పునీత పేతురు చేతిలో తాళాలు ఎందుకు కనిపిస్తాయి?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
20 Jul 2026
పునీత పేతురు తాళం చెవిపట్టుకొని ఉన్నట్లు స్వరూపాలలోనూ,చిత్రపటాల లోనూ చూపబడుతుంది.ఇది పేతురుకు ప్రభువిచ్చిన అధికారానికి సంకేతం సాధారణంగా తాళం చెవి బంధించడానికి,విప్పడానికి వినియోగించబడుతుంది.ప్రభువు పేతురుతో ఇలా అన్నాడు: "నేను నీకు పరలోకపు తాళపు చెవులను ఇచ్చెదసు. భూలోకంలో నీవు దేనిని బంధింతువో,అది పరలోకంలో బంధింపబడును.. భూలోకంలో నీవు దేనిని విప్పుదువో అది పరలోకంలో విప్పబడును" (మత్తయి 16:19) ఇలా పరలోక, భూలోకంలో ఆయనకు ఒక ప్రత్యేక అధికారం ఇవ్వబడింది.దీనికి సూచనగా పేతురు చేతులలో తాళపుచెవి కనుపిస్తుంది.నిజానికి రోము . నగరంలో పునీత పేతురు బసలికా ఆవరణమంతా దాదాపు ఒక తాళపు చెవినిబోలో ఉండటం విశేషం. ఇది పేతురు అధికారానికి చిహ్నం...
అపోస్తులలో ప్రధముడుగా, నాయకుడుగా పలు సందర్భాలలో పేతురు నాయకత్వం గుర్తించబడింది. పునీత పౌలుడు పేతురు నాయకత్వాన్ని గుర్తిస్తూ,కొన్ని సందర్భాలలో నాయకునికి ఉండవలసిన లక్షణాలను గుర్తు చేస్తారు (గలతీ. (2:11-14). యూదయా సాంప్రదాయంలోని సున్నతి విషయంలో పేతురు నాయకునిగా సమస్యను పరిష్కరించడం అందరికీ ఆమోద యోగ్యమైంది (అ.కా. 15) ఇలా మొదట నాయకునిగా నియమించబడిన పేతురు అధికారం ఆయన వారసులైన పరిశుద్ధ పాపుగార్లకు సంక్రమిస్తుందని కతోలిక ప్రభోదం.శ్రీసభ అంతా వారి పాలన క్రిందకు వస్తుంది.వారు సర్వాధికారాలు కలిగి ఉండి తిరుసభలో నాయకులుగా విశ్వాసుల అధ్యాత్మిక మేలులను పరిరక్షిస్తుంటారు. అది పునీత పేతురు వారసులుగా పాపుగారలు చేసే పవిత్రక్రియ..
వాటికన్ రూపొందించిన శ్రీసభ అధికార ముద్రికలో (Coat of arms) కొన్ని సత్యాలు నిక్షిప్తం చేయబడి ఉంటాయి.ఈ ముద్రికలో రెండు తాళాలు మీద ఇంకొకటి తలక్రిందులుగా కనపడతాయి.ఆ చిత్రానికి అర్ధమిది. ఈ రెండు తాళాలు సీమోను పేతురుకివ్వబడిన అధికారాన్ని గుర్తు చేస్తాయి. బంగారు వర్ణం గల తాళం చెవి పరలోకంలో ఆయనకున్న అధికారాన్ని,వెండి వర్ణంగల తాళం చెవి భూలోకంలోని ఆయన అధికారానికి గుర్తు,ఆ రెండింటినీ ఏకం చేస్తూ ఒక తాడు వాటికి చుట్టబడి ఉంటుంది.ఈ రెండు అధికారాలు ఒకరికే ఉంటాయన్న సత్యాన్ని ఈ బంధం తెలియజేస్తుంది. పైనున్న కిరీటం మూడు అంచెలుగా కనబడుతూ, పేతురు వారసులైన పాపుగారి త్రివిధ వ్యవహారాధికారములను వివరిస్తాయి.అవి ఆయనను మహాకాపరిగా (Supreme Pastor), మహా బోధకుడుగా (Supreme Teacher), మహాయాజకుడుగా (High Priest( మనకు గుర్తు చేస్తాయి. ఈ స్వర్ణ మకుటం మీద బంగారు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగే సిలువ క్రీస్తుకున్న సర్వాధికారాన్ని ప్రస్ఫుటం చేస్తుంది.ఇలా కతోలిక సాంప్రదాయంలోని పేతురు అధికారానికి ఒక విశిష్టమైన అర్ధం వుంది.అది సువిశేషంలోనే చెప్పబడిన సత్యం పేతరు వారసులయిన పాపుగార్లకు అదే అధికారం ఇవ్వబడిందని గుర్తించుకోవాలి.ఇదే పేతురు చేతిలోని తాళాలు సూచించే భావం.
