ్యబలి పూజలో విరక్తత్వము, విధేయత, దారిద్య్రమును వ్రతత్రయాన్ని స్వీకరించి, కన్యస్త్రీ ఉడుపులను ధరించారు. పేరుకూడ మార్చుకుని అల్ఫోన్స అనే క్రొత్త పేరును ధరించారు. ఇప్పుడు వారు సిస్టర్ అల్ఫోన్స.

శ్రమలను ముద్దాడింది..
దేవుని చేతిలో పనిముట్టుగా మారిన సిస్టర్ అల్ఫోన్సా ఒక స్థిర నిర్ణయం చేసుకుంది. అదేమనగా “నేను పునీతురాలని కావాలని ఎన్నో అడ్డంకులను, ఒడుదుడుకులను అధిగమించి మఠకన్యల సభలో చేరాను.నేను పునీతురాలని కాకపోతే నా జీవితమే వ్యర్ధం" అని పుణ్యాత్మురాలుగా జీవించాలని, త్రికరణశుద్ధిగా కోరుకుంది. అల్ఫోన్సా 1930 నుండి 1935 వరకు వివిధ రకాల రుగ్మతలతో, అస్వస్థతలతో బాధపడింది. ఆల్ఫోన్నా తనను తాను ప్రభుప్రేమకు బాధితురాలుగా సమర్పించుకుంది.ఆమె జీవితం పూలపాన్పు గాక, శారీరక, మానసిక వేదనలతో కూడుకున్న జీవితమైంది.ఆ కాలంలో ఆమెకు విపరీత రక్తస్రావం జరిగింది. దానితో ఆమె ఏ పని కూడా చేయలేక పోయింది.ఆమె 1932లో మాత్రం ఆరోగ్యం సహకరించటంతో వాకక్కాడులోని పాఠశాలలో ఒక సంవత్సరం బోధించింది. ఆమె శారీరకంగా బలహీనురాలైనందున ఉపాధ్యాయులకు, ఉపదేశికి సహాయం చేయటంలో నిమగ్నమైంది. ఆమె దస్తూరి చక్కగా ఉండటం మూలాన, సభాధినేతకు వ్యక్తిగత కార్యదర్శిగా పలు అధికారిక లేఖలు వ్రాయడంలో ఆమె సహకారమిచ్చింది.

యవ్వన ప్రాయంలోనే పరలోక పిలుపు..
అల్ఫోన్సా బాధలు సుదీర్ఘ కాలం కొనసాగాయి.తన నాధుడైన యేసుని కలుసుకోవటానికి సమయం ఆసన్నమైనదని ఆల్ఫోన్సా గ్రహించింది. ఫాదర్ రోములస్ మరియు మదర్ ఉర్పులా గారలను తన మరణం కోసం ప్రార్దించటానికి అల్ఫోన్సా అనుమతి కోరింది. అల్ఫోన్సా జూలై 16, 1949న తన మఠశ్రేష్ఠురాలు సుదర్ బెరదత్తు గారికి "గరుడపక్షి కోడి పిల్లలను తన్నుకుపోయినట్లే, ప్రభువు కూడా తనను హఠాత్తుగా తీసుకొని వెళ్తారు" అని లేఖ వ్రాసింది. ప్రభువును ముఖాముఖి కలుసుకుంటున్నాననే సంతోషంతో ఆమె పెదాలపై చిరు దరహాసపు మొగ్గ తొడిగింది. భరణంజ్ఞానం లోని ఫ్రాన్సిస్కన్ క్లేరిస్ట్ కాన్వెంటు నందు జూలై 28, 1946 న అల్ఫోన్సా తన నిత్య వరుడైన యేసు భగవానుని పరలోకంలో కలుసుకోవటానికి తన ఇహలోక యాత్రను చాలించింది.మరుసటి రోజు ఆమె భౌతిక కాయాన్ని సమాధి చేశారు. అల్ఫోన్సా 36 సంవత్సరాలే జీవించింది.అయినా ఆమె జీవన పరిమళం నేడు భారతావని యంతటా వ్యాపించింది. ఆమె మధ్యవర్తిత్వ ప్రార్ధనల వలన పలు అద్భుతాలు జరిగాయి, ఇంకనూ జరుగుతున్నాయి.

విశిష్ట సేవకు విలువైన బహుమానం...
సిస్టర్ అల్ఫోన్నాను రెండవ జాన్ పాల్ పాపుగారు ఫిబ్రవరి 6, 1986న కురియాకోస్ ఎలియాస్ చావరా గారితోబాటు కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో "ధన్యులు"గా ప్రకటించారు. ఆమెను పదహారవ బెనెడిక్టు జగద్గురువులు అక్టోబరు 12, 2008న రోమాపురిలో "పునీతుల" శ్రేణిలో నిలిపారు.పునీత ఆల్ఫోన్సా గారి పునీత పట్ట ప్రకటనను స్మరిస్తూ, ఆమె గౌరవార్థం నవంబరు 9, 2008న భరణంజ్ఞానంలో జరిగిన వేడుకలలో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ గారు పాల్గొనటం చాలా సంతోషించదగిన ఘట్టం.కతోలిక శ్రీసభలో భారతదేశంలో పుట్టి, పెరిగిన మొట్టమొదటి మహిళా
పునీతురాలైన ఆల్ఫోన్సా పుణ్యజీవితానికి నివాళులు సమర్పిస్తూ, భారతదేశ ప్రభుత్వం
ఆల్ఫోన్సా ముఖ చిత్రంతో అయిదు రూపాయల తపాలా బిళ్ళను నవంబరు 16, 2008న
విడుదల చేసింది. అల్ఫోన్సా గారి శత జయంతి వత్సర ఆరంభ సందర్భంగా భారతప్రభుత్వం ఆగస్టు 23, 2009న నూరు రూపాయల నాణెంను. అయిదు రూపాయల నాణెంను అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విడుదల చేసి,
భారతదేశ ముద్దుబిడ్డయైన అల్ఫోన్సాను గౌరవించింది..

చివరిగా-:
కతోలిక శ్రీసభ పునీతుల నిలయం. పునీతుల విశ్వాసాన్ని అనుసరిస్తూ, ప్రభు మార్గంలో పయనించాలని కతోలిక శ్రీసభ సత్యోపదేశం మనల్ని ఆహ్వానిస్తున్నది. వారి విశ్వాసాన్ని అనుసరిస్తూ ప్రభువును చేరుకుందాం. ముఖ్యంగా మఠ కన్యలు, పునీత అల్ఫోన్సా గారి జీవితాన్ని అనుసరించాలి. దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడుతూ, దైవ, మానవ సేవలో వర్ధిల్లాలి, పవిత్రత, దైవిక సుగుణాలను పునికి పుచ్చుకొని క్రీస్తు కొరకు జీవించాలి. శ్రీసభలో మఠకన్యల సంఖ్యా నానాటికి తగ్గిపోతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలను శ్రీసభకు అంకితమివ్వాలని, దైవ బాటలో వారిని నడిపే విధంగా జీవించాలని మనమంతా ప్రార్థిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN