నేటి పునీతులు : పునీత ఫ్రెడరిక్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
18 Jul 2026
ఫ్రిజియనుల(హాలెండు) రాజైన ర్యాడ్ ను మనుమడే ఫ్రెడరిక్ గారు. ఉట్రెచ్ పీఠంలో ఉండేవారు. 9వ శతాబ్దం ఆరంభంలో ఈ బాలుడు ఎల్లప్పుడు గురువుల మధ్యనే తిరుగాడుతూ భక్తి, పవిత్ర సూక్తులు నేర్చారు. ఎందరో అన్యులకు, గురువులతో పాటు తానుకూడ సువార్తను నేర్పించేవారు. అలాగే క్రమంగా పెరిగి తానుకూడ ఉట్రెచ్ పీఠాధిపతి రిక్ ఫ్రీడ్ గారి వద్ద గురుపట్టంపొంది గురుత్వ సేవలు అందించడం మొదలు పెట్టారు.
లెక్కలేనంతమంది అన్యులను విగ్రహారాధకులను తన బోధలచే మనసుమార్చి జ్ఞానస్నానాలిచ్చారు.
ఫాదర్ ఫ్రెడరిక్ గారు అక్కడి బిషప్పుగారి మరణానంతరం క్రీ॥శ॥ 825లో బిషప్పుగా ఎన్నికై పీఠాధిపత్యం స్వీకరించారు. గ్రామ గ్రామాన శ్రీసభ నెలకొల్పబడాలని వీరి ఆశయం. అందుకు తగిన ఉపదేశకులను, సేవకులను వినియోగించారుకూడా. పునీత ఓడు గార్ని మరికొందరు ఉత్సాహవంతులైన సహాయకులను తమ పీఠంలో ఉత్తర ప్రాంతాలకు పంపి వేదవ్యాప్తికి కారకులయ్యారు.
అయితే బిషప్ ఫ్రెడరిక్ గారు ఆ హాలెండు దేశ చక్రవర్తియైన డెబొనెయిర్ లూయిస్ కు వారి కుమార్లు, వారి సవతి తల్లి చక్రవర్తిని జూడిల్ మధ్య కలహాలలో జోక్యంచేసుకొనినట్లుగా చెప్పబడింది. రాజభవనంలో నివశించే అనేకమంది పేదలకు దాన ధర్మాలద్వారా వారిని నీతి మార్గంలోకి తెచ్చి మంచి క్రైస్తవులనుగా మర్చారు ఫ్రెడరిక్ గారు. అలాగే అవినీతికరమైన చెడుజీవితంలో ఉన్న చక్రవర్తిని జూడితమ్మకు అనేక విధాలుగా హితబోధచేసి మార్చాలని ప్రయత్నించారు. ఆమె కొరకు ప్రార్థించారు.
మారటానికి బదులుగా ఆమెలో బిషప్పుగారి పై పగ ప్రతీకారం పెంచుకుంది. తనకు రావాల్సిన మంచి పేరునంతా బిషప్పుగారే కొట్టేశారని తన నీతిమాలిన జీవితం బట్టబయలైనందుకు ఆగ్రహించింది.
క్రీ||శ|| 838 జూలై 18న వారు దివ్యబలిపూజ నర్పించి కడపటి ఆశీర్వాదం ఇవ్వగానే ఇద్దరు దుండగులు కత్తులతో ప్రవేశించి పూజావస్త్రములమీద ఉండగనే బిషప్పుగారిని పొడిచి పొడిచి పారిపోయారు. నెత్తురోడుతూ పీఠం ముందే కూలబడి “నిత్య జీవితులరాజ్యంలో నేను దేవుని పొగడెదను” (కీర్త. 114) అని స్మరిస్తూ పరలోక ప్రాప్తినొందారు. చక్రవర్తిని పంపిన హంతకులే ఈ పని చేశారని తెలియవచ్చింది. ఫ్రెడరిక్ అనగా శాంతిపాలకుడు, సమాధాన ప్రభువు అని అర్థం.
