కోత కాలం వరకు వేచి ఉండక తప్పదు

Fr. Sesetti Mariadas M.S.F.S.
18 Jul 2026
సామాన్య ఆదివారము - 16
జ్ఞాన గ్రంథం 12:13, 16–19,
రోమీ 8:26-27,
మత్త. 13:24-43
నేటి దివ్య గ్రంథ పఠనాలు దేవునియందు దండన గూర్చి, మానవుని మంచి చెడును గూర్చి ప్రస్తావిస్తున్నాయి. ఒక ప్రక్క భగవంతుడు దయతో, ఓర్పుతో పాపులను సహిస్తూ, అవకాశం ఇస్తూ క్షమిస్తారని అంటున్నాయి. ప్రజలందరిని సంరక్షించె దేవుడవు నీవు. నీకున్న సర్వాధికారం అందరిని కరుణతో చూచునట్లు చేయుచున్నది. పాపులకు పశ్చాత్తాపమును కరుణించెదవు. “అంటున్నాడు జ్ఞాని. రెండవ ప్రక్క “నీ సర్వాధికారాన్ని శంకించెవారికి నీ శక్తిని చూపెదవు. నీ శక్తిని ఎరిగి కూడ గర్వించి తిరుగువారిని దండించెదవు” అంటున్నాడు. 1వ పఠనంలో: మంచివారిని చెడ్డవారిని అందరిని సంరక్షిస్తారు అంటూనే చెడ్డవారిని శిక్షిస్తారు అంటున్నాడు. సువార్తలో కూడ ఇదే విధానం వ్యక్తం అవుతుంది. పనివారు చెడు మొక్కలను పెరికి వేద్దాం అనునపుడు యజమాని వాటిని కోతకాలం వరకు వదలివేయమంటున్నాడు. కొంత సమయం అవకాశం ఇస్తున్నాడు. కాని చివరన వాటిని కట్టలు కట్టి అగ్నిలో పడవేయ మంటున్నాడు. పాపులను కొంత కాలం సహించినప్పటికిని ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. ఏమిటీ వైరుధ్యం? ఏమిటి ఇందులోని మర్మం? దేవుడు నీతిమంతులను, పశ్చాత్తాప హృదయులను రక్షిస్తారు, బహుకరిస్తారు, పాపులను శిక్షిస్తారు అని, పాపులకు అవకాశం ఇచ్చినంతవరకు యిచ్చి ఆపై దండిస్తారని చాల సులభంగా, తేలిగ్గా అనవచ్చు కొందరు. కాని అంత తేలికైన విషయం కాదు. అని గ్రహించాలి.
భగవంతుడు ఒక పరమ రహస్యం. (Mystery) ఆయన కార్యములు మర్మగర్భితములె. ఆయన దైవ రాజ్యము పరమ రహస్యమే. కనుక ఆయన వైఖరి స్వభావం ఇది అని రూఢిగ చెప్పటం కష్టం. ఆయన దయదండన గూర్చి ఖచ్చితంగ చెప్పటం అసాధ్యం. భగవంతునితో ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కరికి రీతిగా ఉంటుంది. ఒకడు తప్పుచేసినపుడు వెంటనే ఏ దుష్ఫలితాలు సంచరించవు. తన తప్పును తెలిసికొని సరిదిద్దుకోవటానికి అవకాశం లభిస్తుంది. అలాంటివాడు దేవుడు తన పాపాన్ని ఓర్పుతో సహించి క్షమించాడని నమ్ముతాడు. వేరొకడు తప్పు చేసినపుడు వెంటనే ఏవో దుష్ఫలితాలు సంభవిస్తాయి. అతడు దేవుడు తనపై ఆగ్రహించి తనను శిక్షించాడని విశ్వసిస్తాడు. ఇద్దరిది వేర్వేరు అనుభవం. కనుక ఏ ఒక్కరు తనదె సంపూర్ణ సత్యం అనటానికి వీలులేదు. ఇద్దరి అనుభవము వాస్తవమే.
పాతనిబంధన గ్రంథాన్ని పరిశీలిస్తే ఈ విషయం కొంత అర్థం అవుతుంది. యావే ప్రభువు కొందరికి ఏలాంటి అవకాశం ఇవ్వకుండానే తప్పు చేసిన వెంటనె శిక్షించిన సందర్భాలు అనేకం. ఆదాము, ఏవమ్మలను వెంటనే దండించారు. ఆది 3:16-19. కైనును శిక్షించారు. ఆది 4. సౌలు రాజును ఒక్క తప్పుకే తిరస్కరించారు. 1 సామూ. 15:10-23. దేవుని మందసం పడిపోతుంటే అడ్డుకున్న ఉజ్జాను అక్కడికక్కడే మరణం పాలు చేసారు. 2 సామూ. 6:6-7. ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలను కొన్నిసార్లు వెంటనే శిక్షించారు. ఎంతో సౌమ్యుడు, ప్రీతిపాత్రుడు, తాను ప్రత్యేకంగ ఎన్నుకొన్నవాడైన మోషేను సైతం అతి చిన్న తప్పుకే పెద్ద శిక్ష వేసారు. ప్రజలతో విసిగి వేసారిపోయిన మోషే ఒక్కసారికి బదులు రెండు సార్లు బండను మోదినందుకు అతనిని వాగాన భూమిలో అడుగు పెట్టనీయలేదు. సంఖ్య 20:11-12 ఈ వర్గంవారి అనుభవం ఈ విధంగ పొందుపరచబడింది. “మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులను కొడుకులను, మనుమలను, మునిమనుమలను దండింతును” నిర్గ. 20:5. “మీ ప్రభువునైన యావె దహించువేయు అగ్నివంటివాడు. అసూయపరుడైన దేవుడు” ద్వితి. 4:24. మరొక ప్రక్క కొందరికి అవకాశాలు ఇచ్చారు. క్షమించారు. ఎడారిలో హీబ్రులు బంగారు దూడను పూజించినపుడు వెంటనే వారిని దండించలేదు. మోషే వేడికోలును ఆలకించి క్షమించారు. నిర్గ. 32:10, 14; దావీదు రాజు తన సేవకుడు ఉరియా భార్యను చెరచి, నమ్మక ద్రోహంతో వెన్నుపోటు పొడిచి చంపినప్పటికిని దండించలేదు. 2 సామూ. 11:12. అతని వంశరాజులు సౌలు రాజుకన్నా ఘోరమైన పాపాలు కట్టుకొన్నప్పటికిని వారిని దండించలేదు. త్యజింపలేదు. 2రాజు. 16:3-4; 21:1-9 మొ||నవి. త్రోవ తప్పిన యూదా ప్రజలను పదేపదే ప్రవక్తల ద్వారా హెచ్చరించి వారితో సహవాసం వహించారు. అందువలన రెండవ వర్గంవారు ఇలా ప్రకటించారు. “ప్రభువు కరుణామయుడు. దయా పరుడైన దేవుడు. సులభముగా కోపపడువాడు కాడు. సత్యము ప్రేమ చూపువాడు. నమ్మదగినవాడు. అతడు వేలకొలది ప్రజలను కృపతో చూచువాడు.
మన దోషములను అపరాధములను, పాపములను మన్నించువాడు. “నిర్గమ 34:6-7, యిర్మియ 3:12; 31:20; 32:18 యావేలు 2:13; కీర్త 86:15, 103:8 మొ||నవి.
భగవంతుడు సార్వభౌమాధికారి. ఇది గుర్తించి అంగీకరించాలి. మొదటి పఠనం నేపధ్యం ఇదే. ఆయన ఎవరికిని జవాబు దారుడు కాదు. తనను తాను నిరూపించు కోవలస్సిన అవసరం లేదు. ఆయన కార్యముల గూర్చి ప్రశ్నించే శక్తి ఎవరికిలేదు. ఆయన నీతి న్యాయములను విమర్శించే విజ్ఞతయు ఎవరికీ లేవు. ఇది జ్ఞాన గ్రంథ కర్త ముఖ్య సందేశం. నమ్మకం, సువార్తలోను ఇదే భావం వ్యక్తం అవుతున్నది. ఎవరు ఎప్పుడు ఏం చేయాలో నిర్ణయించేది యజమానియే గాని మరెవరుకాదు. ఆయన మాటలును క్రియలు వింతగ, విడ్డూరంగ, నష్టదాయకంగ కనిపించవచ్చు. కాని ఆయనే అంతిమ నిర్ణేత! దయ అయినా దండక అయినా ఆయన యిష్టం. ఎపుడు ఎవరిని ఎలా దయతలుస్తారో, లేక దండిస్తారో ఆయనకే తెలుసు.
మానవుని మంచి చెడులు, పాపులు పవిత్రులు. దేవుని రాజ్యం రెండు దశలుగా ఉంది. ఒకటి లోకంలోను రెండవది దశలుగా ఉంది. ఒకటి ఈ లోకంలోను రెండవది మరు లోకంలో, ఈ లోకంలోవలె ఇహలోక దేవుని రాజ్యంలో కూడ మంచి చెడులు కలిసి ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు? దుష్టుడు ఎవడు? ఎలా వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడు? మంచి చెడుగా, చెడుమంచిగా మారుతుందా? మంచి వాడైన దేవుడు చెడులోకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇత్యాది ప్రశ్నలు మానవుని అనాదిగా పీడిస్తూనే ఉన్నాయి. రకరకాల పరిష్కారాలు, సిద్ధాంతాలు ప్రతి పాదించారు. ఇదొక అంతు చిక్కని మర్మం అని గమనించాలి. మతాలు రూపొందక మునుపే, పరిశుద్ధ గ్రంధాలు వెలువడకముందే లోకంలో 'మంచి చెడులు' ఉన్నాయి. వాటి పరిష్కారానికి మతాలు, గ్రంధాలు, ఏర్పరచబడినవి. వీటిని సూక్ష్మంగా మూడు నమ్మకాలుగ చెప్పవచ్చు.
1. దేవుడు ఒక్కడే. ఆయన చాలచాల మంచివాడు. మానవుని తన పోలికగా మంచివాడిగ సృష్టించాడు. మంచి సృష్టిని చేసాడు. చెడుఎలా వచ్చింది? పరలోకంలో దేవ దూతలు తప్పుచేసి దుష్టులు అయ్యారు. వారు మానవులను చెడు త్రోవపట్టి సున్నారు. ఇది ఒక నమ్మకం అయితే ఆ దూతలను చెడుకు పురమాయించెందెవరు? సమస్య మరల మొదటికి వస్తుంది. అటు మంచివాడైన దేవునిక చెడును ఆపాదించటం ఇష్టం లేక ఇటు తనలోని చెడును అంగీకరించటానికి మనసొప్పక తన తప్పును వేరొకరిమీదకు త్రోసివేయటానికి మానవుడు చేసిన ప్రయత్నమే దుష్టుని సృష్టి.
2. ఈ విశ్వంలో రెండు బలమైన శక్తులు ఉన్నాయి. మంచివాడైన దేవుడు, దుషుడు, వీరిద్దరు మానవునికి పై పెత్తనం చెలాయించటానికి చూస్తుంటారు. మంచి శక్తి ఆధిపత్యం వహించినపుడు మానవుడు మంచిని చేస్తాడు. చెడుశక్తి చేత చెడుచేస్తాడు.
3. భగవంతుడే సర్వస్వం. విశ్వం అంత ఆయనలోనే ఉంది. ఆయనే అందరి తలవ్రాతలు వ్రాస్తాడు. ఎవరు ఎపుడు ఏం చేయాలో ముందుగానే నిర్ణయిస్తాడు. చేసేవాడు ఆయనే చేయించేవాడు ఆయనే. నరులు కేవలం నిమిత్తమాత్రులు మంచి చెడులకు మూల కారణం ఆయనే.
ఏది ఏమైనప్పటికిని ఒక విషయం స్పష్టం. అన్ని సిద్దాంతాలు కూడ ఒక విషయంలో ఏకాభిప్రాయాన్ని తెలుపుతున్నాయి. మనిషిలోని చెడుగుకు కారణం మనిషికాదు. బాహ్యశక్తి అంటున్నాయి. ఇది పూర్తిగ ఎవరు విప్పలేని మర్మం. మనిషిలో చెడు ఉంది. దానిని సరిదిద్దుకొనే అవకాశం, శక్తి కూడ మనిషికున్నాయి. కనుక మనిషి తన తప్పులను తెలిసికొని సరిదిద్దుకోవాలి. కుంటే ఆతనికే నష్టం. తన తప్పులకు తానే బాధ్యత వహించాలి. ఈ ఉపమానం వినగానే రైతు చాల తెలివి తక్కువగా ప్రవర్తించినట్లు అనిపిస్తుంది. దైవ కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కాక వింతగా, పిచ్చిగా అనిపిస్తాయి. యేసుకు వ్యవసాయం గూర్చి మంచి అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది. వ్యవసాయదారుడు పొలాన్ని బాగా దున్ని ఎలాంటి కలుపు మొక్కలు లేకుండ చేసి అందులో మంచి విత్తనాలు చల్లుతాడు. ఎంత శుభ్రం చేసినను మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. పైరు ఒక దశకు వచ్చేవరకు కలుపు మొక్కలను తీసివేస్తూనే ఉంటారు. మంచి మొక్కలు బాగా పుంజు కొని గింజ కట్టటం ప్రారంభించినప్పటినుండి కలుపు మొక్కల జోలిపోరు. ఈ దశలో మంచి మొక్కలు బాగా పెరిగి ఎక్కువగా ఉంటాయి. కలుపు మొక్కలు తక్కువగా ఉంటాయి. ఈ దశలో వాటివలన పంటకు నష్టం తక్కువ. అంతేగాక రెండు కలిసి పెనవేసికొని ఉంటాయి. వాటిని తీస్తే మంచివి కూడా పోతాయి. కోత కాలం వరకు వేచి ఉండక తప్పదు.
పైన చూచినట్లుగ మంచి చెడుల మర్మం అంతు చిక్కనిది. వ్యక్తిగతంగాను మంచి చెడులు ఉన్నాయి. సంఘంలోను మంచి చెడులు ఉన్నాయి. మొక్కలకు మనుష్యులకు ఒక తేడా ఉంది. మంచి చెడు మొక్కలు అలాగే ఉండిపోతాయి. అవి మారవు. మంచివి చెడుకావు. చెడ్డవి మంచివికావు. మనిషి పూర్తిగ మంచికాదు పూర్తిగ చెడు కాదు, రెంటి కలయిక, మొక్కల్లా కాకుండ ఒక మనిషియే మంచివాడు కావచ్చు. చెడ్డవాడు కావచ్చు. అయితే మనిషిలో చెడును ఎంత ఏరివేసినా మరల మరల పిలకలు పెడుతూనే ఉంటాయి. దీనిని పౌలుగారు సైతం పూర్తిగ వర్ణించలేక పోయారు. రోమ 7:14-25. “నేను చేయగోరు దానిని చేయక నేను ద్వేషించు దానిని చేయుచుందును” 15. “నాయందు అనగా నా భౌతిక శరీరమందు మంచి అనుననది లేదని నాకు తెలియును. ఏలయన మంచి చేయవలయునని కోరిక నాలో ఉన్నను అది చేయుటకు నాలో శక్తి లేదు. 18వ మానవుని ఈ ద్వంద్వ ప్రకృతిని వర్ణించుట, రూపు మాపుట అంత సులభం కాదు. దీనినుండి మనలను తప్పించగల వారు క్రీస్తు ఒక్కరే. ఆయనలో ఆయన ఆత్మతో సహకరిస్తే కొంత విజయం సాధించవచ్చు ఆమెన్.
