పోప్ లియో XIV జగద్గురువుల 'మాగ్నిఫికా హుమానితాస్' గురించి సదస్సు నిర్వహించిన శ్రీసభ బోధన కమిషన్*

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
23 Jul 2026
కర్నూలు పీఠానికి చెందిన శ్రీసభ బోధన కమిషన్, లియో XIV జగద్గురువుల ప్రథమ బోధనా పత్రం మాగ్నిఫికా హుమానితాస్ గురించి, 2026 జూలై 22వ తేదీన మేత్రాసన పాస్టరల్ సెంటర్లో ఒక రోజు సదస్సు నిర్వహించింది.గురువులు,మఠకన్యలు,మేత్రాసనంలోని వివిధ కమిషన్ల సభ్యులు దీనిలో పాల్గొని,ఈ కృత్రిమ మేథస్సు యుగంలో మానవ వ్యక్తిని గురించిన శ్రీసభ బోధనపై ధ్యానించారు.
పేర్ల నమోదు,తేనీటి విందు అనంతరం,కర్నూలు పీఠకాపరి మహా ఘన డాక్టర్ గోరంట్ల జ్వాన్నేసు ఓసీడీ గారు,బెంగుళూరు పునీత పేతురు జగద్గురు గురువిద్యాలయ రెక్టర్ గురుశ్రీ డాక్టర్ రిచర్డ్ బ్రిట్టో గారితో,వికార్ జనరల్ గురుశ్రీ డేవిడ్ అరుళప్ప తో,సిస్టర్ ఇన్నమ్మ,తదితర ప్రముఖులతో కలసి,జ్యోతి ప్రజ్వలన ద్వారా సదస్సును ప్రారంభించారు.
సదస్యులను ఆహ్వానిస్తూ,శ్రీసభ బోధన కమిషన్ కార్యదర్శి గురుశ్రీ బాబు రాజ్ గారు నాటి కార్యక్రమాన్ని పరిచయం చేసి, ప్రధాన ప్రయోక్తను పరిచయం చేయవలసిందిగా గురుశ్రీ నవీన్ ను ఆహ్వానించారు.తన ప్రారంభ సందేశంలో జ్వాన్నేసు పీఠాధిపతులు,ఈ సదస్సును నిర్వహించినందుకు ఫాదర్ బాబు రాజ్ ను అభినందించి,మేత్రాసనానికి చెందిన ప్రతి కమిషన్ ఇలా మరింత చైతన్యంతో పని చేయాలని ప్రోత్సహించారు.సంవత్సరం పొడవునా,సదస్సులను, కార్యశాలలను, రూపొందింపు(ఫార్మేషన్) కార్యక్రమాలను జరపడానికి ఒక అంకిత భావంతో కూడిన జట్టును ఏర్పరచుకోవాలని, ప్రతి కమిషన్ కార్యదర్శిని ఆయన గట్టిగా కోరారు. ఈ విధంగా మేత్రాసన జీవనంలో,కమిషన్లు స్ఫూర్తిదాయక,ప్రభావభరిత పాత్రను పోషించాలని ఆయన ఉద్బోధించారు.
చక్కగా సన్నద్ధమైన సూక్ష్మ సమర్పణ ద్వారా, మాగ్నిఫికా హుమానితాస్ఐదు అధ్యాయాలను గురుశ్రీ డాక్టర్ జెరార్డ్ వివరిస్తూ,కృత్రిమ మేథస్సు యొక్క బాధ్యతాయుత వినియోగం విషయంలో లియో XIV జగద్గురువుల దార్శనికతను ప్రస్ఫుటంగా వర్ణించారు.మానవ వ్యక్తి ఘనతను/గౌరవాన్ని,మానవ జాతి సమిష్టి శ్రేయస్సును, కృత్రిమ మేథస్సు ఎల్లప్పుడూ సేవించాలని,మానవ స్వేచ్ఛకు, అంతరాత్మకు,బాధ్యతకు గల స్థానాన్ని,కృత్రిమ మేథస్సు ఎన్నటికీ భర్తీ చేయరాదని ఆయన నొక్కి చెప్పారు.మానవ జాతికి యజమానిగా కాక, మానవ జాతి సేవలో ఒక పరికరంగా మాత్రమే కృత్రిమ మేథస్సు మిగిలిపోయే విధంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వివేకవంతంగా వినియోగించాలని సదస్యులను ఆయన కోరారు.
మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత, ప్రశ్నోత్తరాల సమయం నడిచింది. కృత్రిమ మేథస్సు యొక్క విశ్వసనీయతపై, విద్యలో దాని వినియోగంపై, దాని నైతిక పరిమితులపై సదస్యులు ఆచరణాత్మక ప్రశ్నలను సంధించారు. బిషప్ జ్వాన్నేసు చర్చలో పాల్గొంటూ, కృత్రిమ మేథస్సు బాధ్యతాయుత వినియోగంపై, ప్రత్యేకించి యువతీయువకుల వ్యక్తిత్వ నిర్మాణంలో దాని వినియోగంపై, కాపరిక(పాస్టరల్) మార్గదర్శకాలను అందించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎన్నడూ సత్యాన్ని వక్రీకరించకూడదని, మానవ వివేచనను బలహీనపరచ కూడదని ఆయన అందరికీ గుర్తు చేసారు.వందన సమర్పణతో, పీఠాధిపతుల ఆశీర్వాదంతో సదస్సు ముగిసింది. మానవ ఘనత మరియు ఉత్పన్నమౌతున్న సాంకేతికతల బాధ్యతాయుత వినియోగం విషయంలో, శ్రీసభ బోధనలను గురించి నవీకరించబడిన అవగాహనతో సదస్యులు ఇంటికి వెళ్ళారు.
