వాటికన్ నుంచి ఉక్రెయిన్ కు బాప్తిస్మ యోహాను పవిత్ర అవశేషాలు

జోసెఫ్ అవినాష్
21 Jul 2026
క్రీస్తు రాకకు మార్గం సిద్ధం చేసిన కారణజన్ముడు పునీత బాప్తిస్మ యోహాను గారి పవిత్ర అవశేషాలను వాటికన్ ఉక్రెయిన్‌లోని కార్పతియన్ ప్రాంతంలోని పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రానికి శాశ్వతంగా భద్రపరచేందుకు అందజేసింది.ఈ చారిత్రక సంఘటన కేవలం పవిత్ర అవశేషాల బదిలీ మాత్రమే కాదు,యుద్ధం వల్ల తీవ్ర బాధలు అనుభవిస్తున్న ఉక్రెయిన్ ప్రజలకు దేవుని సమీపాన్ని,ఆశను,ఓదార్పును అందించే ఆధ్యాత్మిక వరంగా శ్రీసభ అభివర్ణించింది.ఇకపై ఈ అవశేషాలు ఆ పుణ్యక్షేత్రంలో భక్తుల వందనానికి అందుబాటులో ఉండటంతో, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే విశ్వాసులు ప్రార్థనలు చేయడానికి అవకాశం కలుగుతుంది.ఈ సందర్భంగా స్థానిక శ్రీసభ నాయకులు,పునీత బాప్తిస్మ యోహాను గారి మధ్యవర్తిత్వం ద్వారా ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని, ప్రజల హృదయాల్లో విశ్వాసం బలపడాలని,యుద్ధం ముగిసి దేశంలో మళ్లీ శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.ఈ పవిత్ర అవశేషాల సన్నిధిలో ప్రతి నెలా ప్రత్యేక ప్రార్థనలు,ఆరాధనలు,శాంతి మరియు స్వస్థత కోసం ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
