పునీత మగ్దలామరియ స్మరణ సందర్భంగా

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

22 Jul 2026

సువిశేషాలలో ఎందరో స్త్రీలు పాఠకులకు పరిచయమవుతారు.వారిలో కొందరు మరియ,మార్త, సమరియా స్త్రీ,కననీయ స్త్రీ,నాయీను వితంతువు మొదలగువారు.అయితే మగ్దలామరియ విషయంలో ఏదో ప్రత్యేకత ఇట్టే ఆకట్టుకుంటుంది.మొట్టమొదటిగా ఆమె నుండి ఏడు దయ్యములను వెడలగొట్టి స్వస్థపరచినట్లు తెలుస్తోంది (లూకా 8:2),ఏడు అనే సంఖ్య సంపూర్ణతకు సూచన.అంటే ఆమె ఏదో భయంకరవ్యాధికి గురయి ఉండాలి.ఇట్టి వ్యాధులను దెయ్యము సోకినట్లుగా ఆనాటి ప్రజలు భావించేవారు.ఈ స్వస్థత కారణంగా ఆమె సమాజంలో గౌరవస్థానం సంపాదించుకొంది.అందరిలాగే జీవిస్తూ, ఒక మామూలు స్థితికి చేరుకుంది.అందుకు యేసుక్రీస్తు పట్ల అమితమైన కృతజ్ఞతాభావం చూపించసాగింది.ఆయనను అనుసరించడమేకాక,క్లిష్టతర పరిస్థితులల్లో ఆయన వెంట ఉంటూ, కృతజ్ఞతతో నిండిన శిష్యురాలిగా శిలువ చెంత కనిపిస్తుంది.ఆందోళనతో వెదకే ఒక ఆత్మీయురాలిగా సమాధి దగ్గర కనిపిస్తుంది (మార్కు 15:49,47 16:1-8). ఆమెలో ప్రభువుపట్ల ఉన్న ప్రేమ,ఖాళీసమాధి దగ్గర ఆవిష్కృతమవుతుంది (యోహాను 20:11-18).ఆమెలో ఉన్న కృతజ్ఞత మరియను ప్రభువుకు దగ్గరచేసి,సేవచేస్తూ, శిష్యురాలిగా సాన్నిహిత్యం పొందే అర్హతను సంపాదించిపెట్టింది (లూకా 8:1-2).పైవిధంగాచూస్తే, ఈ సాన్నిహిత్యం కేవలం ఒక గురువుకు,ఒక శిష్యురాలికి మధ్య ఉన్న అనుబంధంగా,దేవునికి, భక్తురాలికీ మధ్య ఉన్న సంబంధంగా తోస్తుందేకానీ వేరే విధంగా కాదు. ఈ పవిత్ర సాన్నిహిత్యాన్ని విపరీతార్ధాలతో,అపవిత్రంచేసే ప్రబుద్ధులు లేకపోలేదు.తెల్లటి కాగితం మీద నల్లటిచుక్కల కోసం ప్రాకులాడే మనస్తత్వాలకు ఎంత చెప్పినా వ్యర్ధమే మరి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN