1,800 మీటర్ల ఎత్తులోని పవిత్ర త్రిత్వ పుణ్యక్షేత్రంలో పోప్ ప్రార్థన

జోసెఫ్ అవినాష్
23 Jul 2026
వేసవి విశ్రాంతి కోసం కాస్టెల్ గండోల్ఫోలో ఉన్న పోప్ లియో XIV,జూలై 22న ఇటలీలోని మోంటి సింబ్రూయిని పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,800 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రసిద్ధ పవిత్ర త్రిత్వ పుణ్యక్షేత్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.మౌంట్ ఆటోరే శిలల్లో నిర్మించబడిన ఈ పుణ్యక్షేత్రంలో పోప్ పవిత్ర త్రిత్వ ప్రాచీన ఫ్రెస్కో చిత్రం ముందు కొంతసేపు ప్రార్థనలో గడిపి,అక్కడి విశ్వాసులు, మఠవాసులను ఆప్యాయంగా పలకరించారు.ఈ పర్వత పుణ్యక్షేత్రం ఇటలీలోని అత్యంత ప్రసిద్ధ యాత్రా స్థలాలలో ఒకటి.పెంతెకొస్తు పండుగతో పాటు జూలై 26న జరిగే పునీత అన్నమ్మ పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు కాలినడకన ఈ క్షేత్రానికి చేరుకుంటారు.ఇక్కడి గుహలో పవిత్ర త్రిత్వాన్ని మూడు సమాన క్రీస్తు రూపాలుగా చిత్రించిన అరుదైన బైజాంటైన్ ఫ్రెస్కో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
తిరుగు ప్రయాణంలో పోప్ లియో XIV సుబియాకోలోని పునీత బెనెడిక్ట్,పునీత స్కొలాస్టికా మఠాలను కూడా సందర్శించారు.అక్కడ పునీత ఫ్రాన్సిస్ ప్రాచీన చిత్రపటం ముందు నిశ్శబ్దంగా ప్రార్థించి,స్థానిక సంప్రదాయం ప్రకారం పునీత బెనెడిక్ట్ స్వరూపం యొక్క మోకాలిని ముద్దాడి, అక్కడ ఉన్న వారితో కలిసి పరలోక జపాన్ని జపించారు.
