పునీత పెద్ద యాకోబు గారి స్మరణ

కార్నెల్ శోభ

25 Jul 2026

అంతట జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో యేసు వద్దకు వచ్చి, మోకరించి, ఒక మనవి చేయబోగా, “నీ కోరిక యేమి?” అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, “నీ రాజ్య ములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైవునను కూర్చుండ సెలవిమ్ము" అని మనవిచేసెను. అందులకు యేసు, “మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?” అని పలుకగా, “చేయగలము” అని వారి రువురును సమాధానమిచ్చిరి. అందుకు యేసు, “మీరు నా పాత్రమునుండి పానము చేసెదరు. కాని, నా కుడిఎడమల గూర్చుండ జేయునది నేను కాదు; నా తండ్రి యేర్పరచిన వారికే అది లభించును” అనెను. తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినపుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను: “ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియునుగదా! కాని మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన, అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండ వలయును. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధార పోయుటకు వచ్చెను.”

పునీత యాకోబు : జీవితం, పరిచర్య, మరియు మనం నేర్చుకోవలసిన పాఠాలు
క్రీస్తు ప్రభువు ఎన్నుకున్న పన్నిద్దరు అపోస్తులలో జెబదాయి కుమారుడు యాకోబు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇతడిని "పెద్ద యాకోబు" (James the Greater) అని పిలవడానికి కారణం, పన్నిద్దరు అపోస్తులులలో మరొక యాకోబు అల్ఫయి కుమారుడు యాకోబు కూడా ఉండటమే. పెద్ద యాకోబు, తన సోదరుడు యోహాను, మరియు పేతురుతో కలిసి యేసుప్రభువుకు అత్యంత సన్నిహితమైన ముగ్గురు శిష్యులలో ఒకడిగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన జీవితం మనకు మానవ బలహీనత దైవకృపచే ఎలా రూపాంతరం చెందుతుందో, మరియు ఆధిపత్య వాంఛతో నిండిన హృదయం ఎలా త్యాగపూరిత ప్రేమకు మారగలదో చూపే అద్భుతమైన సాక్ష్యంగా నిలుస్తుంది.

బాల్యం మరియు కుటుంబ నేపథ్యం

పెద్ద యాకోబు గలిలయ ప్రాంతంలోని బెత్సయిదా అనే మత్స్యకార గ్రామంలో జన్మించాడని సంప్రదాయం చెబుతుంది. అతని తండ్రి జెబదాయి ఒక సంపన్న మత్స్యకారుడు, మరియు అతని తల్లి. మార్కు సువార్త ప్రకారం, జెబదాయికి పనివారు కూడా ఉన్నారు (మార్కు 1:20). ఇది వారి కుటుంబం ఆర్థికంగా కొంత స్థిరత్వం కలిగి ఉందని సూచిస్తుంది. యాకోబుకు యోహాను అనే సోదరుడు ఉన్నాడు, మరియు వీరిద్దరూ కలిసి తండ్రితో పాటు గలిలయ సముద్రంలో చేపలు పట్టే వృత్తిలో ఉండేవారు. వారు పేతురు, అంద్రెయ సోదరులతో వ్యాపార భాగస్వాములుగా కూడా ఉండేవారని లూకా సువార్త సూచిస్తుంది (లూకా 5:10). ఈ నేపథ్యం నుండి చూస్తే, యాకోబు కష్టపడి పనిచేసే, యూదు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అని అర్థమవుతుంది. ఇతను ప్రత్యేకమైన మతపరమైన శిక్షణ పొందిన వ్యక్తి కాదు, కానీ దేవుని పిలుపుకు తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేయడానికి సిద్ధపడిన సాధారణ మనిషి.

యేసు ప్రభువుచే పిలువబడుట

మార్కు సువార్త మరియు మత్తయి సువార్తలు యాకోబు, యోహానులను యేసుప్రభువు పిలిచిన సన్నివేశాన్ని నాటకీయంగా వర్ణిస్తాయి. "అచటనుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగుచేసికొనుచున్న జెబదాయి కుమారుడగు యాకోబును, అతని సోదరుడు యోహానును చూచి, వెంటనే వారిని పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి." (మార్కు 1:19-20). ఈ వచనంలో "వెంటనే" (euthys) అనే గ్రీకు పదం మార్కు సువార్తలో పదేపదే కనిపిస్తుంది. ఇది శిష్యరికం కోరుకునే తక్షణమైన, నిరపేక్షమైన ప్రతిస్పందనను నొక్కి చెబుతుంది. యాకోబు తన తండ్రిని, తన వృత్తిని, తన భద్రతను వదిలిపెట్టి, ఏమాత్రం సందేహించకుండా యేసు ప్రభువును అనుసరించాడు. ఇది ఆర్థిక భద్రతను వదిలిపెట్టడం మాత్రమే కాదు, తండ్రి పట్ల ఉన్న బాధ్యతను కూడా త్యజించడం, ఆనాటి యూద సమాజంలో అసాధారణమైన నిర్ణయం. ఈ తక్షణ ప్రతిస్పందన యాకోబు హృదయంలో అప్పటికే ఏదో ఆధ్యాత్మిక దాహం ఉందని, మెస్సీయ కోసం ఎదురుచూపు ఉందని సూచిస్తుంది.

ఉరుముల కుమారులు
యేసుప్రభువు తన పన్నిద్దరు అపోస్తులులను ఎంపిక చేసినప్పుడు, యాకోబు, యోహానులకు "బోయనేర్గేసు" అనే మారుపేరు పెట్టాడు, దీని అర్థం "ఉరుము కుమారులు" (మార్కు 3:17). ఈ పేరు వారి ఉద్రేకపూరితమైన స్వభావం, కొన్నిసార్లు అదుపు లేని స్వభావాన్ని సూచిస్తుంది. ఈ స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ లూకా సువార్తలో కనిపిస్తుంది. యేసు ప్రభువు యెరూషలేముకు ప్రయాణిస్తున్నప్పుడు, ఒక సమరయ గ్రామం ఆయనను ఆహ్వానించడానికి నిరాకరించింది. అప్పుడు యాకోబు, యోహానులు ఇలా అడిగారు: "ఆయన శిష్యులగు యాకోబు, యోహానులు అది చూచి “ప్రభూ! మేము ఆకాశమునుండి అగ్నిని రప్పించి, వీరిని నాశనముచేయుమని ఆజ్ఞాపించుట నీకు సమ్మ తమా?” అని అడిగిరి." (లూకా 9:54). ఈ ప్రశ్నలో వారి హృదయంలోని కోపము, ప్రతీకారేచ్ఛ, మరియు దైవశక్తిని తమ వ్యక్తిగత అవమానానికి ప్రతీకారంగా వాడుకోవాలనే తప్పుడు ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. యేసుప్రభువు వారిని గద్దించాడు (లూకా 9:55) ఎందుకంటే మెస్సీయ రాజ్యం అగ్నితో నాశనం చేసే రాజ్యం కాదు, క్షమాపణతో నిర్మించే రాజ్యం. ఈ సంఘటన యాకోబు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు. అతని సహజ స్వభావం ఎలా మారుతుందో ఇక్కడ మనం చూడవచ్చు.

అంతరంగ శిష్యులలో ఒకడు

పన్నిద్దరు అపోస్తులులలో, యేసుప్రభువుకు పేతురు, యాకోబు, యోహానులను తన అత్యంత సన్నిహితముగా ఉండేవారు. ఈ ముగ్గురు మాత్రమే మూడు అత్యంత కీలకమైన సంఘటనలలో యేసుప్రభువుతో పాటు ఉండే భాగ్యాన్ని పొందారు.

మొదటిది, యాయీరు కుమార్తెను బ్రతికించిన సంఘటన. యేసుప్రభువు మరణించిన బాలికను తిరిగి బ్రతికించడానికి వెళ్లినప్పుడు, "పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడైన యోహాను తప్ప మరి ఎవనిని తనతోకూడ తీసుకెళ్లలేదు" (మార్కు 5:37). ఇక్కడ యాకోబు యేసు ప్రభువు ఇచ్చే జీవమునకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు.

రెండవది, యేసు ప్రభువు రూపాంతరికరణ జరిగినప్పుడు (Transfiguration). "ఆరుదినములు గడచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తనవెంట తీసికొని, ఒక ఉన్నతపర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను" (మత్తయి 17:1-2). ఈ సందర్భంలో యాకోబు మోషే, ఏలియాలతో మాట్లాడుతున్న క్రీస్తు దివ్య మహిమను ప్రత్యక్షంగా చూసిన అరుదైన భాగ్యం పొందాడు. భవిష్యత్తులో తన సొంత శ్రమల మార్గంలో ఈ దృశ్యం అతనికి బలాన్నిచ్చే జ్ఞాపకంగా నిలిచింది.

మూడవది, మరియు అత్యంత హృదయవిదారకమైనది, గెత్సేమనే తోటలో యేసుప్రభువుతో పాటు ఉండటం. మరణానికి ముందు రాత్రి, యేసుప్రభువు "పేతురును, యాకోబును, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదనపడుచు చింతాక్రాంతుడాయెను." (మార్కు 14:33). ఇక్కడ యాకోబు మానవ యేసు ప్రభువు యొక్క బలహీనమైన, క్షణాన్ని ప్రత్యక్షంగా చూశాడు. క్రీస్తు దైవత్వాన్ని పర్వతంపై చూసిన అదే వ్యక్తి, ఆయన మానవత్వపు లోతైన వేదనను కూడా చూశాడు. ఈ రెండు అనుభవాలు కలిసి యాకోబుకు క్రీస్తు పూర్తి రహస్యాన్ని దైవత్వం మరియు మానవత్వం రెండింటినీ బోధించాయి.

ఆధిపత్య వాంఛ - కుడి ఎడమల ఆసనాల అభ్యర్థన

యాకోబు జీవితంలో అతని మానవ బలహీనతను స్పష్టంగా చూపే ముఖ్యమైన సంఘటన, దేవుని రాజ్యంలో ఉన్నత స్థానం కోసం చేసిన అభ్యర్థన. మత్తయి సువార్త ప్రకారం, యాకోబు, యోహానుల తల్లి యేసుప్రభువు వద్దకు వచ్చి, "నీ రాజ్య ములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను, ఒకడు నీ ఎడమ వైవునను కూర్చుండ సెలవిమ్ము" (మత్తయి 20:21) అని అభ్యర్థించింది. మార్కు సువార్తలో ఈ అభ్యర్థన స్వయంగా యాకోబు, యోహానుల నోటి నుండే వస్తుంది (మార్కు 10:35-37) బహుశా తల్లి వారి తరపున మాట్లాడినా, అభ్యర్థన వారి స్వంత హృదయ వాంఛే అయి ఉండవచ్చు. ఈ అభ్యర్థనలో మానవ సహజమైన అధికార వాంఛ, గుర్తింపు కోసం ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది శిష్యులు ఇంకా దేవుని రాజ్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోలేదని చూపిస్తుంది.

యేసుప్రభువు ప్రతిస్పందన లోతైన ఆధ్యాత్మిక పాఠాన్ని బోధిస్తుంది, "మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా?" (మత్తయి 20:22). "పాత్ర" అనే పదం బాధను, మరణాన్ని సూచిస్తుంది. యేసుప్రభువు తాను త్రాగబోయే శ్రమల పాత్రను సూచిస్తున్నాడు. యాకోబు, యోహానులు నిర్భయంగా "త్రాగగలము" అని జవాబిచ్చారు, బహుశా వారికి తామేమి చెబుతున్నామో పూర్తిగా తెలియకపోయినా. యేసుప్రభువు వారికి, "మీరు నా పాత్రమునుండి పానము చేసెదరు. కాని, నా కుడిఎడమల గూర్చుండ జేయునది నేను కాదు; నా తండ్రి యేర్పరచిన వారికే అది లభించును" (మత్తయి 20:23) అని చెప్పాడు.

మిగతా పది మంది అపోస్తులులు యాకోబు, యోహానుల మీద కోపగించుకున్నప్పుడు (మార్కు 10:41), యేసుప్రభువు వారందరికీ నిజమైన గొప్పతనం అంటే సేవ చేయడమేనని బోధించాడు. "కాని మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన, అతడు మీకు సేవకుడుగా ఉండవలయును. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండ వలయును. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము తన ప్రాణమును ధార పోయుటకు వచ్చెను.”" (మత్తయి 20:26-28). ఈ బోధను యాకోబు తన హృదయంలో లోతుగా నాటుకుపోనిచ్చాడని అతని తదనంతర జీవితం రుజువు చేస్తుంది.

యాకోబు పేరు వెనుక అర్థం మరియు ఇద్దరు యాకోబుల మధ్య వ్యత్యాసం
"యాకోబు" అనే పేరు హీబ్రూ బాష "యాకోవ్" నుండి వచ్చింది, ఇది పాత నిబంధనలో పితరుడైన యాకోబు (ఇశ్రాయేలు) పేరు నుండి తీసుకోబడింది. ఈ పేరు యూదుల్లో అత్యంత సాధారణమైన పేర్లలో ఒకటిగా ఉండేది, అందువల్ల యేసుప్రభువు శిష్యులలో ఇద్దరు యాకోబులు ఉండటం ఆశ్చర్యకరం కాదు. క్రైస్తవ సంప్రదాయం వీరిద్దరిని వేరుపరచడానికి "పెద్ద యాకోబు" (జెబదాయి కుమారుడు) మరియు "చిన్న యాకోబు" (అల్ఫయి కుమారుడు) అనే పేర్లను ఉపయోగిస్తుంది. ఈ "పెద్ద", "చిన్న" అనే విశేషణాలు వయసును సూచించవచ్చు, లేదా వారు యేసుప్రభువును అనుసరించడం ప్రారంభించిన క్రమాన్ని సూచించవచ్చు, అయితే, పెద్ద యాకోబు అపోస్తులుల జాబితాలలో ఎల్లప్పుడూ పేతురు తరువాత, మిగతా అపోస్తులులకన్నా ముందు ప్రస్తావించబడతాడు (మార్కు 3:16-17, మత్తయి 10:2), ఇది అతని ప్రాముఖ్యతను, అపోస్తులుల బృందంలో అతని నాయకత్వ స్థానాన్ని సూచిస్తుంది.

జెబదాయి కుటుంబం మరియు యాకోబు వ్యక్తిత్వ నిర్మాణం
జెబదాయి కుటుంబ నేపథ్యాన్ని లోతుగా పరిశీలిస్తే, యాకోబు వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుందో అర్థమవుతుంది. మత్స్యకార వృత్తి కఠినమైనది, అనిశ్చితమైనది. రాత్రిపూట సముద్రంలో శ్రమించడం, వాతావరణ మార్పులతో పోరాడటం, రాబడి కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ వృత్తి యాకోబులో దృఢత్వాన్ని, సహనాన్ని, మరియు నిర్ణయాత్మక స్వభావాన్ని పెంపొందించి ఉండవచ్చు. ఇవే గుణాలు తరువాత అతని ఉద్రేకపూరిత, స్వభావంగా వ్యక్తమయ్యాయి. తల్లి సలోమి పాత్ర కూడా గమనార్హం, ఆమె యేసుప్రభువు పరిచర్యను అనుసరించిన స్త్రీలలో ఒకామెగా, సిలువ దగ్గర నిలబడిన స్త్రీలలో ఒకామెగా (మార్కు 15:40), మరియు పునరుత్థానం తరువాత సమాధి వద్దకు సుగంధ ద్రవ్యాలు తీసుకువెళ్లిన స్త్రీలలో ఒకామెగా ప్రస్తావించబడింది. ఆమె తన కుమారుల కోసం దేవుని రాజ్యంలో ఉన్నత స్థానం కోరిన అభ్యర్థన, ఆమెకు తన కుమారుల పట్ల ఉన్న గాఢమైన మాతృప్రేమను, వారి భవిష్యత్తు పట్ల ఆమె ఆసక్తిని ప్రతిబింబిస్తుంది, ఇది ప్రతి తల్లి హృదయంలో ఉండే సహజ భావననే.

పునరుత్థానానంతర జీవితం మరియు పెంతెకోస్తు

యేసుప్రభువు సిలువ మరణం తరువాత, యాకోబు ఇతర అపోస్తులులతో కలిసి భయంతోగడిపాడు. కానీ పునరుత్థానుడైన క్రీస్తును చూసిన తరువాత, మరియు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందిన తరువాత, యాకోబు జీవితంలో సంపూర్ణ మార్పు కనిపిస్తుంది. అపోస్తులుల కార్యముల గ్రంథం ప్రారంభ అధ్యాయాలలో, యాకోబు ఇతర అపోస్తులులతో కలిసి యెరూషలేము సంఘ స్థాపనలో, బోధనలో, ప్రార్థనలో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తుంది (అపో.కా. 1:13-14). ఉరుముల కుమారుడైన యాకోబు, ఇప్పుడు వినయపూర్వక సేవకుడిగా, సంఘ నిర్మాణంలో స్తంభంలా నిలిచాడు.

ప్రేషిత కార్యము - స్పెయిన్ దేశ ప్రచార సంప్రదాయం
యాకోబు ప్రేషిత కార్యం గురించి బైబిలు గ్రంథం స్పష్టమైన వివరాలు ఇవ్వదు, కానీ పురాతన క్రైస్తవ సంప్రదాయం అతనిని స్పెయిన్ దేశపు సువార్త ప్రచారకుడిగా, స్పెయిన్ పాలక పునీతునిగా గుర్తిస్తుంది. ఈ సంప్రదాయం ప్రకారం, యాకోబు క్రీస్తు పునరుత్థానం తరువాత హిస్పానియా (నేటి స్పెయిన్, పోర్చుగల్) ప్రాంతానికి వెళ్లి సువార్తను ప్రకటించాడు. అక్కడ అతను పరిమిత విజయమే సాధించాడని, కేవలం కొద్దిమంది శిష్యులను మాత్రమే సంపాదించుకున్నాడని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. ఈ ప్రయాణంలో, సరగోసా (Zaragoza) నగరంలో, మరియ మాత యాకోబుకు స్తంభంపై (Pillar) దర్శనమిచ్చిందని, ఆమె ఇంకా భూమిపై జీవించి ఉండగానే (మరణానికి ముందు) ఆధ్యాత్మిక రూపంలో కనిపించి అతనిని ప్రోత్సహించిందని ఒక ప్రసిద్ధ సంప్రదాయం చెబుతుంది. ఈ సంప్రదాయం నుండే దీని Our Lady of the Pillar భక్తి ఆవిర్భవించింది.

ఈ సంప్రదాయం మనకు బోధించే ముఖ్యమైన సత్యం ఏమిటంటే, ప్రేషిత కార్యం వెంటనే కనిపించే ఫలితాలను ఇవ్వకపోవచ్చు. యాకోబు స్పెయిన్‌లో పరిమిత ఫలితాలతోనే యెరూషలేముకు తిరిగి వచ్చాడని సంప్రదాయం చెబుతుంది, కానీ అతను నాటిన విత్తనం నాటే కృషి తరువాతి శతాబ్దాలలో అపారమైన ఫలాన్ని ఇచ్చింది.

"మొదటి వేద సాక్షి "

యాకోబు మరణమును ఒక చారిత్రక సంఘటనగా మాత్రమే కాకుండా, లోతైన వేదాంతపరమైన అర్థంతో పరిశీలించాలి. పన్నిద్దరు అపోస్తులులలో మొదటిగా ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగా, యాకోబు తరువాతి తరాల క్రైస్తవులకు, ముఖ్యంగా హింసను ఎదుర్కొంటున్న సంఘానికి, ఒక నమూనాగా నిలిచాడు. తొలి క్రీస్తు సంఘం తీవ్రమైన హింసల మధ్య జీవించింది. హేరోదు అగ్రిప్ప తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి యూదు మత నాయకులను సంతోషపెట్టే ప్రయత్నంలో భాగంగా క్రీస్తు అనుచరులపై దాడి చేశాడు (అపో.కా. 12:3). ఈ నేపథ్యంలో యాకోబు మరణం, తొలి క్రైస్తవులకు భయాన్ని కలిగించే బదులు, వారి విశ్వాసాన్ని మరింత దృఢపరిచింది. ఎందుకంటే ఒక అపోస్తలుడు, స్వయంగా క్రీస్తుతో నడిచిన వ్యక్తి, తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వెనుకాడలేదని వారు చూశారు.

మరణం
యాకోబు జీవితంలో అత్యంత చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటన అతని మరణం. అపోస్తులుల కార్యములలో స్పష్టంగా ఇలా చెబుతుంది: "ఈ సమయములో హేరోదు రాజు సంఘములోని కొందరిని హింసింపసాగెను.యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను." (అపో.కా. 12:1-2). ఇది పన్నిద్దరు అపోస్తులులలో వేదసాక్షి మరణం పొందిన మొదటి అపోస్తలుడిగా యాకోబును నిలబెడుతుంది. ఇది సుమారు క్రీ.శ. 44వ సంవత్సరంలో, హేరోదు అగ్రిప్ప I పరిపాలనా కాలంలో జరిగింది.

యాకోబు, ఒకప్పుడు తన సొంత అధికారం, గుర్తింపు కోసం ఆరాటపడిన వ్యక్తి, ఇప్పుడు క్రీస్తు నామం కోసం తన ప్రాణాన్ని ఖడ్గానికి అర్పించాడు. యేసుప్రభువు అతనికి చెప్పిన మాటలు "నా పాత్రను నుండి త్రాగుదురు" అక్షరాలా నెరవేరాయి. తన సోదరుడు యోహాను దీర్ఘకాలం జీవించి, వృద్ధాప్యంలో సహజ మరణం పొందగా, యాకోబు తన ప్రభువు కోసం రక్తసాక్షిగా మారిన మొదటి అపోస్తలుడయ్యాడు. ఉరుముల కుమారుడు, ఇప్పుడు బలి అర్పణగా మారాడు.

సంప్రదాయం ప్రకారం, యాకోబును ఖడ్గంతో చంపే ముందు, అతనిని నిందించిన ఒక వ్యక్తి, యాకోబు యొక్క ప్రశాంతమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూసి పశ్చాత్తాపపడి, తానూ క్రైస్తవుడనని ప్రకటించుకుని, యాకోబుతో పాటే మరణం పొందాడని యూసేబియస్ వంటి ప్రాచీన చరిత్రకారులు నమోదు చేశారు. ఈ కథ నిజమైతే, యాకోబు మరణం కూడా అతని జీవితంలాగే, మరొకరిని క్రీస్తు వైపు తిప్పే సాధనంగా మారింది.

సాంటియాగో డి కంపోస్టేలా వారసత్వం

యాకోబు మరణానంతర సంప్రదాయం ప్రకారం, అతని శిష్యులు అతని పవిత్ర శరీరాన్ని రహస్యంగా స్పెయిన్‌కు తీసుకువెళ్లి, గలీసియా ప్రాంతంలో సమాధి చేశారు. శతాబ్దాలుగా ఈ స్థలం మరుగునపడి ఉండగా, 9వ శతాబ్దంలో ఒక సన్యాసికి దివ్యదర్శనం ద్వారా ఈ సమాధి కనుగొనబడిందని చెబుతారు.

ఈనాటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యాత్రికులు ఈ దేవాలయానికి కాలినడకన ప్రయాణిస్తారు. ఈ యాత్ర క్రైస్తవ ప్రపంచంలో యెరూషలేము, రోమ్‌లతో పాటు అత్యంత ముఖ్యమైన మూడు తీర్థయాత్రా స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యాత్రా మార్గం వేలాది మంది యాత్రికులకు, ఆధ్యాత్మిక పరివర్తనకు వేదికగా మారింది. ఇది యాకోబు జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశాన్ని ప్రతిబింబిస్తుంది: ప్రయాణం, పరివర్తన, మరియు గమ్యస్థానం చేరుకోవడం.

పండుగ దినం
తిరుసభ జూలై 25న పెద్ద యాకోబు పండుగను జరుపుకుంటుంది. ఈ దినం ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ మరియు లాటిన్ అమెరికాలోని అనేక దేశాలలో గొప్ప వేడుకగా జరుపబడుతుంది. సాంటియాగో డి కంపోస్టేలా నగరంలో ఈ దినాన లక్షలాది యాత్రికులు, భక్తులు అక్కడకు వెళతారు.

సోదర బంధం - యాకోబు, యోహానుల పరస్పర పరిచర్య
యాకోబు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అతని సోదరుడు యోహానుతో అతని బంధాన్ని పరిగణలోకి తీసుకోవడం అవసరం. వీరిద్దరూ కేవలం సోదరులు మాత్రమే కాదు, వృత్తిపరమైన భాగస్వాములు, మరియు శిష్యరికంలో సహప్రయాణికులు. సువార్తలలో వీరిద్దరి పేర్లు దాదాపు ఎల్లప్పుడూ కలిసే ప్రస్తావించబడతాయి. "యాకోబు, అతని సహోదరుడైన యోహాను" అనే పదబంధం పదేపదే కనిపిస్తుంది. ఈ సోదర భాగస్వామ్యం, పేతురు, అంద్రెయ సోదరుల భాగస్వామ్యంతో పాటు, తొలి శిష్యరిక బృందంలో కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాయో చూపిస్తుంది. ఇద్దరు సోదరులు కలిసి ఒకే స్వభావాన్ని పంచుకున్నారు (బోయనేర్గేసు అనే మారుపేరు ఇద్దరికీ వర్తించింది), ఇద్దరు కలిసి దేవుని రాజ్యంలో స్థానం కోరారు, కలిసి రూపాంతరికరణ వద్ద ఉన్నారు, గెత్సేమనే అనుభవాలను పంచుకున్నారు. అయితే వారి తుది మార్గాలు భిన్నంగా ఉన్నాయి. యాకోబు యువకుడిగానే అమరుడుకాగ పొందగా, యోహాను దీర్ఘకాలం జీవించి, నాలుగవ సువార్తను, మూడు లేఖలను, దర్శన గ్రంథాన్ని రచించి, వృద్ధాప్యంలో సహజ మరణం పొందాడని సంప్రదాయం చెబుతుంది. ఈ వ్యత్యాసం మనకు గుర్తుచేసేది. దేవుడు ప్రతి శిష్యుని ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తాడు, ఒకే కుటుంబంలో, ఒకే పిలుపులో పాలుపంచుకున్నవారికి కూడా భిన్నమైన పరిచర్య రూపాలను, భిన్నమైన ముగింపులను నియమిస్తాడు. ఇద్దరూ సమానంగా విశ్వసనీయులు, సమానంగా ప్రేమించబడినవారు, వారి పరిచర్య ఆకారం మాత్రమే భిన్నమైనది.

మనం నేర్చుకోవలసిన పాఠాలు
తక్షణ, ఆపేక్షలేని ప్రతిస్పందన. యాకోబు తన వలలను, తన తండ్రిని, తన వృత్తిని వెంటనే వదిలిపెట్టి యేసు ప్రభువుని అనుసరించాడు. ఈనాడు మనం తరచుగా దేవుని పిలుపును విని కూడా, "కొంచెం సమయం ఇవ్వండి," "ముందు నా వ్యవహారాలు చక్కదిద్దుకుంటాను" అని వాయిదా వేస్తుంటాము. యాకోబు మాదిరి మనకు బోధించేది, దైవ పిలుపుకు వెంటనే, పూర్తి హృదయంతో ప్రతిస్పందించడమే నిజమైన శిష్యరికం.

ఉద్రేకపూరిత స్వభావం ఉన్న దేవుని కృప దానిని క్రమశిక్షణలో పెట్టబడుతుంది. యాకోబు సహజ స్వభావం తీవ్రమైనది, కోపపూరితమైనది. సమరియ గ్రామంపై అగ్ని కురిపించమని కోరినంతగా కఠిన మనసు కలవాడు. కానీ యేసుప్రభువు అతనిని తిరస్కరించలేదు, బహిష్కరించలేదు బదులుగా, తన శిష్యరికపు కాలంలో నెమ్మదిగా అతని ఉద్రేకాన్ని మార్చివేశాడు. ఇది మనకు నేర్పేది మన సహజ లోపాలు, మన తీవ్రమైన స్వభావాలు కూడా, దేవుని కృపకు లొంగినప్పుడు, శక్తివంతమైన సాధనాలుగా మారగలవు. కోపము, ఉద్రేకము అణచివేయబడవలసినవి కావు, కానీ సరైన దిశలో మళ్లించబడవలసినవి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే పవిత్ర ఆగ్రహంగా, సువార్త కోసం తీవ్రమైన అభిమానంగా మారాలి.

ఆధిపత్య వాంఛ నుండి సేవాభావం వైపు ప్రయాణం. యాకోబు రాజ్యంలో ఉన్నత స్థానం కోరుకున్నాడు, కానీ యేసుప్రభువు అతనికి నిజమైన గొప్పతనం సేవలో, త్యాగంలో ఉందని బోధించాడు. ఈనాటి మన సమాజంలో కూడా, గుర్తింపు కోసం, పదవుల కోసం, ప్రాముఖ్యత కోసం ఆరాటం సర్వసాధారణం అయిపోయింది. సంఘంలో కూడా ఈ ఆరాటం కనిపించవచ్చు. యాకోబు మాతృక మనకు గుర్తుచేసేది ఏమిటంటె క్రీస్తు రాజ్యంలో గొప్పతనం అధికారంలో కాదు, వినయపూర్వక సేవలో, ఇతరుల కోసం తనను తాను అర్పించుకోవడంలో ఉంది.

శ్రమల పాత్రను త్రాగే సంసిద్ధత. యాకోబు, తనకు పూర్తిగా తెలియకపోయినా, క్రీస్తు శ్రమల పాత్రను త్రాగుటకు సిద్ధపడ్డాడు, చివరకు తన ప్రాణాన్ని అర్పించాడు. క్రైస్తవ జీవితం సౌకర్యవంతమైన మార్గం కాదు, ఇది తరచుగా త్యాగాన్ని, బాధను, కష్టాలను కోరుతుంది. యాకోబు జీవితం మనకు అందులకు ప్రోత్సహించేది. క్రీస్తు కోసం ఎదురయ్యే ప్రతి బాధను, కష్టాన్ని ధైర్యంగా స్వీకరించడం కోసం సిద్దంగా ఉండాలని చెపుతుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN