నేటి పునీతులు: పునీత జోసఫ్ బర్నబాసు

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
20 Jul 2026
పునీత యుసేబియసుగారు చెప్పినట్లు ఏసుప్రభువుకుగల 12 మంది అపోస్తులు కాకుండా మరో 72 మంది ముఖ్య శిష్యులు కూడా ఉన్నారు. (లూకా 10:1,17) ఈ శిష్యుల్లోని వారే మత్తియాస్, మరియు జోసఫ్ బర్నబాసు అను వారలుకూడా. ఏసుక్రీస్తు ప్రభువును యూదా ఇస్కారియోతు అను శిష్యుడు ధనంపుచ్చుకొని శత్రువులకు అప్పగించాడు. అతని అంతరాత్మ సహింపక క్షమాపణ పొందకయే ఉరివేసుకొని తన జీవితానికి అంతంపలికాడు. శకునంచెప్పేబల్లి తానుపోయి కుడితి తొట్లో బడ్డట్టు ఇస్కారియోతు అంతకాలం ప్రభు శిష్యుడుగా
ఉండి నేర్చుకున్నదంతా బూడిదలో పోసిన
పన్నీరైంది. తొందరపాటు, ఆవేశం, ఆలోచనా
రాహిత్యం వినాశనానికి దారితీస్తుంది. ఎంతటి
పాపినైనా క్షమించే ఏసుని శిష్యునిగా ఉండి ఇలా
తన ఆత్మను పోగొట్టుకోవడం ఎంత దురదృష్టం.
అయితే ఇస్కారియోతు యూదా స్థానంలో మరొక అపోస్తలుని ఎన్నుకోవాలని మిగతా అపోస్తుల ఉద్దేశ్యం. "కావున వారు యూస్తు (జూస్తు) అను మారు పేరుగల బర్నబా అనబడిన యోసేపు, మత్తియ అను ఇద్దరను ముందునిలువబెట్టి....... ప్రార్థించిరి..
వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు ఓట్లు వేసిరి. అప్పుడు మత్తయ ఎన్నిక అయ్యెను. కనుక అతడు పదునొకండుగురు అపోస్తలులతో లెక్కించబడెను. (అ.కా. 1:25, 26) అయితే అలా 12 మంది శిష్యుల్లోకి చేరలేకపోయిన పునీతుడే ఈ యోసేపు యూస్తు బర్నబ్బాలేక జోపఫ్ బర్నబ్బాస్ జూస్తుగారు.
ప్రభువు సువార్త ప్రచారం చేస్తూ రక్షణ కార్యాన్ని ప్రజలకు అందించడంలో అపోస్తులతో పాటు తన ప్రార్థన, పరిశుద్ధతకు పెట్టింది పేరుగా నిలచినవారు ఈ జోసఫ్ బర్నబ్బా గారు. పునీతుడు. ఆదర్శనీయుడు. జోసెఫ్ అనగా దేవుడు పెంపుచేయును, సమృద్ధిపరచును అని అర్థం.
